
శరీరంలో కీలకమైన ఏదైనా అవయవం పాడైపోయి.. ప్రాణాపాయస్థితిలో ఉన్నపుడు అవయవ మార్పిడి ఒక్కటే మార్గం. అలా దానం చేసే అవకాశం ఉన్న ఆవయవాల్లో ముఖ్యమైనవిగా కిడ్నీలు, లివర్. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు తమ అవయవాలను దానం చేయడంమంటే అవతలివ్యక్తికి ప్రాణ దానం చేయడమే. కానీ భర్తను కాపాడుకునేందుకు తన అవయవాన్ని దానం చేసిన సంతోషం.. అంతలోనే విషాదంగా మారింది. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పూణేలోనిఒక ప్రయివేటు ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
భర్తకు తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసిన ఒక మహిళ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత కొన్ని రోజులకే మరణించింది. దీనితో మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పూణేలోని సహ్యాద్రి ఆసుపత్రికి నోటీసు జారీ చేసింది. మార్పిడి ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను సమర్పించాలని ఆదేశించినట్లు ఆరోగ్య సేవల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నాగనాథ్ యెంపల్లె ఆదివారం తెలిపారు. గ్రహీత, దాత వివరాలు, వారి వీడియో రికార్డింగ్‌లు, చికిత్స విధానం అన్నింటి వివరాలను అందించాలని ఆసుపత్రిని కోరామని చెప్పారు.
ఈ కేసులో భర్త, రోగి బాపు కోమ్కర్, అతనికి లివర్ దానం చేసిన భార్య కామిని ఆగస్టు 15న ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. మార్పిడి శస్త్రచికిత్స తర్వాత బాపు కోమ్కర్ ఆరోగ్యం క్షీణించి, ఆగస్టు 17న మరణించాడు. మరోవైపు ఇన్ఫెక్షన్ కారణంగా కామిని ఆగస్టు 21న కన్నుమూసింది. దీనికి ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ బంధువులిద్దరి మరణాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ప్రామాణిక వైద్య ప్రోటోకాల్‌ల ప్రకారం శస్త్రచికిత్సలు జరిగాయని ఆసుపత్రి పేర్కొంది. దర్యాప్తులో అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నామని వివరించింది. అనేక సమస్యలతో బాపు కోమ్కర్ చాలా తీవ్రమైన పరిస్థితిలో తమ వద్దకు వచ్చాడని, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చాలా క్లిష్టమైన ఆపరేషన్‌అని పేర్కొన్నారు. ఈ విషంలోవారికి పూర్తిగా అన్ని విషయాలు వివరించి కౌన్సెలింగ్ అందించామని ఆసుపత్రి పేర్కొంది. దురదృష్ట వశాత్తు, మార్పిడి తర్వాత గ్రహీతకు కార్డియోజెనిక్ షాక్ వచ్చిందని తెలిపింది. అలాగే కామిని తొలుత బాగా కోలుకున్నప్పటికీ, సెప్టిక్‌షాక్ కారణంగా చనిపోయిందని వెల్లడించింది. కానీ ఈ కష్టకాలంలో బాధిత కుటుంబంపై తమకు సానుభూతి ఉందని తెలిపింది.
నోట్ : ప్రస్తుత సమాజంలో అవయవ దానం ఆవశ్యకత బాగా పెరుగుతోంది. ఎలాంటి భయాలు, ఆందోళనలు లేకుండా పూర్తి అవగాహనతో అవయదానం చేయాల్సిన అవసరం ఉంది. ఇందులోకు కుటుంబ సభ్యులు, ఇతర అర్హులైన వారు ముందుకు రావాలి. దాని కంటే ముందు అనారోగ్య పరిస్థితి మరింత ముదరకుండా జాగ్రత్త పడటం, చక్కటి జీవనశైలి అలవర్చుకోవడం చాలా ముఖ్యం.
ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!