
సాధారణంగా వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ పున్నమి ముందు శుక్రవారం చేసుకోవాలన్నది సంప్రదాయం కనుక ఆగస్టు 1 శుక్రవారం చేసుకోవాలా? లేక ఆగస్టు 8న వచ్చే శుక్రవారం చేసుకోవాలా... అన్న సందేహం సహజం. చాలామంది పంచాంగ కారులు 8వ తేదీని పున్నమి అయినా ఆ వేళే చేసుకోవాలని నిర్ణయించారు. అయినా మనకు గ్రంథ ప్రమాణం, సంప్రదాయ వేత్తల ఉపదేశ ప్రమాణమూ కావాలి కనుక వ్రతనిర్ణయ కల్పవల్లి అనే గ్రంథం
శ్రావణస్య సితేపక్షే పూర్ణిమోపాంత భార్గవే
వరలక్ష్మీ వ్రతం కార్యం మోక్షసంపత్ ఫలప్రదమ్
అని భవిష్యోత్తర పురాణోక్తిని ఉట్టంకిస్తూ చెప్పింది కాబట్టి మంచి సంçపద, మోక్షమూ కలిగించే వరలక్ష్మీవ్రతం శ్రావణ మాస శుక్లపక్షంలోని పున్నమికి దగ్గరగా ఉన్న శుక్రవారం నాడు చేసుకోవాలన్నదే నిర్ణయంగా చెప్పబడింది. ఒకవేళ పున్నమిరోజునే శుక్రవారం వస్తే.. ఆ రోజే వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలి.
ఈ మేరకు ఈ ఆగస్టు 8నే వరవలక్ష్మీవ్రతం చేసుకోవాలనే సంకేతం కదా! ఒకవేళ ఏ కారణం చేతనైనా 8 వతేదీ ఆటంకం కలుగుతుందేమో అని అనుకొనే వారు ఆగస్టు 1న వచ్చే రెండవ శుక్రవారం కూడా వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చు.