ఈవారం కథ: వాసన

Vasana Telugu Short Story By Mohammed Khadeer Babu - Sakshi

టీ ఇచ్చింది.
నీలిరంగు పూలున్న కప్పులో గాఢంగా నిండి, తీరం చేరని అలలాగా పలుచటి మీగడ కట్టిన టీ.
‘ఊ.. పీల్చండి.. ఆలస్యం ఎందుకు?’ అంది.
తలెత్తి చూశాడు. ఆమె వెళ్లాక ఎలాగూ చేస్తాడు. ముందే చేయమంటోంది. వాసన చూశాడు. టీ వాసన.
‘వచ్చిందా?’
‘ఊ’
‘అంతా బాగైపోయాము. వొడ్డున పడ్డాము. పద్నాలుగు రోజులైపోయి ఇవాళ్టికి మూడు వారాలు గడిచాయి. పదో రోజుకే మనకు వాసన తిరిగి రాలేదూ. నీకొచ్చిందా అంటే నీకొచ్చిందా అని అనుకోలేదూ. మీ కళ్లకు తుండు గట్టి పసుప్పొడి వాసన చూపిస్తే మీరు ముక్కుకు దగ్గరగా పట్టి పసుప్పొడి అని చెప్పలేదూ. ఇంకా ఏమిటండీ ఈ ఆరాటం మీకూ నాకూ. అదున్నప్పుడు బానే ఉన్నారు. దాన్ని తరిమిగొట్టారు. తీరా నెగెటివ్‌ అని రిపోర్టు ఇద్దరం చూసుకుని చీమ కుట్టినంత కష్టమైనా లేకుండా కనికరించావు దేవుడా అనుకుని తెరిపిన పడుతుంటే ఏం జబ్బు చేసింది మీకు? వాసన పోయినట్టుగా వాసన లేనట్టుగా వాసనే రానట్టుగా ఉలికులికిపడుతున్నారు. ప్రతిదాన్ని వాసన చూస్తున్నారు. ఉందా... ఉన్నట్టే ఉందా అని నన్ను పీక్కు తింటున్నారు. అయ్యో... ఎక్కడికైనా పారిపోదామంటే ఏ ఇంటికీ వెళ్లలేని ఈ పాపిష్టి రోజులు’...

ఇక అక్కడితో విసురుగా వెళ్లాలి లెక్కప్రకారం. కాని టీ తాగేదాకా ఆగి కప్పు తీసుకెళ్లిపోయింది.
పదిహేను రోజులు అఫీషియల్‌ సెలవులిస్తారు ఆఫీసులో పాజిటివ్‌ రిపోర్ట్‌ పంపితే. ఇంకో పదిహేను రోజులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయొచ్చు. ఆ పదిహేను రోజులూ అయిపోయాయి. ఫటీగ్‌గా ఉంది ఇంకో పదిరోజులు ఇవ్వండి అని కోరాడు. అవీ ముగిసి రేపో మర్నాడో వెళ్లాలి. లేదంటే నీకూ మాకూ చెల్లు అన్నా అంటారు.
చిన్న బెడ్‌రూమ్‌ నుంచి పిల్లల నవ్వులు వినిపిస్తున్నాయి. ఆన్‌లైన్‌ క్లాసులు అయిపోయాయన్న మాట.  యూట్యూబ్‌లోకి దిగి ఉంటారు. పోయిన సంవత్సరం న్యూస్‌ మొదలై హటాత్తుగా లాక్‌డౌన్‌ వచ్చినప్పుడే తీసుకోదగ్గ జాగ్రత్తలన్నీ తీసుకుందాం అని ఇద్దరూ అనుకున్నారు. లాక్‌డౌన్‌లు ముగిసి జనం మాస్క్‌లు కట్టుకుని, షాపులకు పాలిథిన్‌ షీట్లు వేళ్లాడేసి, తాళ్లు అడ్డం కట్టి బేరాలు మొదలెట్టాక... మాస్క్, మాస్క్‌ మీద షీల్డ్‌ పెట్టుకొని ఐకియాకు వెళ్లి రెండు చిల్డ్రన్స్‌ బెడ్స్‌ కొన్నారు. చిన్న బెడ్‌రూమ్‌లో ఇదివరకు ఫోర్‌ బై సిక్స్‌ బెడ్‌ ఉండేది. పెద్దదానికి నాలుగు బిస్కెట్లు ఇచ్చి నీకు రెండు తమ్ముడికి రెండు అనంటే గీత పెట్టి కొట్టినట్టుగా సమానంగా పంచుతుందిగాని ఒకే మంచం మీద ఇద్దర్నీ పడుకోమంటే మెల్లమెల్లగా కాలితో నెడుతూ వాణ్ణి తోసేస్తుంది. నలుగురూ మాస్టర్స్‌ బెడ్‌రూమ్‌లో పడుకునే రోజులు పోయాయి. ఏ క్షణాన ఏ అవసరం వస్తుందోనని ఆ ఫోర్‌ బై సిక్స్‌ను... అతని వాళ్లకా ఆమె వాళ్లకా అనే చర్చ లేకుండా... ఆమె వాళ్లకే చెప్తే వచ్చి పట్టుకెళ్లారు. కొన్న రెండు బెడ్లు అక్కడ వేశారు. కామన్‌ బాత్‌రూమ్‌ ఆ చిన్న బెడ్‌రూమ్‌కు దగ్గరగా ఉంటుంది. అందులో నాలుగువేలు పెట్టి మినీ గీజర్‌ బిగించారు. ఒక అరలో ఉడ్‌వర్క్‌లో మిగిలిన కర్ర ముక్కలు, ప్లైవుడ్‌ తునకలు దాచి ఉంటే పారేసి పిల్లలవే కొన్ని బట్టలు, టవల్స్, రెండు స్టీల్‌ జగ్స్‌ పెట్టారు.

అతనికీ ఆమెకీ ఒకరోజు తేడాలో టెంపరేచర్‌ మొదలైనప్పుడు ఈ సిద్ధం చేసిందంతా పనికొచ్చింది. పిల్లల్ని ఆ రూమ్‌లోకి పంపించేశారు. ఇక క్లాసులొద్దు ఏం వొద్దు మీ ఇష్టమొచ్చినవి కంప్యూటర్‌లో ఫోన్‌లో చూసుకోండి అని చెప్తే, వాళ్లూ తెలివైనవాళ్లకు మల్లే అస్సలు బెంగలేనట్టుగా ముఖాలు పెట్టి సరేనన్నారు. పెద్దది ఎనిమిదో క్లాసుకు, వాడు ఆరుకు వచ్చే సమయానికి ఇదంతా మొదలవడం తమ అదృష్టం అనే అనుకున్నారు. ఇంకా చిన్నపిల్లలై ఉంటే తమ సంగతి తమకు మాత్రమే తెలిసేది. ఏమంటే కొన్ని బాధలు ఎంత చెప్పినా ఎదుటివారికి ఏ తలకాయీ అర్థం కాదని అనుకున్నారు.

క్షణాల్లో కోర్సు మొదలెట్టడం వల్లో, ఇద్దరివీ సముద్రం వొడ్డున ఉండే ఊళ్లు కనుక అన్యం లేనట్టుగా చేపలు తింటూ పెరగడం వల్లో, మరీ యాష్ట పడేంతగా శరీరాలను ముందు నుంచి చేటు చేయక చూసుకోవడం వల్లో వచ్చిన చుట్టం ప్రతాపం చూపకుండా ఆరో రోజుకు ముడుచుకు పడుకున్నాడు. వంట యధావిధిగా సాగేది. పిల్లల వాటా తలుపు దగ్గర పెట్టి తప్పుకునేవాళ్లు. రెండుసార్లు పెద్దది ఏడ్చింది. వాడు వీడియో కాల్‌లో ముఖం ఎర్రగా పెట్టి నాన్న మర్యాద కాపాడ్డానికి బింకం పోయాడు.
పన్నెండు రోజులకే డాక్టర్‌ ‘పోండి... పోయి పిల్లల దగ్గర పడుకోండి’ అన్నా పద్నాలుగో రోజున తల స్నానాలు చేసి, ఇద్దరు పేదవాళ్లకి, అంటే ఆమె దృష్టిలో అపార్ట్‌మెంట్‌ సెక్యూరిటీ గార్డులకు, వెజిటెబుల్‌ బిర్యాని– ఎగ్‌ కర్రీ పెట్టి, అప్పుడు పిల్లలను దగ్గరకు తీసుకుని పెద్దపెద్దగా ఏడ్చారు. అయితే అమేజాన్‌లో పెద్దది తెలివిగా ‘ది వార్‌ విత్‌ గ్రాండ్‌పా’ సినిమా పెట్టి అందర్నీ నవ్వించింది బాగా.

ఇక అంతా అయిపోయినట్టే అనుకుంటూ ఉంటే ఈ ముక్కు బాధ మొదలైంది. వాసన ఉన్నట్టా.. వాసన లేనట్టా... వాసన ఉండీ లేనట్టా.... స్నానం చేస్తూ సబ్బు వాసన చూట్టం... నూనె రాసిన జుట్టును దువ్వుకున్నాక దువ్వెన వాసన చూడటం, హ్యాంగర్‌కు వేళాడుతున్న మురికిబట్టల వాసన చూడటం, కప్‌బోర్డుల్లో పడేసి ఉంచిన నేఫ్తలిన్‌ ఉండలు తీసి వాసన చూడటం... కొత్తల్లో ఆమె గమనించి ఏమిటోలే అనుకునేది. తర్వాత్తర్వాత భయపడుతోంది. టెంపర్‌ మనిషి. పిల్లల్ని తీసుకొని ఏ ఫ్రెండ్‌ ఇంటికో వెళ్లినా వెళ్లగలదు. దీనిని ముగించాలి అనుకున్నాడు.
ఆఫీస్‌ పని అయ్యేసరికి మధ్యాహ్నం నాలుగైంది. ఐదింటికి టీ తాగి, మాస్క్‌ పెట్టుకుని, ఫోన్‌ తీసుకొని ‘అలా వెళ్లొస్తా’ అని బయటపడ్డాడు. 
ఆరు నుంచి కర్ఫ్యూ. ఇంకా గంట టైముంది. 
రోడ్డు మీదకు వచ్చాక ఎం.ఆద్రికి ఫోన్‌ చేశాడు. ఆద్రి డాక్టరు. హైస్కూల్లో అతడికి రెండేళ్లు సీనియర్‌. అసలు పేరు మాల్యాద్రి అయితే మార్చుకున్నాట్ట. ఆ ఆద్రిని అతడు వాడు అంటాడు. యు.కె వెళ్లి సైకియాట్రీ చదివి అక్కడే ప్రాక్టీసు చేసి ఆ అనుభవంతో ఇక్కడ ప్రాక్టీసు చేస్తున్నానని అతడితో ఆ వాడు చెప్పాడు కాని అతడికి వాడి మీద వాడి వైద్యం మీద ఏ మాత్రం నమ్మకం లేదు. పైగా కాల్‌ చేస్తే ‘తమ్ముడూ’ అంటాడు. ఈ వరసలు కలిపే వాళ్లంటే అతడికి మంట. కాని వేరే గతి లేదు.
‘ఆ.. తమ్ముడూ’ అన్నాడు వాడు.
సంగతి చెప్పాడు.
‘ఆ... ఇంకేం సంగతులు... బోండాం శీను ఎలా ఉన్నాడు’
మళ్లీ సంగతి చెప్పాడు.
‘మొన్న ఊరి నుంచి మైసూర్‌పాక్‌ వస్తే తమ్ముడూ... నిన్నే తలుచుకున్నా’
‘నాకు మోక్షం లేదా అన్నయ్యా’..
‘ఎయ్‌... వదిలెయ్‌రా డౌట్ని. ముక్కేంటి మూతేంటి. సరిగ్గా నిద్ర పోతున్నావా? నిద్ర బిళ్ల వాట్సప్‌ చేస్తా ఒక వారం వేస్కో’
‘ప్రతిదానికీ పడుకోబెట్టడమేనారా మీ సైకియాట్రిస్ట్‌ల పని’
‘పడుకుంటే సగం దరిద్రం వదులుతుంది తమ్ముడూ’ 

ఆ వాడు ఏ మాత్ర రాశాడో అతడు ఏది మింగాడో ఇక నిద్రే నిద్ర. ఆఫీస్‌లో జాయినయ్యి రెండో రోజు మీటింగ్‌లో ఉన్నాననే అనుకున్నాడు. సెక్షన్‌ అంతా ఇళ్లకెళ్లాక బాయ్‌ వచ్చి లేపాడు లైట్లు లేకుండా చీకటిగా ఉన్న కాన్ఫరెన్స్‌ రూమ్‌లో. సీనియర్‌ ఉద్యోగి అని మర్యాద ఇచ్చినట్టున్నారు. మరుసటిరోజున బాస్‌ నుంచి ఇంకో వారం దాకా ఇంట్లోనే ఉండి పని చేయ్‌ అనే మెసేజ్‌ కూడా వచ్చింది.
నిద్రపోయేవాడు వాసన చూడలేడు. అతడూ చూడలేదు. వారం తర్వాత తేన్పులొస్తున్నాయని మజ్జిగ తెచ్చి ఇస్తే గ్లాసు పట్టుకుని అరగంట సేపు వాసన చూస్తూనే కూచున్నాడు. చూసింది... చూసింది... వచ్చి గ్లాసు పెరుక్కొని ఎత్తి నేలకు కొట్టింది. మజ్జిగ ఎగిరి టీవీ మీదా, టీపాయ్‌ మీదున్న న్యూస్‌పేపర్ల మీద, అతని ముఖాన పడింది. ఆమె ఏడ్చింది.
సాయంత్రం మాస్క్‌ తగిలించుకుని, ఫోన్‌ తీసుకొని ‘అలా వెళ్లొస్తా’ అని రోడ్డు మీదకొచ్చి వాడికి కాల్‌ చేశాడు.
‘ఏమిట్రా ఇదీ తమ్ముడూ’ అన్నాడు వాడు.
‘అరె... నీ ముక్కు ఆల్‌రైట్‌గా ఉంది. నువ్వు ఆల్‌రైట్‌గా ఉన్నావు. ఎందుకురా నా పని చెడదొబ్బుతావు’ అన్నాడు మళ్లీ.
ఏమీ మాట్లాడలేకపోయాడు.
‘అరె.. మనసు కష్టపెట్టుకుంటున్నావు కదా నువ్వు. ఏం మనూరోడివిరా నువ్వు. స్కూల్లో షేర్‌ నువ్వు... షేర్‌. ఈ మాత్రం దానికి’... అన్నాడు వాడు.
గొంతు పెగల్లేదు.

వాడూ ఒక నిమిషం ఊరికే ఉండి–
‘అరె.. ఒకటి చెప్పు. నీ మైండ్‌ సరిగా ఉండాలంటే దానికి ఎక్సర్‌సైజ్‌ ఉండాలి కదా. నీ కాళ్లు చేతులు సరిగా పన్జెయ్యాలంటే వాటికి ఎక్సర్‌సైజ్‌ ఉండాలి కదా. నీ పొట్ట సరిగా పని చేయాలంటే నువ్వు మూడుపూట్లా తిని, అరాయించుకుని, తెల్లారి దానికి వెళ్లాలి కదా. నీ ముక్కుకు ఏం ఎక్సర్‌సైజ్‌ ఉందో చెప్పూ. ఏం ఇస్తున్నావు దానికి. ఎలా బతికిస్తున్నావు. చచ్చి పడున్నట్టుందిరా అది. ఏ వాసనలూ లేక ఎప్పుడో చచ్చినట్టుందది. నీకు ఇప్పుడు తెలిసింది. అరెయ్‌.. ముక్కున్నది నీ చచ్చుపుచ్చు బతుక్కి గాలి పీల్చి వదలడానికి కాదు. దయ తలువు దాన్ని. షో సమ్‌ మెర్సీ. ఏదో వర్డ్‌ ఉంది... ఆ... ఆఘ్రాణించు...  ఆఘ్రాణించు ఫ్రాగ్రెన్స్‌ ఆఫ్‌ లైఫ్‌. బతుకుతుంది. మళ్లీ ఇందుగ్గాను కాల్‌ చేయకు. మందేద్దాం అనుకుంటే మాత్రం రా’...
పెట్టేశాడు.

ఆరవుతున్నట్టుంది. మనుషుల్ని రోడ్ల మీద నుంచి వెళ్లగొట్టే చీకటి దాపురిస్తూ ఉంది. పోలీస్‌ వెహికల్‌ ఒకటి సైరన్‌ మోగిస్తూ కర్ఫ్యూ అవర్స్‌ మొదలవుతున్నాయని గుర్తు చేస్తూ తిరుగుతూ ఉంది. షార్ట్స్, టీ షర్ట్, స్లిప్పర్స్‌లో చేత ఫోన్‌ పట్టుకుని కొత్తగా వేసిన పేవ్‌మెంట్‌ పక్కన నిలబడి ఉన్నాడు.
అలా నిలబడి ఉండటం, రోడ్డును అలా తిరిగి చూడగలగడం, ఆకాశం కింద అలా ప్రాణాలతో మిగలగలగడం కొన్నాళ్ల క్రితం అతడు ఊహించలేదు. ఇప్పుడు ప్రాణాలు ఉన్నాయి. జీవమే.

ఎవరో ముసలాయన, ముస్లిం టోపీ పెట్టుకుని– పోలీసుల భయంతో తోపుడు బండిని గబగబా తోసుకొని వెళుతున్నాడు దూరంగా. చూస్తున్నాడు ఆ బండివైపు. ఏం పండ్లున్నాయో దాని మీద. బత్తాయిలా... కమలాపండ్లా...
సురేశ్‌ గాడు గుర్తొచ్చాడు. స్కూల్లో ‘మావా... మాటరా’ అని పక్కకు తీసుకెళ్లి, వెనుక మడుచుకుని ఉన్న చేతుల్లో నుంచి టకాలున నారింజ తొక్క తీసి కళ్లల్లోకి పిండేవాడు. అబ్బా రే... ఆ తర్వాత ఆ నారింజ తొక్కను లాక్కుని వాడి కంట్లో పిండేవాడు. ఆ పూటంతా చేతుల్లో నారింజ వాసన. కమ్మటి సువాసన.
నవ్వొచ్చింది. ముక్కుకు నారింజ వాసన తగిలింది– అప్పటిది. గట్టిగా గుండెలోకి పీల్చాడు. అప్పటి రసం ఇప్పుడూ పడిందేమో కళ్లు నీళ్లు చిమ్మాయి. 
ఆ సురేశ్‌ గాడే వాళ్ల నాన్నది లూనా తెచ్చేవాడు టెన్త్‌ క్లాస్‌లో. ట్యాంక్‌ విప్పి ‘చూడ్రా... వాసన భలే ఉంటుంది’ అనేవాడు. లీటరులో సగం డబ్బులు నీవి అని– ఆ సగం ఏనాడూ ఇవ్వకపోయినా లూనా నేర్పించాడు. డబ్బు చేత్తో పట్టుకున్న సురేశ్‌ గాడి పక్కన పెట్రోల్‌ బంకులో నిల్చున్నట్టే ఉంది. తెరలు తెరలుగా వాసన తాకుతున్నట్టే ఉంది. ముక్కు ఎగపీల్చాడు.
ఫోన్‌ మోగింది. 
‘ఏమయ్యారు’
‘వచ్చేస్తున్నా.’
‘ఏమిటి హుషారుగా ఉన్నారు’
‘ఏం లేదు. ముక్కు. బాగుందిలే’...

ఇంటికెళదామా అనిపించింది. ఇల్లు. బాత్‌రూమ్‌లో ఫినాయిల్‌... డెట్టాల్‌... ఫ్లోర్‌ తుడిచేప్పుడు లైజాల్‌... రాత్రి కచ్వా... ఎప్పుడైనా ఆమె వెలిగిస్తే అగరుబత్తి వాసన. ఆ వాసన అతడికి పడదు. ఊళ్లో చిన్నప్పుడు మమత మాంసాహార హోటల్‌కు పెరుగు పార్శిల్‌కు వెళితే కౌంటర్‌ మీదున్న స్టీల్‌ స్టాండ్‌ నుంచి వచ్చే గంధం బత్తి వాసన యిష్టం. ఆ వాసన కోసం ఎన్నిసార్లు ఎన్నిరకాల గంధం బత్తీలు కొని వెతికాడో. ఆ వాసనే వాసన. ప్రయత్నించాడు. దగ్గరగానే ఉంది. గాలిలో తేలి ఆడుతూ మెల్ల మెల్లగా సమీపిస్తూ ఉంది. నాటి బాలుణ్ణి చేస్తూ నీ ముక్కుకు ఏమీ కాలేదులేవోయ్‌ అంటూ ఉందా అది? 
కూరకు వెళితే ‘ఇదిగో... ఈ అబ్బాయి మన ఫలానా ఆయన కొడుకు. కాస్త ఎక్కువ కట్టు’  అని హోటలు ఓనరు అంటే, ఇచ్చిన ప్యాకెట్‌ అందుకుని ఇంటికి వొచ్చాక ఏ అలంకారమూ లేని ఆ అతి మామూలు అరటికాయ కూరలో కూడా ఎంత ఆకలి రేపే సువాసనో!
‘ఏవిటి.. కనీసం కూర వాసన కూడా రాదు ఇంట్లో’ అంటాడు ఎప్పుడైనా.
‘రండి.. ఇలా రండి’ అని పిలుస్తుంది వెంటనే.

‘చూడండి.. ఇది కొత్తిమీరట. వాసన ఉందా? హవ్వ. పుదినాలో కూడా వాసన లేకపోతే నేనేం చేయను. ఇవి ఆలుగడ్డలట. అవి టమేటాలు అట. వాటిదీ ఆకారమే. మనదీ ఆకారమే. తిరగమోతలో వాసన వచ్చి ఎంత కాలమనీ. మినుములు వేయిస్తే గుమ్మెత్తిపోయేది. పాలు పొంగినప్పుడు వచ్చే వాసన నాకిష్టం. ఎక్కడ చూస్తున్నాను నా మొహం. ఒక్క నేతిచుక్క వేసుకుని వేడన్నంలో కలుపుకుని తింటే ఆ అన్నమంతా నెయ్యి వాసన, కడుకున్నాక చేతికి వాసన. ఆ రోజులా ఇవీ. నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, దనియాలు వేయించి  పక్కింట్లో రోట్లో దంచుతుంటే వాసన మా ఇంటి దాకా వచ్చేది. చారు కాస్తే నాలుగు పెళ్ళల అన్నం మింగేదాన్ని. ఇప్పుడు ఆశించగలమా ఇదంతా. మరువం, దవనాలే వాసనల్లేక వొట్టి పోతే మీరేమిటండీ వాసనలంటారూ’ అంటుంది.
కాని ఆ యోగం అతనికి తెలియనిదా? 

పెదమ్మ ఆంటీ ఇంటికెళితే తెల్లసున్నం వేసిన వీధిగోడల మీద పగిలిపోయిన కుండలను బోర్లేసి మట్టి నింపి పెంచిన మరువం, దవనం దుబ్బుగా ఉండేవి. వాటి దగ్గర నిలబడి చాలాసేపు వాటి సువాసన పొందేది. అది చాలక ప్రతిసారీ పెదమ్మ ఆంటీ ‘ఆ తలేందిరా’ అని నూనె రాసేది. గానుగ నుంచి తెచ్చిన కొబ్బరి నూనెలో రీటా వేసి, బావంచాలు పోసి, సుగంధవేర్లు జారవిడిచి అవన్నీ గాజు సీసాలో లేత ఎరుపులో కనిపిస్తూ ఒక దానికి ఒకటి సువాసన ఇచ్చుకుంటే ఆ నూనె తలకు రాసి, రాశాక ‘చూడు’.. అని రెండు అరిచేతులను ముఖానికి దగ్గరగా తెచ్చేది. అప్పుడు ముక్కు సొట్టలు పడేలా అతడు వాసన పీల్చేది. పెదమ్మ ఆంటీ చేతులు... ఇప్పుడూ దగ్గరగా అనిపిస్తూ ఉన్నాయి. ఆ సెంటు నూనె వాసన ముక్కు దిగువన ఇప్పుడూ తారాడుతూ ఉంది.

‘చినమ్మ ఆంటీ ఇంటికెళ్తా.. పొయ్యిలో కాల్చి పనసగింజలు పెడుతుంది’ అనేవాడు.
‘ఆ పెడుతుందిలే సంబడం. నేనూ పెడతానుండు’ అని ఆరిపోయిన పొయ్యి ఎగదోసి చిలగడదుంపలు రెండు పడేసేది. చిలగడదుంపలు కాలే వాసన వాటిని తినడానికంటే రుచిగా ఉండేది. అవి తిన్నాక కదిలే పని ఉండదు. కడపు నిండి పెరడు బావి దగ్గర ఆడుకోవడమే.
బైక్‌ వచ్చి ఆగింది. ముందు ఒక పోలీసు, వెనుక ఒక పోలీసు ఉన్నారు.
‘వెళ్లాలి సార్‌’
చూశాడు.
‘వెళ్తా. ఇక్కడే మా ఇల్లు’
వెళ్లిపోయారు.

కాలేజీలో ఉండగా యూనియన్‌ వాళ్లు పెంచిన కాలేజీ ఫీజులు తగ్గించాలి, స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలి అని స్ట్రయిక్‌కి పిలుపు ఇస్తే కుర్రాళ్లు పది మంది స్కూళ్లు మూయించడానికి బయలు దేరితే తనూ వెళ్లాడు. ఒక్కో స్కూలు మూయిస్తూ వస్తుంటే ఒక హెడ్మాస్టరు మాత్రం హటం చేశాడు. ఎంత చెప్పినా వినడు. అన్ని క్లాసుల్లోని పిల్లలు గోలగోలగా కిటికీల్లోంచి చూస్తుంటే వెళ్లినవాళ్లు ఎదురు తిరిగి స్లోగన్స్‌ ఇస్తూ లాంగ్‌ బెల్‌ కొట్టేస్తూ ఉంటే పోలీసులు. కంపలకు అడ్డం పడి పరిగెత్తి పడ్డాడు. గవర్నమెంట్‌ హాస్పిటల్‌కు వెళితే, కొత్తనర్సు నేరుగా టింక్చర్‌ పెట్టబోతే, పెద్దనర్సు తిట్టి స్పిరిట్‌తో కడిగి ఆ తర్వాత టింక్చర్‌ పెట్టాలి అని స్వయంగా ఆ పని చేస్తూ ‘ఏం స్టూడెంట్సయ్యా మీరంతా’ అని అక్కరగా మందలిస్తూ ఉంటే అప్పుడు వచ్చినదీ ఇప్పుడు వస్తున్నదీ టింక్చర్‌ వాసనా... ఆమె రాసుకున్న క్యుటికుర వాసనా...

ఇంటి వైపు అడుగులు వేశాడు. 
మాస్క్‌ కట్టకుండా ఎవరూ లేకపోయినా ఫ్లాట్స్‌లోని అందరూ ప్రతి ఒక్కరినీ గుర్తు పట్టే అనుభవం ఈ సంవత్సర కాలంలో వచ్చేసింది. లిఫ్ట్‌ దగ్గర థర్డ్‌ఫ్లోర్‌ భాస్కర్‌ నాయుడు ఉన్నారు. డెబ్బై ఉంటాయి. కాని ఏ కర్ఫ్యూ ఆయన్ను ఈవెనింగ్‌ వాక్‌కు వెళ్లనీకుండా ఆపదు. ఇద్దరూ లిఫ్ట్‌ ఎక్కారు. క్షేమమే కదా అని ఆయన చేత్తో సైగ చేశారు. క్షేమమే అని అతడు సైగ చేశాడు. థర్డ్‌ ఫ్లోర్‌లో ఆయన దిగిపోయారు. ఒకసారి ఇలాగే లిఫ్ట్‌ బయట కలిస్తే, బటన్‌ నొక్కి వెయిట్‌ చేస్తూ, మాటల్లో పడ్డారు. చాలా మంచి వాసన వస్తోంది. పోల్చుకోవడం ఎంతసేపూ. అది మట్టి వాసన.
‘ఏమిటి సార్‌. ఇంత ఎండగా ఉంది. ఎక్కడ వాన పడుతోంది... మట్టి వాసన’ అన్నాడు.
ఆయన నవ్వి ‘వాన లేదయ్యా. నా దగ్గరే’ అన్నాడు.
‘మీ దగ్గరా?’ 

‘అవును. పుట్టింది పల్లెటూళ్లో. టీచరుగా జీవితాంతం పని చేసి రిటైరైంది పల్లెటూళ్లో. బరెగొడ్లు, పేడ కళ్లాపిలు, గడ్డి మోపులు, నార్లు పైర్లు... వీటి మధ్య బతికా. ఒక్కగానొక్క కొడుకు అని పదేళ్లుగా వీడి దగ్గర ఉన్నా. అబ్బా కష్టమయ్యా ఇక్కడ ఉండటం. మందు వాసన మందుల వాసన తప్ప ఇంకో వాసన రాదు. ఇక తట్టుకోలేక ఈ అత్తరు కొనుక్కున్న. కన్నోజ్‌ అని ఉత్తరప్రదేశ్‌లో ఊరు. అత్తర్లకు ఫేమస్‌. వానలు పడే కాలాన ఆ ఊరి నది వొడ్డున సుతారంగా ఏరిన మట్టితో ఈ అత్తరు తయారు చేస్తారు. పాతబస్తీలో దొరుకుతుంది. కాస్ట్‌లీ. అప్పుడప్పుడు పూసుకుంటా’... 
ఆకాశం కనికరిస్తే, జల్లు దయగా దిగి నేలను నిమిరితే అణాకాణీ ఖర్చు లేకుండా అందరూ పొదువుకోవాల్సిన మృత్తికా సౌరభం. ఇప్పుడు అతి ఖరీదుగా ఒక లిప్త పాటు జాగృతమై లిఫ్ట్‌లో అతణ్ణి కంపించేలా చేసింది.
ఇంట్లోకి వచ్చాడు. ఆమె పరిశీలనగా చూసి సంతృప్తి పడింది. పిల్లలకు కారం లేని ఒక కూర ముందే చేసేసి ఉంటుంది. ఇప్పుడు ఇద్దరికీ  వండుతుంది.
‘ఏం వొండను’ అడిగింది.
‘ఏదో ఒకటి. కాస్త ఎండు చేపలు వేయించరాదూ. రేగిపోవాలి’ 
నొచ్చుకున్నట్టు చూసింది.

‘మానేశాము కదండీ పిల్లలకు వాసన పడట్లేదని. పైగా అపార్ట్‌మెంట్‌లో ఆ కంపు రేపుతోంది మనమే. ఎందుకా అప్రదిష్ట. దాచిన కొన్ని ముక్కలుంటే పనమ్మాయికి ఇచ్చేశాను. ఊరికెళ్లినప్పుడు ఇక మీ అమ్మ దగ్గరే ఆ ముచ్చట’
శ్వాస– ఒక నిమిషం దిగ్బంధనం అయినట్టు అనిపించింది. అమ్మ గొంతు దాపున దూరాన వినిపించినట్టయ్యింది. అమ్మ గొంతు. దానిది కదా అసలైన వాసన. ‘ఒరేయ్‌ మేధావి’ అని పిలిచేది అమ్మ బుక్స్‌ చదువుకుంటూ ఉంటాడని. తిక్కపనులు చేస్తే ‘ఒరే మేతావి’ అని నవ్వేది. చిన్నప్పుడూ ఇప్పుడూ పలుచగా ఉంటుంది అమ్మ. చిన్నప్పుడూ ఇప్పుడూ మెత్తగా మాట్లాడుతుంది అమ్మ.
‘నాన్న జేబులో చిల్లరుంటుంది. తీసుకొని కొనుక్కోరా’ అనేది.
‘నాన్న జేబులో చేయి పెట్టను. రాలిన సిగరెట్‌ పొడి చేతికంటుకుంటుంది. వాసన’ అనేవాడు. ఆమే వచ్చి తీసి ఇచ్చేది.
అమ్మ దగ్గరే ఉండేవాడు ఎప్పుడూ. ఆమె రవిక చంకల దగ్గర చెమట పట్టి– ఉండ్రా స్నానం చేయలేదు అన్నా పర్లేదులే అని పక్కన నులక మంచం మీద ఎగిరి కూచునేవాడు. ఆదివారాలు అన్నాలు తిన్నాక ఆడుకోవడానికి ఎవరూ రాని మధ్యాహ్న వేళలో ఆమె పక్కన పడుకుని కొంగు ముఖాన వేసుకుని ఏవో ఊహలు గొణుక్కునేవాడు.

‘పెద్దయ్యాక నీకేం కావాలన్నా కొనిస్తాను చూడు’
‘నాకేం వద్దులేరా మేధావీ. నువ్వు పక్కనుండు చాలు’
‘ఊహూ. కొనివ్వాల్సిందే’
అమ్మ ఎప్పుడూ నాన్నను ఏదీ అడిగేది కాదు. నాన్నే ఒకసారి ఆమెకని ప్రత్యేకం సింథాల్‌ సబ్బు తెచ్చి పెట్టాడు. నాలుగు భుజాల దీర్ఘ చతురస్రాకార ఎర్రఅట్ట సబ్బు. అమ్మ ఆ రోజు చాలాసేపు స్నానం చేసింది. చలువ చీర కట్టుకుని ‘రా’ అని నవ్వుతూ దగ్గర తీసుకుంది. 
చుబుకం కింద తల వొచ్చేలా పట్టుకోవడం ఆమెకు ఇష్టం. ఇప్పుడూ పట్టుకున్నట్టయ్యి ఆ స్పర్శది కదా అసలైన వాసన అనిపించింది.
‘ఏమిటండీ అలా అయిపోయారు’ అంది.
‘ఏం లేదు.. ఏం లేదులే’ అని గదిలోకి వచ్చాడు.
డోర్‌ వేసుకున్నాడు. పచార్లు చేశాడు. హటాత్తుగా ఏదో అర్థమైంది. హటాత్తుగా ఏం అర్థమైందో.
ఫోన్‌ తీసి వాడికి వాట్సప్‌ చేశాడు.
‘ఊరెళుతున్నా అమ్మను చూడ్డానికి. వచ్చాక మందేద్దాం’..
రెండు నిమిషాలకు బ్లూటిక్‌ పడి రెస్పాండ్‌ అయ్యాడు.
‘ఓ.. అదీ సంగతి. ఈ సంవత్సరంగా లాక్‌డౌన్ల రభసతో ఆమెను మిస్సయ్యి నా ప్రాణాలు తీశావు.’
‘లేదురా. నా పెళ్లయ్యినప్పటి నుంచి ఆమె ఊళ్లోనే ఉంది’
‘ఓ... సిటీలో ఉండలేదని అక్కడ పెట్టుంటావ్‌’
‘లేదురా. ఆమెకు నా దగ్గర ఉండటమే ఇష్టం’...
బ్లూటిక్‌ పడింది. రెస్పాండ్‌ కాలేదు. నిమిషం తర్వాత–
‘నీ భార్య మంచి కత్తి కేండేటా’...
టైమ్‌ తీసుకున్నాడు.

‘ఇద్దరూ చేసే తప్పుల్రా ఇవి. ఒక్కరు గట్టిగా నిలబడినా చెడు జరగదేమోగాని మంచి జరుగుతుంది’
బ్లూ టిక్‌ పడింది. వెయిట్‌ చేశాడు. వాడు ఇక మాట్లాడేలా లేడు.
బయటకు వచ్చాడు. పిల్లలు టీవీ చూస్తున్నారు. ఆమె వంట గదిలో కూర ఎక్కిస్తూ ఉంది. వెళ్లాడు.
‘ఉదయాన్నే అమ్మ దగ్గరకు వెళుతున్నా. కారులో. వచ్చేస్తా రెండు రోజుల్లో’
తిరిగి చూసింది. ఏమనుకుందో.
‘సరే’

‘ఇంకో రెండ్రోజులు ఎక్కువున్నా విసిగించకు. తీసుకొస్తానేమో తెలియదు. ఇంకేం ఆలోచిస్తానో. మనం నిజంగా హ్యాపీగా ఉండటం మనకు అవసరమా కాదా’...
అతని కళ్లల్లోకి ఆమె చూస్తోంది. అతనివి అలాంటి కళ్లు ఆమె ఎప్పుడూ చూళ్లేదు.
‘స్వామీ... ఇక వదిలిపెట్టండి’
‘సరే’

రూమ్‌లోకి వచ్చాడు. బ్యాగ్‌ సర్దుకున్నాడు. త్వరగా భోం చేశాడు. ఐదు గంటలకు అలారం పెట్టుకున్నాడు. దారిలో డజను సింథాల్‌ సబ్బులు – నాలుగు పలకల ఎర్ర అట్టవి– తప్పక కొనాలని నిశ్చయించుకున్నాడు. మంచం మీద తల వాల్చాడు.
నిద్ర పడుతుంటే సబ్బు వాసన అతణ్ణి తాకుతున్నట్టు అనిపించింది.
అమ్మ వాసన కూడా.
బహుశా అతడి ముక్కు అతణ్ణి క్షమించేసింది.
-మహమ్మద్‌ ఖదీర్‌బాబు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top