పిల్లల ఊహాశక్తికి సరైన ఇంధనం.. ‘టిక్లింగ్‌ టేల్స్’‌

Tickling Tales Story Telling For Childrens By Doctor Swetha - Sakshi

పిల్లల ఊహాశక్తికి సరైన ఇంధనం కథ. పిల్లల మెదళ్లను చురుగ్గా మార్చగలిగే సాధనం కథ కానీ, ఈ డిజిటల్‌ యుగంలో యంత్రాలతో కుస్తీ పడే పిల్లలకు కథ చేరువలో లేదు.నాయనమ్మ, తాతయ్య లేని చిన్న కుటుంబాలు.సంపాదనలో తల్లీదండ్రులవి తీరికలేని క్షణాలు. ఇలాంటి లోకంలో పిల్లల మానసిక శక్తి గురించి ఆలోచించారు డాక్టర్‌ శ్వేత.టిక్లింగ్‌ టేల్స్‌ అంటూ పిల్లలకోసం కథల పందిరి అల్లుతున్నారు. 

రాజస్థాన్‌లో పుట్టి పెరిగిన శ్వేత వృత్తిరీత్యా దంతవైద్యురాలు. తల్లి అయ్యాక మూడేళ్ల కొడుకు తను ఏం చెప్పినా ‘ఊ..’ కొట్టే విధానం ఆమెను కట్టిపడేసింది. ఎంతో తెలుసుకోవాలనే ఆరాటం గల ఆ చిన్న వయసు ‘కథ చెప్పవూ’ అని అడుగుతున్నట్టుగా అనిపించేది’ అంటారు శ్వేత. ఆ ఆలోచనే ఇప్పుడు వేలాది మంది పిల్లలకు కథలు చెప్పేలా చేసింది అంటారామె. అక్కణ్ణుంచే ‘టిక్లింగ్‌ టేల్స్‌’అంటూ లిటిల్‌ స్టార్స్‌కి కథల పందిరి వేస్తోంది. తల్లిదండ్రులకు కథలు చెప్పడంలో నైపుణ్యాలు చెబుతుంది. స్కూళ్లలో కథల వర్క్‌షాప్స్‌ నడుపుతోంది. పిల్లల పుట్టిన రోజులు, పాఠశాల వార్షికోత్సవాలు.. అది ఇది అని ఏమీ లేకుండా పిల్లలు ఎక్కడుంటే అక్కడ కథలతో దోస్తీ చేయిస్తుంది. రచయిత్రిగా, కథకురాలిగా, శిక్షకురాలిగా, కోచ్‌గా, టిక్లింగ్‌ టేల్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ శ్వేత అద్భుతమైన పాత్రలను పోషిస్తోంది. 

చదవని వారికి వినిపించే కథ
‘చిన్నతనం లో తల్లితో కలిసి భయం భయంగా లైబ్రరీకి వెళ్లిన తొలిరోజులను ఇప్పటికీ గుర్తుకు చేసుకుంటుంది శ్వేత. అక్కడ తను చూసిన కథల పుస్తకాలు పఠనం పట్ల ఎలా ఆసక్తిని పెంచిందో చెబుతుంది. ఆ ఆసక్తే ఇప్పుడు ప్రతిభావంతులైన కథకుల బృందానికి నాయకత్వం వహించేలా చేసింది’ అంటోంది ఈ డాక్టర్‌. ‘బాగా చెప్పాలంటే బాగా చదవాలనే విషయాన్ని ఎప్పుడో గ్రహించాను. ఇప్పుడు పిల్లలను చూడండి. వారు ఎంతసేపూ వీడియో గేమ్స్‌ ఆడటమే చూస్తున్నాం. కథల పుస్తకాలు చదవడం అనేదే మనం చూడటంలేదు. ఈ తరం ఎక్కడికి వెళుతుందో అనే ఆందోళన నాది. నా కొడుకుతో కాసేపు సమయం గడిపినా వాడిని కథల్లోకి తీసుకెళ్లిపోతాను.

నేను చదివిన విషయాలన్నీ వాడికి కథలుగా మార్చి చెబుతుంటాను. వాడిపై ఆ కథల ప్రభావం, ఫలితాన్ని చూసినప్పుడు తల్లిగా నా ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా మారిందో అర్ధమైంది. అప్పుడే మా ఇంటి నాలుగు గోడలు దాటి కథలు వినే పిల్లల సంఖ్య పెరగాలన్న విషయం గ్రహించాను. ఎక్కువమంది పిల్లలకు కథలు వినసొంపుగా చెప్పాలంటే నేను మరిన్ని పుస్తకాలతో ప్రేమలో పడాలి. ఈ వాస్తవాన్ని గ్రహించి ఇంట్లో పుస్తకాల లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నాను. ఎవరైనా తల్లితండ్రులు ఈ సూత్రాన్ని పాటించవచ్చు’ అంటారు డాక్టర్‌ శ్వేత. ఈ కథాస్టార్‌ బృందంలో ఆరుగురు కథలు చెప్పే ప్రతిభావంతులైన తల్లులు ఉన్నారు. ఈ బృందం రేపటితరానికి కథలతోఎలాంటి మార్గం వేయాలో సమావేశాలు ఏర్పరచుకుంటారు. తాము చేయబోయే, చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రణాళికలు రచిస్తుంటారు. 

కథా ప్రపంచంలోకి ప్రయాణం
‘టిక్లింగ్‌ టేల్స్‌’ అంటూ కథలు చెప్పడం 2013 లో ప్రారంభించింది డాక్టర్‌ శ్వేత. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదామె. టిక్లింగ్‌ టేల్స్‌ ముఖ్య ఉద్దేశం పాఠకులను పెంచడం, పిల్లలను తిరిగి పుస్తకాల లోకంలోకి తీసుకురావడం, వారిని చదివించేలా చేయడం, కథ చెప్పే సెషన్ల తోపాటు, ఉపాధ్యాయులతో శిక్షణా కార్యక్రమాలు, పాఠశాల సెషన్లు ఏర్పాటు చేయడం వంటివీ ఉంటాయి. 

ఆరోగ్యకరమైన ఎదుగుదలకు కథ
‘కథలు వినడం ప్రతి బిడ్డ జన్మహక్కు. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి పిల్లలకి మంచి ఆహారాన్ని ఇస్తారు. అదేవిధంగా ఆరోగ్యకరమైన జీవితం కోసం మనసు కూడా హెల్దీగా ఉండాలి. అందుకు ప్రతి బిడ్డకు మంచి ఆలోచన విధానం కలిగించాలి. కథలు ప్రతి బాల్యంలో అంతర్భాగం గా మారాలి. ఇంట్లో ఒక మేధావిని పెంచాలనుకుంటే ఆ బిడ్డకు అద్భుత కథలు చెప్పాలి. అలాగని ఉనికిలో లేని విషయాల గురించి చెప్పకూడదు. కథ ద్వారా ఏది మంచిది, ఏది మంచిది కాదనేది వారికి తెలిసిపోవాలి. కథలు చెప్పేటప్పుడు పిల్లలను తక్కువ అంచనా వేయవద్దు..’ అంటూ తల్లిదండ్రులకు, టీచర్లకు తన వర్క్‌సెషన్ల ద్వారా వివరిస్తారు డాక్టర్‌ శ్వేత. 

ప్రస్తుతం ముంబై కేంద్రంగా పనిచేస్తున్న టిక్లింగ్‌ టేల్స్‌ వర్చువల్‌ ప్లానెట్‌ వెంచర్‌ ద్వారా కథా శ్రవణాన్ని అందిస్తోంది. పిల్లలకు పుస్తకాలు అందేలా చూడటంతోపాటు మ్యూజిక్‌తో కూడిన ఆడియో కథలనూ జతచేసి ఇస్తున్నారు. సౌండ్‌ ఎఫెక్ట్స్‌తో ఆసక్తికరంగా ఆడియో కథల పుస్తకాల ద్వారా పదాల ఉచ్చారణ, పఠనం, శబ్దాన్ని నేర్పుతున్నారు. పిల్లలు కథను గుర్తుకు తెచ్చుకోవడానికి, తిరిగి ఆస్వాదించడానికి దేశవ్యాప్తంగా పప్పెట్‌ షోలను కూడా నిర్వహిస్తాం’ అని చెబుతున్నారు ఈ డాక్టర్‌.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top