పిల్లలు మొబైల్‌కు అడిక్ట్‌ కాకుండా ఉండాలంటే, ఇలా చేయండి..!

Tips To Follow To De Addict Kids From Mobile Addiction - Sakshi

డిజిటల్‌ డీఅడిక్షన్‌

పుస్తకం హస్తభూషణం అనేది పాత మాటయితే, స్మార్ట్‌ ఫోన్‌ సర్వహస్త భూషణం అనేది ఈనాటి మాట. అది భూషణమైతే పర్వాలేదు.. అదొక వ్యసనంగా మారింది. ఇప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకూ పట్టి పీడిస్తున్న సమస్య మొబైల్‌ అడిక్షన్‌. 

అసలు దేన్ని వ్యసనమంటారు?
ఈ రోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. పిల్లలు ఆన్‌లైన్‌ క్లాసులు, ఆన్‌లైన్‌ గేమ్స్‌ కోసం వాడుతుంటే.. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ట్విటర్‌ లాంటి సోషల్‌ మీడియా ఇంకా రకరకాల కారణాల కోసం పెద్దలు వాడుతున్నారు. మొబైల్‌ వాడటం తప్పుకాదు. ఆ వాడకం ఎక్కువై మన రోజువారీ పనుల్ని ఇబ్బంది పెడుతుంటే, దాన్ని మానుకోవాలనుకున్నా మానుకోలేకపోతే దాన్నే వ్యసనం అంటారు. మన దేశంలో 33 శాతం మందికి ఈ వ్యసనం ఉందని ఒక అధ్యయనంలో తేలింది.

అసలెందుకు అడిక్ట్‌ అవుతారు?
మనం ఏ పని చేసినా, ఎంత సంపాదించినా.. అంతిమ లక్ష్యం ఆనందమే. నచ్చినపని చేసినప్పుడు మెదడులో డొపమైన్‌ అనే కెమికల్‌ విడుదలవుతుంది. స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించినప్పుడు కూడా ఇదే కెమికల్‌ విడుదలవుతుంది. సిగరెట్‌ తాగేవాళ్లు నికోటిన్‌కు, మద్యం తాగేవాళ్లు ఆల్కహాల్‌కు అడిక్ట్‌ అయినట్లే స్మార్ట్‌ ఫోన్‌ వాడేవాళ్లు డొపమైన్‌కు అడిక్ట్‌ అవుతారు. అంటే డొపమైన్‌ విడుదల వల్ల వచ్చే ఆనందానికి అడిక్ట్‌ అవుతారు.

గతంలో పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తేనో, ఆటల్లో గెలిస్తేనో సంతోషం కలిగేది. ఇప్పుడంత అవసరం లేదు. సోషల్‌ మీడియాలో ఫొటోలకు లైకులు, కామెంట్స్‌ వచ్చినా ఆనందపడుతున్నాం.. డొపమైన్‌ విడుదలవుతోంది. చాలామంది స్మార్ట్‌ ఫోన్‌ను ఒక సాధనంగా కాకుండా తమ వ్యక్తిత్వంలో భాగం (ఎక్స్‌టెండెడ్‌ సెల్ఫ్‌) గా భావిస్తున్నారు. అందుకే కాసేపు మొబైల్‌ దూరమైతే, తమలో ఒక భాగం దూరమైనట్లుగా ఆందోళన చెందుతుంటారు. స్మార్ట్‌ ఫోన్‌ను వదిలి ఉండలేకపోతుంటారు. 

ఈ తరం పిల్లలకు స్మార్ట్‌ ఫోన్‌ కేవలం ఫోన్‌ మాత్రమే కాదు. తమ జీవితంలో జరిగే ప్రతీ ఆనందకరమైన సంఘటనను దాచుకునే.. చూసుకునే సాధనం. నాన్న చేతిని పట్టుకుంటే ఎంత భరోసాగా ఉంటుందో, అమ్మ చేతి ముద్ద ఎంత కమ్మగా ఉంటుందో మొబైల్‌ వాడేటప్పుడు కూడా అలాగే ఫీలవుతుంటారు.

మీ పిల్లలు మొబైల్‌కు అడిక్ట్‌ కాకూడదనుకుంటే మీరు చేయాల్సినవి..

  • పిల్లలు మొబైల్‌ తక్కువగా వాడాలంటే ముందు పేరెంట్స్‌ మొబైల్‌ వాడకం తగ్గించాలి. పిల్లలు అనేక విషయాల్లో పేరెంట్స్‌నే రోల్‌ మోడల్‌గా తీసుకుంటారు.  
  • 12 ఏళ్లలోపు పిల్లలు గంటలు గంటలు స్మార్ట్‌ ఫోన్‌ను ఉపయోగిస్తే వాళ్ల బ్రెయిన్‌ డెవలప్‌మెంట్‌ పై ప్రభావం పడుతుంది. కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచే మొబైల్‌ను దూరంగా పెట్టండి. 
  • మానవ సంబంధాలకు మెదడులోని ఫ్రంటల్‌ లోబ్‌ రెస్పాన్సిబుల్‌. ఆ భాగం బాల్యంలో బాగా పెరుగుతుంది. బాల్యంలో స్మార్ట్‌ ఫోన్‌తోనే ఎక్కువ సమయం గడపడం వల్ల పెరుగుదల మందగిస్తుంది. ఫలితంగా సోషల్‌ స్కిల్స్‌ తగ్గుతాయి. అటెన్షన్‌ తగ్గుతుంది. ఇతరుల ఆటిట్యూడ్‌ని, బిహేవియర్, కమ్యూనికేషన్‌ని అర్థం చేసుకోవడమూ తగ్గుతుంది.
  • పిల్లలు ఎంతసేపు స్క్రీన్‌ చూశారనే దానికన్నా, చూసినదాంట్లో హ్యూమన్‌ పార్టిసిపేషన్, షేరింగ్‌ ఉన్నాయా లేవా అనేది ముఖ్యం. అంటే పిల్లలు ఒంటరిగా ఫోన్‌తో ఎంగేజ్‌ అయితే నష్టం. పేరెంట్స్‌తో కలసి చూస్తే, చూసేటప్పుడు మాట్లాడుకుంటే మంచిది. 
  • పిల్లల అల్లరిని తప్పించుకునేందుకు వాళ్ల చేతికి ఫోన్‌ ఇవ్వడం వాళ్లను ఒంటరితనానికి అలవాటు చేసి మనుషులకు దూరం చేయడమే. Toddlers need laps, not apps.
  • మొబైల్‌లో పిల్లలకు పనికి వచ్చే టెడ్‌–ఎడ్, కోరా లాంటి ఎడ్యుకేషనల్‌ యాప్స్‌ను పరిచయం చేయండి. 
  • పిల్లలు ఎంతసేపు స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగిస్తున్నారనేది కాదు, ఎలా ఉపయోగిస్తున్నారనేది వాళ్ల స్క్రీన్‌ అడిక్షన్‌ను, సోషల్, ఎమోషనల్‌ సమస్యలను నిర్దేశిస్తుందని అధ్యయనంలో తేలింది. కాబట్టి వాళ్లకు మొబైల్‌ ఎలా ఉపయోగించాలో నేర్పించండి. ఉదాహరణకు మొబైల్‌లో క్రికెట్‌ బాగా ఆడినంత మాత్రాన గ్రౌండ్‌లో బాగా ఆడలేరని, మొబైల్‌లో బైక్‌ రేస్‌లో గెలిచినంత మాత్రాన రోడ్‌ పై బైక్‌ నడపలేరని వివరించండి. 
  • మొబైల్‌ గేమ్స్‌లోని స్కిల్స్‌ బయటకు ట్రాన్స్‌ఫర్‌ కావనే విషయం వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి. 
  • టీనేజర్లకు స్క్రీన్‌ టైమ్‌ను నియంత్రించడం కచ్చితంగా వర్కవుట్‌ కాదు. అది పేరెంట్స్‌పై వ్యతిరేకతను పెంచుతుంది. అందువల్ల వాళ్లతో కూర్చుని మాట్లాడి రీజనబుల్‌ టైమ్‌ చూసేందుకు ఒప్పించండి. 
  • ఫోన్‌ పక్కన పెట్టేయమని కోప్పడకుండా యాక్టివ్‌ ఎంగేజ్‌మెంట్‌ ఉండే హాబీలు, పనుల్లోకి డైవర్ట్‌ చెయ్యండి. అలాంటి పనులు చేసినప్పుడు తరచుగా అభినందించండి. ప్రతి ప్రశంస వారి మెదడులో డొపమైన్‌ను రిలీజ్‌ చేస్తుంది. 

ఇవేవీ ఫలితమివ్వకపోతే సైకాలజిస్ట్‌ను సంప్రదించండి. డిజిటల్‌ డీఅడిక్షన్‌ ద్వారా మీ పిల్లలు మొబైల్‌కు దూరమయ్యేలా చికిత్స అందిస్తారు. 

సైకాలజిస్ట్‌ విశేష్‌
psy.vishesh@gmail.com
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top