
కొన్ని దేశాల్లో ఉండే ఆచారాలు ఎంతలా వింతగా ఉంటాయంటే..వినడానికి నమ్మశక్యం కానంతగా ఉంటాయి. ఇవేమి పద్ధతులు..ఎందుకిలా అని ఆరా తీసినా..వాటి వివరణ సైతం నోరెళ్లబెట్టేలా ఉంటుంది. అచ్చం అలాంటి విచిత్రమైన సంస్కృతే ఇండోనేషియాలోని ఓ తెగ ఆచరిస్తుంది. ఆ కారణంగానే వార్తల్లో నిలిచింది కూడా. అంతేకాదండోయ్ దాన్ని చూసేందుకు పర్యాటకులు సైతం ఎగబడుతున్నారు. పైగా అలాంటి థ్రిల్ కావలంటూ.. మరి వస్తున్నారట టూరిస్టులు. మరి ఇంతకీ అంతలా ఆశ్చర్యపరిచే ఆ ఆచారం కథాకమామీషు ఏంటో సవివరంగా తెలుసుకుందామా..!.
కుటుంబంలో ఎవ్వరైన చనిపోతే అంత్యక్రియలు నిర్వహిస్తారు..ఆ తర్వాత జరిగే కార్యక్రమాలు వారి వర్గాల నేపథ్యం అనుసరించి పదకొండు అంతకు మించిన రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది అత్యంత సర్వసాధారణం. కానీ ఇండోనేషియాలోని దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోనే తానా తోరాజా అనే గిరిజన తెగ మాత్రం అలాచేయరు.
చనిపోయిన వారిని మమ్మీలుగా మార్చి వాటితో జీవిస్తారట. అంత్యక్రియలకు కావల్సినంత సొమ్ము సమకూరాక గానీ నిర్వహించరట. పైగా ఆ వారి పూర్వీకుల శవాలను ఎంతో భద్రంగా చూసుకుంటారట. కొత్తబట్టలు తొడిగి, ఆహారాలను కూడా నివేదిస్తారట. వారి కుటుంబంలోకి కొత్తగా వచ్చిన తరాలకు వీటని చూపించి..ప్రతి రెండేళ్లకు ఒకసారి ఆ మమ్మీలను బయటకు తీసి..కొత్త బట్టలు వేయడం, ఆహారం నివేదించడం వంటివి చేస్తారట.
ఎందుకిలా అంటే..
అక్కడ అంత్యక్రియల తంతు చాలా ఖర్చుతో కూడుకున్నదట. అందువల్ల వారికి వాటిని ఖననం చేయడాని సంత్సరాల తరబడి సమయం పడుతుందట. ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఒక ట్రావెలర్ దీని గురించి ఆరా తీయగా.. అందుకు ఏకంగా రూ.4 కోట్లు పైనే ఖర్చు అవుతుందని చెప్పారట ఆ తెగ ప్రజలు. వాళ్లకి అంత్యక్రియలనేవి వేడుకలాంటివట. ఈ తంతు ఐదురోజుల జరుగుతుందట. పైగా ఆ కుటుంట సభ్యుల సంఖ్యను అనుసరించి అంతే సంఖ్యలో గెదెలను, పందులను బలి ఇవ్వాలి. అలాగే వందలాది మంది అతిథులకు ఆతిథ్యం ఇవ్వాలి.
దీంతోపాటు చనిపోయిన వారికి ఒక కొత్త స్థలంలో గుడిసెను నిర్మించి అందులో దహన సంస్కారాలు నిర్వహిస్తారట. అందువల్ల అంత డబ్బు సమకూరేంత వరకు వాటిని మమ్మీలుగా మార్చి జాగ్రత్తగా సంరక్షిస్తారట ఆ తెగ ప్రజలు. అప్పటి వరకు ఆ కుటుంబ సభ్యులంతా ఆ శవాలతోనే జీవిస్తారు. చెప్పాలంటే..వాళ్లు తమతో ఉన్నట్లుగానే వాళ్లు వ్యవహరిస్తారట.
కాగా, ఇటీవల ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ శరణ్య అయ్యర్ ఇండోనేషియా గ్రామాన్ని సందర్శించి..అక్కడ సంస్కృతిని వీడియో రూపంలో నెట్టింట షేర్ చేయడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఆమె తానా తోరాజా ఏజెన్సీ సందర్శించి చనిపోయిన వారి మద్య జీవించడం, వారితో కలిసి ఉండటం వంటి థ్రిల్లింగ్ అనుభవాన్ని పొందానని పోస్ట్‌లో వివరించింది. అంతేగాదు ఈ ప్రత్యేకమైన సంస్కృతిని తిలకించేందుకే పర్యాటకులు ఇక్కడకు తండోపతండాలు తరలి వస్తుంటారని చెప్పుకొచ్చింది.
(చదవండి: ఇటలీలో డీజే ఫెస్టివల్‌లో మారుమ్రోగిన శివ తాండవస్త్రోతం..!)