పుడమి మిత్ర | Women Farmers Nancharamma special Story | Sakshi
Sakshi News home page

పుడమి మిత్ర

Apr 8 2025 6:43 AM | Updated on Apr 8 2025 6:43 AM

Women Farmers Nancharamma special Story

చదువు పాఠశాల దాటక ముందే ఆమెకు పెళ్లయింది. ముగ్గురు పిల్లలకు జన్మ ఇచ్చింది. ఆ గృహిణి అంతటితో ఆగిపోలేదు. భర్త తోడ్పాటుతో ముందడుగు వేసి ప్రైవేటుగా చదువు కొనసాగించింది. డిగ్రీ పూర్తి చేసింది. మహిళా స్వయం సహాయక సంఘంలో చేరి, అంచెలంచెలుగా ఎదిగింది.

 ఆ క్రమంలోనే ప్రకృతి వ్యవసాయం నేర్చుకుంది. తమ పొలంలో ఆచరిస్తూ పట్టు సాధించింది. ప్రకృతి సేద్య శిక్షకురాలిగా ఎదిగింది. హిందీ నేర్చుకుంది. ఇతర రాష్టాలకు వెళ్లి ప్రకృతి వ్యవసాయంలో రైతులకు శిక్షణ ఇచ్చి వచ్చింది. పట్టుదల, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటే మారుమూల గ్రామానికి చెందిన సాధారణ మహిళా రైతు ఎంత ఎత్తుకు ఎదగగలరో నిరూపించిన నాంచారమ్మకు జేజేలు! 

చిత్తూరు జిల్లా సోమల మండలం పొదల­గుంటపల్లె పంచాయతీ తుగడం వారి పల్లెకు చెంది­న ఈశ్వరమ్మ, చెంగల్రాయులు దంపతుల రెండో సంతానం నాంచారమ్మ. ఆమెకు అక్క సుధారాణి, తమ్ముడు విజయ్‌కుమార్, చెల్లెలు రజని ఉన్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం. నాంచారమ్మకు చిన్ననాటి నుంచే సేద్యంపై మక్కువ. 9వ తరగతి చదివే రోజుల్లోనే ఆమెకు వెంకటరత్నంతో వివాహమైంది. ముగ్గురు పిల్లల్ని కన్న తర్వాత భర్త సహకారంతో ఆమె చదువు పునఃప్రారంభించారు. ఓపెన్  స్కూల్‌ ద్వారా 10వ తరగతి, ఆ తర్వాత ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. 3 నెలల పాటు కంప్యూటర్‌ కోర్సులో శిక్షణ పొందారు. 

కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో 2000వ సంవత్సరంలో మహిళా స్వయం సహాయక సంఘంలో చేరారు. మండల సమాఖ్య కార్యదర్శిగా, జిల్లా సమాఖ్య ఈసీగా పనిచేశారు. మార్కెటింగ్‌ కమిటీ సభ్యురాలిగా, మార్కెటింగ్‌ విభాగంలో స్టేట్‌ రిసోర్స్‌ పర్సన్ గా విధులు నిర్వర్తించారు. తదనంతర కాలంలో ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. 

ప్రధాన పంటలో 20 అంతర పంటలు
స్వగ్రామంలో తమ రెండెకరాల్లో ప్రకృతి సేద్యం చేపట్టారు. ఆ పొలంలో అప్పటికే ఏడాది క్రితం నాటిన మామిడి మొక్కలకు 400 కేజీల ఘన జీవామృతం వేసి, అంతరపంటగా వేరుశనగ సాగు చేశారు. ప్రధాన పంటలతో పాటు 20 రకాల అంతర పంటలను సాగు చేస్తున్నారు. వేరుశనగ, అనప, అలసంద, కంది, పొద్దుతిరుగుడు, పెసర, మినుము, ఆముదం, బెండ, టమాటా, గోరుచిక్కుడు, మొక్కజొన్న, జొన్న, సజ్జ, గుమ్మడి, బీర, కాకర, సొర, కీర, ఉలవ తదితర పంటలను పండిస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 
→ ‘ప్రకృతి వ్యవసాయంలో మొదటి సంవత్స­రమే సాధారణ లాభాలు వచ్చాయని, రెండో ఏడాది నుంచి 10 శాతం అధిక దిగుబడి సాధించినట్లు నాంచారమ్మ తెలిపారు.
→ ప్రకతి వ్యవసాయంలో పెట్టుబడి తక్కువగా ఉంటుందని నాంచారమ్మ చెబుతున్నారు. రసా­యన ఎరువులు వాడి వేరుశనగ పంట సాగు చేస్తే ఎకరాకు విత్తనకాయలు, కూలీలు, ఎరువులు మొత్తం కలిపి రూ.35 నుంచి రూ.40 వేలు ఖర్చవుతుంది. అదే ప్రకృతి వ్యవసాయం చేస్తే రూ.10–20 వేలు చాలన్నారు. 
→ పట్టభద్రురాలై ఉండటం, అనంత మహిళా సమాఖ్య గ్రూపుల సహకారంతో హిందీ భాషపై పట్టు సాధించటంతో ప్రకృతి వ్యవసాయ విస్తరణ కార్యక్రమాల్లో ఆమెకు ప్రాధాన్యం దొరికింది.

– యెండ్లూరి మోహన్ , సాక్షి తిరుతి డెస్క్, 
సహకారం: తుడుము తులసీరామ్, పాకాల

Advertisement
 
Advertisement
Advertisement