అడినాయిడ్స్, టాన్సిల్స్ రెండు ఒక్కటేనా..? | What Are Adenoids And Solutions | Sakshi
Sakshi News home page

అడినాయిడ్స్, టాన్సిల్స్

Jan 21 2021 9:49 AM | Updated on Jan 21 2021 9:49 AM

What Are Adenoids And Solutions - Sakshi

చాలా మంది అడినాయిడ్స్, టాన్సిల్స్‌... ఈ రెండింటినీ ఒకటే అనుకుని పొరబడుతుంటారు. అడినాయిడ్స్‌లో సమస్య వస్తే టాన్సిల్స్‌ వాచాయని అనుకుంటుంటారు. కానీ అవి రెండూ వేర్వేరు. అసలు అడినాయిడ్స్‌ అంటే ఏమిటి, ఎక్కడ ఉంటాయి... అన్న విషయాలు తెలుసుకుందాం. అడినాయిడ్స్‌ ముక్కు లోపలి భాగానికి ఒకింత వెనకగా, నోటిలోపల అంగిటి పైభాగాన ఉంటాయి. అవి స్పాంజి కణజాలంతో తయారై  మెత్తగా, గుంపులుగా అంటే ద్రాక్షగుత్తిలా ఉంటాయి. నోరు తెరవగానే టాన్సిల్స్‌ కనిపిస్తాయిగానీ, అడినాయిడ్స్‌ కనిపించవు. వీటిని చూడటానికి ఎండోస్కోప్‌ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. అదేగాకుండా తల ఎక్స్‌–రే తీసినప్పుడు కూడా వాటి పరిమాణం వంటివి తెలుస్తాయి. 

అడినాయిడ్స్‌ పనేంటి? 
ఇవి పిల్లలను ఇన్ఫెక్షన్‌ నుంచి కాపాడుతుంటాయి. టాన్సిల్స్‌ లాగానే అడినాయిడ్స్‌ కూడా మనం గాలి పీల్చేటప్పుడు, తినేటప్పుడు ఎలాంటి హానికరమైన బ్యాక్టీరియాగాని, వైరస్‌గాని లోపలికి ప్రవేశించకుండా కాపాడతాయి. హానికరమైన బ్యాక్టీరియా తాలూకు యాంటీబాడీస్‌తో అడినాయిడ్స్‌లో ఉండే యాంటీబాడీస్‌ మనలోనికి శత్రుకణాలు ప్రవేశించినప్పుడు వాటితో పోరాడి మనల్ని ఇన్ఫెక్షన్‌ల నుంచి కాపాడతాయి. అంటే... రక్షకభటుల్లా పనిచేసే ఇవి చిన్నపిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. చిన్నపిల్లల్లో వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉండి, వయసు పెరుగుతున్న కొద్దీ ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది. అందుకే పిల్లలు పెద్దవుతున్న కొద్దీ అడినాయిడ్స్‌ సైజ్‌ తగ్గుతూ, అవి క్రమంగా కృశించిపోతూ ఉంటాయి. ఐదేళ్ల వయసులో అడినాయిడ్స్‌ కృశించిపోతాయి. యుక్తవయసుకు రాగానే అడినాయిడ్స్‌ ఉండవు. 

కొందరు పిల్లల్లో అడినాయిడ్స్‌ వాపు ఎందుకు? 
బ్యాక్టీరియాగాని, వైరస్‌గాని లోనికి ప్రవేశించినప్పుడు అడినాయిడ్స్‌ కణజాలంలో వాపు వస్తుంది. కణజాలంలో వాపు రావడం వల్ల అవి ఇన్ఫెక్షన్‌ నుంచి కాపాడలేవు. అవి క్రమంగా బ్యాక్టీరియా, వైరస్‌లతో నిండిపోతున్న కొద్దీ వాటిలో వాపు పెరుగుతూ పోతుంది. అలాంటి సమయాల్లో కొన్నిసార్లు టాన్సిల్స్‌ కూడా ఇన్ఫెక్షన్‌కూ, వాపునకు గురవుతాయి. ఇలా వాపు పెరగడంతో గాలి పీల్చుకోవడమూ కష్టమవుతుంది. దాంతో కొన్ని ఇబ్బందులూ వస్తాయి అవి... 

  • చిన్నపిల్లల్లో ముక్కురంధ్రాలు మూసుకుని పోయి గాలి పీల్చడం కష్టమై, నోటితో గాలి పీల్చుకుంటారు. 
  • కొంతమంది పిల్లలకు నిద్ర చక్కగా పట్టకపోవడం, తరచూ నిద్రాభంగం కావడం జరుగుతుంటుంది. 
  • నిద్రపోయేటప్పుడు పిల్లలో గురక వస్తుంది. 
  • గొంతునొప్పిగా ఉండి, మింగడం కష్టమవుతుంది. 
  • మెడప్రాంతంలో ఉన్న గ్రంథులు వాపునకు గురవుతాయి. 
  • వినికిడి సమస్యలూ తలెత్తవచ్చు. దాంతోపాటు దంతసమస్యలూ తలెత్తవచ్చు. 

చికిత్స:
అడినాయిడ్స్‌ వాపు ఉన్న పిల్లలు తరచూ జ్వరాలతో, అస్వస్థతో బాధపడుతుంటారు. అడినాయిడ్స్‌లో వాపు ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేస్తారు. అడినాయిడ్స్‌కు వచ్చిన వాపు వంటి సమస్యలకు సకాలంలో చికిత్స పొందకపోతే వ్యాధి తీవ్రత పెరిగి మందులకు నయం కాకపోవచ్చు. దాని వల్ల అడినాయిడ్స్‌ తొలగించాల్సి పరిస్థితి రావచ్చు. వాటిని తొలగించాల్సిన ప్రక్రియను అడినాయిడెక్టమీ అంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement