స్నేహబంధమూ ఎంత మధురమూ...

Tollywood Moviews On Friendship based Movies - Sakshi

నేడు ఫ్రెండ్‌షిప్‌ డే

... చెరిగిపోదు కరిగిపోదు జీవితాంతము అని రాశారు కవి ఆత్రేయ. ‘అల్లాయే దిగి వచ్చి అడిగినా ఒక్క దోస్తే చాలంటాను’ అని రాశారు సినారె. ‘బతుకు తీపి పాటలో మధుర స్వరాలే స్నేహితులు’ అని రాశారు సిరివెన్నెల. స్నేహం, చెలిమి, మైత్రి, సోబత్,  సావాసం, జత గట్టడం, నేస్తు కావడం... మాటలు ఏవైనా స్నేహితులు లేకపోతే ఆ జీవితం చిరుగాలికి, జల్లింతకు, సేద తీరే నీడకు వీలు లేని నిరర్థక వృక్షంలా ఉంటుంది. ఈ క్వారంటైన్‌ కాలంలో ఎవరు ఎక్కడ బందీ అయినా ఒక్క స్నేహితుడి ఫోన్‌ కాలే కదా ఊపిరి. దేవుడా... జేబులో రూపాయి ఉన్నా లేకున్నా చుట్టూ పది మంది స్నేహితులు ఉండే శ్రీమంతులతో
ఈ లోకాన్ని నింపు. జగత్తును స్నేహమయం చెయ్‌.

‘దేవదాసు’ అక్కినేనికి స్నేహితుడు ‘భగవాన్‌’ అనే పేకేటి శివరాం మేలు చేశాడో కీడు చేశాడో చెప్పలేం. ప్రేమ విఫలమైన దేవదాసుకు మందు ఒక మందుగా సిఫార్సు చేస్తాడు పేకేటి శివరాం. అంతే కాదు... చంద్రముఖిని పరిచయం చేస్తాడు. మందు దేవదాసును నాశనం చేస్తే చంద్రముఖి కొంత ఓదార్పునైనా మిగిల్చింది. మంచికైనా చెడుకైనా సినిమాల్లో హీరోలకు స్నేహితులు ఉన్నారు.
‘పాతాళభైరవి’లో ఎన్‌.టి.ఆర్‌కు అంజిగాడు (బాలకృష్ణ) ఫ్రెండు. కాని బాలకృష్ణ అనే పేరు ఎవరూ తలవరు.

మరణించేవరకూ ఆయన అంజిగాడే. స్నేహితుడికి మారుపేరు. ‘ఏడ్రా... మీ అంజిగాడు’ అనంటే ‘ఏడి.. మీ ఫ్రెండు’ అని అర్థం. తెలుగు సినిమాల్లో ఆ తర్వాత ఇదో ఫార్ములా అయ్యింది. హీరో పక్కన కమెడియన్‌ ఫ్రెండ్‌గా ఉండటం. ఇప్పటికీ ఆ ట్రెండ్‌ కొనసాగుతూ ఉంది. బ్రహ్మానందంతో మొదలు సునీల్‌. శ్రీనివాస రెడ్డి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ... వీరంతా అలాంటి ఫ్రెండ్సే. అర్జున్‌ రెడ్డి సినిమాలో విజయ్‌ దేవరకొండ పాత్రతో సమానంగా రాహుల్‌ రామకృష్ణ పాత్ర ప్రేక్షకులకు నచ్చింది. ట్రూ ఫ్రెండ్‌ రాహుల్‌ రామకృష్ణ ఆ సినిమాలో. అర్జున్‌ రెడ్డి అనేముంది ఎవరైనా సరే జీవిత సంక్షోభాలు దాటాలంటే అలాంటి ఫ్రెండే కదా ఉండాలి.
∙∙
కుటుంబ సంబంధాలు, అన్నదమ్ముల లాస్ట్‌ అండ్‌ ఫౌండ్‌ ఫార్ములా... ఇవి కథలవుతున్న వేళ స్నేహం, స్నేహితుల పాత్రలు సినిమా కావడం తక్కువగా జరిగింది. కాని 1967లో హిట్‌ అయిన తమిళ సినిమా ‘పంద్యం’ ఆధారంగా తెలుగులో ‘మంచి మిత్రులు’ రీమేక్‌ అయ్యింది. కృష్ణ, శోభన్‌బాబు ఫ్రెండ్స్‌. ఒకరు నీతి మార్గంలో, ఒకరు నేర మార్గంలో బయలుదేరి సగం దారి తర్వాత మార్గాలు తారుమారు చేసుకుంటారు. తెలియకనే ఒకరికి ఒకరు శతృవులవుతారు. స్నేహం, నైతికత వీటిలో ఏది ప్రధానం అనే చర్చ వస్తుంది.

ఇందులోని ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం’ పాట నేటికీ స్నేహితులు చాలారోజుల తర్వాత కలిస్తే పాడుకునే పల్లవిగా నిలిచి ఉంది. దాని కొనసాగింపుగా 1972లో ‘బాలమిత్రుల కథ’ వచ్చింది. కామందు కొడుకు, పాలేరు కొడుకు స్నేహితులుగా ఉండగలరని చూపింది. ‘గున్నమామిడి కొమ్మ మీద గూళ్లు రెండున్నాయి’ పాట ఇప్పటికీ స్నేహపు పిందెలను కాయలను కాస్తూనే ఉంది. 1973లో ‘స్నేహబంధం’ వచ్చి ‘స్నేహబంధము ఎంత మధురము’ అనే నిర్వచన గీతాన్ని ఇచ్చింది. 1974 ‘నిప్పులాంటి మనిషి’లో ఎన్‌.టి.ఆర్‌కు సత్యనారాయణ వంటి గట్టి స్నేహితుణ్ణి చూపింది. ‘స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం’ అని చెప్పింది.

1977 సంవత్సరం చిత్రంగా రెండు స్నేహాలను తెలుగు ప్రేక్షకులకు చూపింది. ఒకటి హిందీలో ‘దోస్తీ’ ఆధారంగా బాపు తీసిన ‘స్నేహం’. మరొకటి ఎన్‌.టి.ఆర్‌ తీసిన ‘దానవీరశూరకర్ణ’. ‘స్నేహం’  వికలాంగుడికి, అంధుడికి మధ్య ఉన్న స్నేహం చూపితే ‘దానవీరశూరకర్ణ’ అవాంఛిత శిశువు అవడం వల్ల న్యూనతను అనుభవించాల్సి వచ్చిన కర్ణునికి బాసటగా నిలిచిన దుర్యోధనుని స్నేహం చూపింది. నిండు సభలో కర్ణుణ్ణి అవమానించినందుకే కదా ఎన్‌.టి.ఆర్‌ చరిత్రాత్మక సుదీర్ఘ డైలాగ్‌ ‘హితుడా... ఆగాగు... ఏమంటివి ఏమంటివి’ చెప్పింది. ‘స్నేహం’లో స్నేహం విలువ చెప్పే ‘నీవుంటే వేరే కనులెందుకు’... ఎంతో తీయగా ఉంటుంది.
∙∙
1978లో ప్రఖ్యాత కన్నడ దర్శకుడు పుట్టణ్ణ ఈ స్నేహానికి సామాజిక బాధ్యత ఇస్తూ ఒక కొత్త  ఫార్ములాతో ఒక సూపర్‌హిట్‌ సినిమా తీశాడు. అదే తెలుగులో ‘మనవూరి పాండవులు’గా వచ్చింది. ఐదుమంది స్నేహితులు కలిసి ఊళ్లోని ఒక రాక్షసుణ్ణి తుదముట్టించడం కథ. ఇది తర్వాతి కాలంలో పెద్ద హిట్‌ ఫార్ములా అయ్యింది. వెంకటేశ్‌ తొలి సినిమా ‘కలియుగ పాండవులు’తో మొదలెట్టి ‘శివ’,‘యువసేన’, ‘ఠాగూర్‌’, ‘మల్లన్న’, ‘స్పైడర్‌’.... ఈ సినిమాలన్నింటిలో బేస్‌ ఫార్ములా ఇదే. స్నేహితులు విడివిడిగా ఉంటే స్నేహితులే అవుతారు. కాని ఏకమైతే పెద్ద శక్తి అవుతారు.
∙∙
కమర్షియల్‌ సినిమా స్నేహాన్ని కథాంశంగా రెగ్యులర్‌గా తీసుకుంటూనే ముందుకు వెళ్లింది. కృష్ణంరాజు, శరత్‌బాబు ముఖ్యపాత్రల్లో ‘ప్రాణస్నేహితులు’ వచ్చింది. ఇందులోని ‘స్నేహానికన్న మిన్న లోకాన లేదురా’ పాట హిట్‌ అయ్యింది. బాలకృష్ణ, మోహన్‌బాబులతో ‘ప్రాణానికి ప్రాణం’ వచ్చింది. ‘చిన్నారి స్నేహం’, ‘పెళ్లిపందిరి’, ‘కొండవీటి రాజా’, ‘స్నేహం కోసం’, ‘స్నేహమంటే ఇదేరా’, ‘హనుమాన్‌ జంక్షన్‌’... ఇంకా ఈ వరుస ఎక్కువగానే ఉంది. మరోవైపు రజనీకాంత్‌ స్నేహాన్ని గట్టిగా చూపుతూ ‘దళపతి’, ‘బాషా’, ‘కథానాయకుడు’, ‘ముత్తు’ వంటి సినిమాలు ప్రేక్షకులకు ఇచ్చాడు.
∙∙
అయితే అమ్మాయి అబ్బాయిల మధ్య స్నేహం ఉండకూడదా అనే సూచన చేస్తూ సినిమాలు మొదలయ్యాయి. తెలుగులో డబ్‌ అయిన తమిళ సినిమా ‘ప్రేమదేశం’ ఈ స్నేహాన్ని ప్రతిపాదించింది. అబ్బాస్, వినీత్, టబూ ఒకరి ఆకర్షణలో మరొకరు పడినా స్నేహితులుగా మిగులుతారు. ఇందులోని ఫ్రెండ్‌షిప్‌ సాంగ్‌ ‘ముస్తఫా ముస్తఫా డోంట్‌వర్రీ ముస్తఫా’కు యువతరం ఊగిపోయింది. ఈ కథ చిరంజీవి అంతటి స్టార్‌ను ఎట్రాక్ట్‌ చేసి ‘ఇద్దరు మిత్రులు’ కథ చేశాడు. అందులో సాక్షి శివానంద్, చిరంజీవి ఫ్రెండ్స్‌. వెంకటేశ్‌ ‘వసంతం’లో కల్యాణికి మంచి ఫ్రెండ్‌గా ఉంటాడు. ‘నువ్వే కావాలి’లో హీరో హీరోయిన్లు తాము ఫ్రెండ్స్‌గా ఉంటూ చివరకు ప్రేమికులుగా కూడా ఉందాం అని నిశ్చయించుకుంటారు. కాని అమ్మాయి, అబ్బాయిల మధ్య స్నేహం ఎప్పుడూ కత్తి మీద సామే సినిమాగా తీయాలంటే.
∙∙
కాలం మారింది. కొత్త దర్శకులు వచ్చారు. కొత్త స్నేహాన్ని చూపారు. ‘గమ్యం’లో శర్వానంద్‌ జీవితాన్ని అల్లరి నరేశ్‌ స్నేహం, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో నాని జీవితాన్ని విజయ్‌ దేవరకొండ స్నేహం, ‘మహర్షి’లో మహేశ్‌ బాబు జీవితాన్ని అల్లరి నరేశ్‌ స్నేహం పూర్తిగా మార్చేస్తాయి. శేఖర్‌ కమ్ముల ‘హ్యాపిడేస్‌’, ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ కాలేజీ స్నేహాన్ని అందంగా చూపింది. ‘శంభో శివ శంభో’, ‘ఓ మై ఫ్రెండ్‌’, ‘కేరింత’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమా దాస్‌’, ‘జాతిరత్నాలు’... ఇవన్నీ ఇటీవలి స్నేహితులను చూపిన సినిమాలు.
స్నేహం ఉన్నంత కాలం స్నేహాన్ని చూపే సినిమాలు ఉంటాయి. ఎందుకంటే స్నేహం ఎప్పుడూ ఒక జీవమున్న కథా ఊట.
చిన్నారి స్నేహమా... చిరునామా తీసుకో
గతమైన జీవితం.. కథలాగా దాచుకో
మనసైతే మళ్లీ చదువుకో....

‘ప్రేమదేశం’లో...
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top