
ప్రారంభోత్సవ దుస్తుల ద్వారా ఆకట్టుకున్న నగర డిజైనర్
ఆభరణాలను అందించింది కూడా మన నగరమే
తమ వంతు పాత్ర పోషిస్తున్న మేకప్, హెయిర్‌స్టైలిస్ట్స్
మిస్ వరల్డ్ టైటిల్ పోరులో నందిని గుప్తాకు తోడుగా
మిస్ వరల్డ్ వేదికపై భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ నందిని గుప్తా ధరించిన ప్రారంభోత్సవ దుస్తులు అహూతులను అమితంగా ఆకట్టుకున్నాయి. వీటిని డిజైన్ చేసింది నగరానికి చెందిన ప్రముఖ డిజైనర్ గౌరంగ్ షా కావడం గమనార్హం. ఈ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా, ఉత్సవ వేదికపై మన జాతీయ వస్త్రధారణను, అదే విధంగా ఒక అపూర్వ వారసత్వాన్ని, కళను, శిల్పాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. భారత జానపద వస్త్ర సంపదకు చిహ్నంలా రూపుదిద్దుకున్న ఈ వైవిధ్యభరిత డిజైన్లలో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన జాందాని చేనేతల అందం ప్రస్ఫుటమవుతుంది. దుస్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతోపాటు బాంగ్డీ మోర్ మోటీఫ్ నాట్యం చేస్తూ మెరిసే నాలుగు నెమళ్లు. ఈ మోటీఫ్ కేవలం అలంకారమే కాదు, భారతదేశ హస్తకళా సంపదకు చిహ్నమని చాటి చెప్పాయి.
ఆభరణ ‘భాగ్యమూ’ మనదే..
ఈ దుస్తుల వైభవాన్ని మరింతగా పెంచింది నగరానికి చెందిన కిషన్ దాస్ జ్యువెలరీ బ్రాండ్. 1870 నుంచి ఆభరణాల రంగంలో ఉన్న ఈ సంస్థ అందిస్తున్న ఆభరణాలు ప్రత్యేక సందర్భాల్లో నందిని గుప్తాకి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. చాంద్ సూరజ్ హారం, పెద్ద పావురాల ఆకృతులతో రూపొందించిన మరో హారం, బర్మా రూబీలు, బస్రా ముత్యాలు, అన్‌కట్ డైమండ్లతో మినుకు రాజవంశాల వైభవాన్ని ప్రతిబింబించే ఆభరణాలను ఆమె ధరిస్తున్నారు.
అపు‘రూపం’.. కేశ సౌందర్యం..
మిస్ ఇండియా నందిని గుప్తా తన ప్రత్యేకమైన డ్రెస్‌లు, మేకప్, హెయిర్‌స్టైల్స్‌తో ఆకట్టుకోవడం వెనుక ఫెమినా మిస్ ఇండియా సంస్థ ఆమె కోసం ఎంపిక చేసిన నిపుణుల కృషి కనిపిస్తుంది. ఆమె మేకప్ డిజైన్ కోచ్‌గా ఆయేషా సేత్‌ను ఫెమినా నియమించినట్లు తెలుస్తోంది. నందినికి ఆమె ప్రత్యేక శిక్షణను అందించి, ఆమె అందానికి వన్నెలు అద్దుతున్నారు. ఈ శిక్షణ, నందినికి వివిధ సందర్భాలకు అనుగుణంగా మేకప్ శైలిని అభ్యసించేందుకు సహాయపడుతోంది. అదే విధంగా నందిని గుప్తా హెయిర్‌స్టైలింగ్ బాధ్యతను సుమితా థిల్లాన్ పర్యవేక్షిస్తున్నట్టు చెబుతున్నారు. నందిని ధరిస్తున్న ప్రతి డ్రెస్‌కు అనుగుణంగా ఆమె హెయిర్‌స్టైల్‌ను మార్పు చేర్పులు చేస్తూ ఆకట్టుకునేలా రూపొందిస్తూ తన వంతుగా ఆమెని మెరిపిస్తున్నారు.. పోటీల ప్రారం¿ోత్సవంలో నేషనల్ కాస్ట్యూమ్‌గా గౌరంగ్ షా డిజైన్ చేసిన జామ్‌దాని లెహంగాను నందిని ధరించగా, ఆమెకు వస్త్రధారణ, స్టైల్స్‌లో సేవలు అందిస్తున్న ఇతర డిజైనర్లలో అమృత్‌రాజ్ బోరా, సామంత్ చౌహాన్, నికితా మహిసాల్కర్‌లు ఉన్నారని సమాచారం.
దీర్ఘకాల కృషి ఫలితం..
మిస్ వరల్డ్ పోటీలో దుస్తుల కోసం నందిని బృందం నన్ను సంప్రదించినప్పుడు, నాలో వెంటనే ఈ ఆర్ట్ పీస్ కళ్లలో మెదిలింది. కాలాతీత భారతీయ హస్తకళను ప్రతిబింబిస్తూ ఇది అంతర్జాతీయ వేదికకు సరిగ్గా సరిపోతుందని భావించాను. ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర నుంచి 8 మంది పేరొందిన కళాకారులు అంకితభావంతో కూడిన బృందం ఈ కళాత్మక డిజైన్లకు జీవం పోయడానికి సహకరించింది. నెలల తరబడి కృషి ఫలితంగా ఈ కళాత్మక మాస్టర్ పీస్ ఆవిర్భవించింది.
– గౌరంగ్ షా, నగర డిజైనర్