
అరటి చెట్టు ఇంటికి అందం. అరటి ఆకు భోజనానికి ఆరోగ్యం, అరటి కూరలు వంటికి చాలామంచిది అరటికాయతో అనేక రుచికరమైన వంటకాలు చేయవచ్చు. అరటికాయ వేపుడు, అరటికాయ పచ్చడి, అరటికాయ పులుసు, అరటికాయ కూర, అరటికాయ బజ్జీలు, అరటికాయతో హల్వా, అరటికాయతో చిప్స్, అరటికాయతో స్నాక్స్ వంటివి. వీటిని వివిధ రకాలుగా తయారుచేసి తినవచ్చు. మనకు విరివిగా దొరికే అరటి పండ్లతో చేసుకునే మరికొన్ని రుచులను ఎపుడైన ప్రయత్నించారా? చిన్నా పెద్దా అంతా ఇష్టంగా ఆరగిస్తారు. ఇవాల్టి టిప్ ఆఫ్ దిడే లో భాగంగా కొన్నింటిని చూద్దాం. !
చాక్‌లెట్ బనానా హల్వా
కావలసినవి: పండిన అరటి పండ్లు – 4; నెయ్యి – 5 టేబుల్ స్పూన్లు; పంచదార – అర కప్పు (లేదా రుచికి సరిపడా); ఏలకుల పొడి – అర టీ స్పూన్; జీడిపప్పు, బాదం పప్పు-కొన్ని (సన్నగా తరిగినవి, నేతిలో వేయించుకోవాలి); చాక్లెట్‌పౌడర్ – అర కప్పు (అభిరుచిని బట్టి);
తయారీ: అరటి పండ్లను మెత్తగా చిదుముకోవాలి. ఒక పాన్‌లో నెయ్యి వేడి చేసి, అరటి పండు ముద్దను వేసి మధ్యస్థ మంట మీద, బాగా కలపాలి. అరటిపండు ముద్ద రంగు మారిన తర్వాత పంచదార, చాక్లెట్ పౌడర్ వేసి బాగా కలపాపాలి. పంచదార కరిగి, హల్వా దగ్గర పడ్డాక ఏలకుల పొడి వేసి మరోసారి కలపాలి. చివరగా, నెయ్యిలో వేయించిన జీడిపప్పు, బాదం పప్పులతో కలిపి, సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.

ఘీ రోస్ట్
కావలసినవి: అరటిపండ్లు – 3 (మరీ పండినవి కాకుండా, కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకుని ముక్కలు చేసి పెట్టుకోవాలి); పంచదార – సరిపడా; ఏలకుల పొడి – అర టీస్పూన్; నెయ్యి (ఘీ)– సరిపడా.
తయారీ: ముందుగా పాన్‌లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని, వేడి చేసుకోవాలి. ఆ నేతిలో అరటిపండు ముక్కలను పాన్ మొత్తం పరచుకోవాలి. చిన్న మంట మీద వేయించుకుంటూ పంచదారను అరటిపండు ముక్కలపై జల్లుకుని, దోరగా వేయించుకుంటూ ఇరువైపులా తిప్పుకుంటూ ఉండాలి. అవసరం అయితే నెయ్యి, పంచదార మరికాస్త వేసుకోవచ్చు. చివరిగా ఏలకుల పొడి జల్లుకోవాలి. అరటిపండు ముక్కలు దోరగా వేగి, పంచదార కరిగి పాకం– ముక్కలకు పట్టిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు.

బనానా-ఓట్ స్మూతీ రెసిపీ
కావలసినవి: పండిన అరటి పండు – ఒకటి; ఓట్స్ – 2 టేబుల్ స్పూన్లుపాలు – ఒక కప్పు (ఆవుపాలు లేదా బాదంపాలు); తేనె – 2 టీ స్పూన్లు (లేదా రుచికి సరిపడా); చియా సీడ్స్ – ఒక టీ స్పూన్; ఐస్ క్యూబ్స్ – కొన్ని.
తయారీ: ఓట్స్ ను 5 నిమిషాల పాటు పాలలో నానబెట్టాలి. ఒక మిక్సీజార్‌లో నానిన ఓట్స్, అరటి పండు, పాలు, తేనె, చియా సీడ్స్, ఐస్ క్యూబ్స్ వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టుకుని, నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.
