నీటితో ఇంటిపంట | Kolkata student Vansika Jhawar creates a low-cost hydroponic farm | Sakshi
Sakshi News home page

నీటితో ఇంటిపంట

Jun 4 2026 5:59 AM | Updated on Jun 4 2026 5:59 AM

Kolkata student Vansika Jhawar creates a low-cost hydroponic farm

స్వయం ‘అన్నపూర్ణ’ 

అన్నం పెట్టే నేల... అన్నం పెట్టే పంట అన్నం పండించే చేయి... అన్నపూర్ణలు. ఆహారం విషతుల్యం అవుతున్న ఈ రోజుల్లో తనే ఒక అన్నపూర్ణగా ఎందుకు కాకూడదు అనుకుందో అమ్మాయి. ‘హైడ్రోపోనిక్‌ రైతు’గా మారి బాల్కనీలోనే తన ఆహారం తానే పండించుకుంటోంది. కోల్‌కతా అమ్మాయి వంశికా ఝావర్‌ మార్గంలో నడిస్తే మరెందరో అన్నపూర్ణలవుతారు.

‘కళింగ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ’ లో ఇంజినీరింగ్‌ చదువుకుంటున్న 22 ఏళ్ల వంశికా ఝావర్‌కు ఆరోగ్యం బాగుండటం లేదు. డాక్టర్‌ దగ్గరకు వెళితే ‘పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ డిసీజ్‌’ అన్నారు. ఆ తర్వాత పరీక్షలు చేసి ‘పాలీ ఎండోక్రైన్‌ మెటబాలిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌’ అని పిలిచే పీఓఎంఎస్‌గా నిర్ధారణ చేశారు.
‘ఇప్పుడు నేనేం చేయాలి’ అని అడిగింది వంశిక.

‘నువ్వు తినే తిండిలోనే విషం ఉంది. నీ జీవనశైలి మార్చుకో. హై్రపోటీన్, లోకార్బ్‌ ఆహారం తీసుకో, ప్రాసెస్‌ చేసిన షుగర్‌ వద్దు’ ఇలా సూచనలు చేశాడు డాక్టర్‌. అప్పటికే వంశిక మందులతో విసిగిపోయింది. ఆరోగ్యంగా బతకాలంటే ఏం చేయాలి అనుకుంది.

సాగిన శోధన
మనం తింటున్న ‘ఫ్రెష్‌’ కూరగాయలు నిజంగా ఫ్రెష్షేనా అని డౌట్‌ వచ్చింది వంశికాకు. పరిశీలిస్తే అవి గ్రోత్‌ హార్మోన్లు, పురుగు మందులు, ఎరువులతో నిండి ఉన్నాయని అర్థమైంది. ‘మనకు తాజా కూరగాయలు దొరకడం పెద్ద సవాలు. అందుకే మనమే రసాయనం లేకుండా తిండి పండించుకోవాలి అనిపించింది. అలా హైడ్రోపోనిక్‌ వ్యవసాయం వైపు అడుగేశా’ అని ఆమె చెబుతోంది వంశిక. ‘హైడ్రోపోనిక్స్‌’ అంటే మట్టి లేకుండా, నీటిలో పోషకాలు కలిపి మొక్కలు పెంచే పద్ధతి. స్థలం సమస్య, నీటి కొరత సమస్య, వాతావరణం అనిశ్చితి... ఈ మూడు పెద్ద సమస్యలకు ఇది ఒక్కటే సమాధానం అని వంశిక నమ్మింది. నగరాల్లో, మారుమూల ప్రాంతాల్లో కూడా ఏడాది పొడవునా తిండి పండించేలా తక్కువ ఖర్చుతో కూడిన మైక్రో–ఫామ్‌ను డిజైన్‌ చేసింది. ఒక రకంగా ఇది ప్రాజెక్ట్‌ కాదు, తన ఆరోగ్యం కోసం తను మొదలుపెట్టిన పోరాటం.

అదిగో అన్నపూర్ణ
వంశిక తన ఇంటి బాల్కనీనే పొలం చేసింది. పేరు ‘అన్నపూర్ణ’ అని పెట్టింది. పెట్టుబడి సున్నా. సాధనాలుగా కన్ స్ట్రక్షన్‌ సైట్‌లో పారేసిన పైపులు వాడింది. హైడ్రోపోనిక్స్‌ పద్ధతిలో వ్యవసాయం మొదలుపెట్టింది. కొంచెం డబ్బు హైడ్రోపోనిక్‌ సొల్యూషన్స్, విత్తనాల కోసం మాత్రమే ఖర్చు చేసింది. ‘నా మొదటి పెట్టుబడి దాదాపు జీరో’ అంటుంది వంశిక.

అందరూ అందుకోవాల్సిన హైడ్రోపోనిక్స్‌
భారతదేశంలో హైడ్రోపోనిక్స్‌ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నా, నెమ్మదిగా ప్రజాదరణ పొందుతోంది. సంప్రదాయ వ్యవసాయంతో పోలిస్తే ఈ పద్ధతిలో 95 శాతం నీరు ఆదా అవుతుంది. 30 శాతం అధిక దిగుబడి వస్తుంది. నేల అవసరం లేదు కాబట్టి పురుగుమందుల వాడకం తగ్గుతుంది. నగరాల్లోని బాల్కనీలో, ఇంటి పైకప్పు మీద కూడా కూరగాయలు పండించుకోవచ్చు. ఆరోగ్య సమస్యతో బాధపడే లక్షలాది మంది మహిళలకు, కల్తీ ఆహారానికి భయపడే ప్రతి కుటుంబానికి ఇది ఒక భరోసా. జీవనశైలి జబ్బులకు మాత్రల కంటే ప్లేట్‌లో ఉండే తిండే పెద్ద మందు. ఆ తిండిని స్వచ్ఛంగా, మన చేత్తో పండించుకునే మార్గాన్ని వంశిక చూపిస్తోంది. కోల్‌కతాలోని చిన్న బాల్కనీలో మొదలైన ‘అన్నపూర్ణ’ రేపు దేశంలోని ప్రతి ఇంట్లో ప్రతిధ్వనిస్తే, అదే అసలైన వ్యవసాయ విప్లవం.                                    ∙

మొదట ఆకుకూరలు
వంశిక మొదట ఆకుకూరలతో మొదలుపెట్టింది. ఎందుకంటే అవి తేలికగా పెరుగుతాయి. రెండు నుంచి మూడు వారాల్లో కోతకు వస్తాయి. తన మొదటి పంటను ల్యాబ్‌లో పరీక్ష చేయించింది. ఫలితాలు అద్భుతం. సంప్రదాయ వ్యవసాయంలో పండిన వాటి కంటే హైడ్రోపోనిక్‌ పంటలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు కూడా చెబుతున్నాయని ఆమె గర్వంగా చెబుతోంది. తన ప్రయోగం సక్సెస్‌ అయ్యాక ఆమె ఆలోచనలు కుంకుమ పువ్వు వైపు మళ్లాయి. ఖరీదైన పంట అయిన శాఫ్రాన్ ను కూడా హైడ్రోపోనిక్స్‌లో పండించవచ్చనీ, అది తన తదుపరి లక్ష్యం అనీ చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement