శౌర్యమే శ్వాసగా.. అత్యున్నత పదవిలో ఇద్దరు మహిళా అధికారులు | Sakshi
Sakshi News home page

శౌర్యమే శ్వాసగా.. సీఆర్‌పీఎఫ్‌లో అత్యున్నత పదవిలో ఇద్దరు మహిళా అధికారులు

Published Sat, Nov 5 2022 5:29 PM

Two Women Officers In CRPF Acheived IG Rank - Sakshi

‘సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌
(సీఆర్‌పీఎఫ్‌)లో మహిళలు ఏమిటి!’ అనే ఆశ్చర్యం, అనుమానం కనిపించేవి.
సున్నితమైన ప్రాంతాలలో వారు విధులు నిర్వహించాల్సి రావడమే దీనికి కారణం.
అయితే ఆ ఆశ్చర్యాలు, అనుమానాలు కనుమరుగై పోవడానికి ఎంతోకాలం పట్టలేదు.
సీఆర్‌పీఎఫ్‌లో మహిళలు అద్భుతమైన విజయాలు సాధించారు.
స్త్రీ సాధికారతకు పెద్ద పీట వేస్తున్న సీఆర్‌పీఎఫ్‌లో తాజాగా ఇద్దరు మహిళా ఉన్నతాధికారులు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజీ) ర్యాంక్‌కు ప్రమోట్‌ అయ్యారు...

ఉద్యోగాలు రెండు రకాలుగా ఉంటాయి. కడుపులో చల్ల కదలకుండా హాయిగా చేసేవి ఒక రకం. రెండో రకం ఉద్యోగాలు మాత్రం అడుగడుగునా సవాలు విసురుతాయి. మన సామర్థ్యాన్ని పరీక్షించి చూస్తాయి. ‘అమ్మాయిలకు పోలీసు ఉద్యోగాలేమిటి!’ అనుకునే రోజుల్లో సాయుధ దళాల్లోకి వచ్చారు సీమ దుండియా, అనీ అబ్రహాం. వృత్తి నిబద్ధతతో ఉన్నతశిఖరాలకు చేరారు.

తాజాగా ఈ మహిళా ఉన్నతాధికారులు సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌)లో ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(ఐజీ) ర్యాంక్‌కు ప్రమోట్‌ అయ్యారు. సీమా దుండియా సీఆర్‌పీఎఫ్‌–బిహార్‌ విభాగానికి, అనీ అబ్రహాం ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌(ఆర్‌ఎఎఫ్‌)కు నేతృత్వం వహించనున్నారు. ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌కు ఒక మహిళ నాయకత్వం వహించడం ఇదే మొదటిసారి.

‘ఇదొక గొప్ప విజయం అనడంలో సందేహం లేదు. కేంద్ర రిజర్వు పోలీసు దళాలలో మహిళలు ఉగ్రవాదం నుంచి ఎన్నికల హింస వరకు అనేక రకాల సవాళ్లు ఎదుర్కొంటున్నారు. తమను తాము నిరూపించుకుంటున్నారు. మహిళా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందిలేని వాతావరణాన్ని కల్పించడం,  సౌకర్యాలపై దృష్టిపెట్టడం, ఉన్నత విజయాలు సాధించేలా వారిని ప్రోత్సహించడం, ఆర్‌ఎఎఫ్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లడం ఇప్పుడు నా ప్రధాన లక్ష్యాలు’ అంటుంది ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ చీఫ్‌ అనీ అబ్రహం.

ఇక సీమా దుండియా స్పందన ఇలా ఉంది...
‘నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో సీఆర్‌పీఎఫ్‌లో పురుషాధిపత్య ధోరణులు కనిపించేవి. మగవాళ్లతో పోటీ పడగలమా? అనే సందేహం ఉండేది. దీంతో మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది. అయితే ఆ కష్టం వృథా పోలేదు. మంచి విజయాలు సాధించేలా చేసింది. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచేలా చేసింది. మొదట్లో మమ్మల్ని సందేహంగా చూసిన వారే ఆ తరువాత మనస్ఫూర్తిగా ప్రశంసించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

నా అనుభవాలతో కొత్తవారికి మార్గదర్శనం చేయాలనుకుంటున్నాను’ అంటుంది సీమా. సీఆర్‌పీఎఫ్‌ మహిళా విభాగం ఫస్ట్‌ బ్యాచ్‌కు చెందిన సీమా, అబ్రహామ్‌లు ఐక్యరాజ్యసమితి తరపున ఆల్‌–ఫిమేల్‌ ఫార్మ్‌డ్‌ పోలీస్‌ యూనిట్‌ (ఎఫ్‌పీయూ)లో కమాండర్‌లుగా పనిచేశారు. ఇద్దరూ రాష్ట్రపతి పోలీస్‌ మెడల్స్‌ అందుకున్నారు.

‘ఒకసారి యూనిఫాం వేసుకున్నాక...ప్రమాదకరమైన ప్రాంతమా, భద్రతకు ఢోకాలేని ప్రాంతమా అనే ఆలోచన రాదు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవలసిందే అనే ఆత్మబలం వచ్చి చేరుతుంది. అదే ఈ వృత్తి గొప్పదనం’ అంటుంది అనీ అబ్రహాం. మూడు దశాబ్దాల అనుభవంతో ఈ ఇద్దరు సాహసికులు ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. ఆ పాఠాలు భవిష్యత్‌ తరానికి విలువైన పాఠాలు కానున్నాయి.

Advertisement
 
Advertisement