Dovely Bike Taxi Service: Zainab And Uzma Making India Safer For Women Only Bike Taxi Service | Sakshi
Sakshi News home page

Dovely Bike Taxi మహిళల కోసం మహిళలే... హైదరాబాదీ అక్కాచెల్లెళ్లు

Published Tue, Apr 30 2024 11:49 AM

Zainab and Uzma Making India Safer for women women only bike taxi service

దేశంలోనే తొలిసారి మహిళల నిర్వహణలో మహిళ రైడర్లకోసం రైడింగ్‌ సేవలు

రాత్రి వేళల్లో మహిళలు, బయటికి వెళ్లాలంటేనే భయపడే రోజులు. మెట్రోలు, క్యాబ్‌ లాంటిసేవలు  ఎన్ని అందుబాటులో ఉన్నా భద్రత ఎపుడూ ఒక  సవాల్‌గానే ఉంటుంది.  ప్రతీ పదిమంది ఏడుగురు వేధింపులకు లోనవుతున్నారు. ఈ తరుణంలో అత్యవసర సమయంలో బయటకు వెళ్లాలనుకునే మహిళల కోసం నగరంలో డోవ్లీ సేవలు విశేషంగా నిలుస్తున్నాయి.  హైదరాబాద్‌ నగరంలో మహిళలు, బాలికల భద్రత, సౌకర్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ సర్వీసును ప్రారంభించారు సోదరీమణులు. భారతదేశంలోనే తొలిసారిగా మహిళలకోసం మహిళా డ్రైవర్లతో మహిళలే నిర్వహిస్తున్న సేవలు కావడం విశేషం. 

హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త ద్వయం మహిళల కోసమే ఈ  బైక్ టాక్సీ సర్వీస్‌ను ప్రారంభించింది. జైనాబ్‌ కాతూన్‌,ఉజ్మా కాతూన్‌ ప్రత్యేక బైక్టాక్సీ సర్వీస్ ప్లాట్‌ఫారమ్‌ ‘డవ్‌లీ’ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు.  డోవ్లీలో రైడర్లు, కస్టమర్లు  మహిళలే  ఉంటారు. ఓలా, ర్యాపిడో తరహాలో రెంటల్‌ బైక్‌ (బైక్‌ ట్యాక్సీ) సర్వీసులు డోవ్లీఅందిస్తుంది. వీరికి మహమ్మద్ ఒబైద్ ఉల్లా ఖాన్, మసరత్ ఫాతిమా సహకారం అందించారు.

భద్రతకు పెద్ద పీట
‘డవ్‌లీ’ వ్యవస్థాపకురాలు,సీఈవో  జైనాబ్ ఖాతూన్  మాటల్లో చెప్పాలంటే నగరంలోని మహిళలు , బాలికలకు రోజువారీ ప్రయాణాన్ని సురక్షితంగా, సులభంగా ,సౌకర్యవంతంగా  సేవలందించడమే ఈ ప్రాజెక్ట్  లక్ష్యం. భద్రతకు పెద్ద పీట వేస్తూ  రైడ్‌ మొదలైనప్పటి నుంచి ఎండ్‌ అయ్యే వరకు ప్రతి క్షణం ప్రయాణాన్ని మానిటర్‌ చేస్తుంటారు. అయితే  రైడర్‌  ప్రయాణం ముగిసేవరకు లైవ్‌ లొకేషన్‌ను ఆన్‌లోనే ఉంచాల్సి ఉంటుంది.  వాట్సాప్‌  వేదికగా మొదలైన డోవ్లీ సేవలు చాలా తక్కువ సమయంలోనే బాగా విస్తరించాయి. వందలమంది మహిళా డ్రైవర్లకు  ఉపాధి లభించింది.  ప్రస్తుతం పరిమిత ప్రాంతాలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవలను పెంచి, భవిష్యత్తులో రైడర్ల సంఖ్య పెంచి వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని భావిస్తున్నారు. విరివిగా సేవలు అందించే యోచనలో డోవ్లీ ఫౌండర్లు ఉన్నారు.   దీంతో వీరి స్టార్టప్‌ మరింత విజయం సాధించాలని నెటిజన్లు  వ్యాఖ్యానించారు. 

 

Advertisement
Advertisement