వెంకట్రామయ్య ఇంట బహుమతుల పంట
నాలుగేళ్లలో 36సార్లు ఎడ్లబండ్ల పందేల్లో గెలుపు
ఎనిమిదేళ్లకు పైగా పోటీల నిర్వహణ
మంచిర్యాలఅర్బన్: ఎడ్లబండ్ల పోటీల్లో గెలవాలంటే బలమైన ఎద్దులు, నియంత్రించగలిగే నైపుణ్యం, వ్యూహం, వేగం, సమన్వయంతో సత్తాచాటాల్సి ఉంటుంది. వీటన్నింటిలో పాతమంచిర్యాలకు చెందిన తూముల వెంకట్రామయ్యది అందెవేసిన చేయి. ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించడమే కాకుండా పందేల్లో గెలుపు ఇచ్చే ఆనందం కోసం పోటీలు జరిగిన ప్రతీ చోటకు వెళ్లి వచ్చాడు. వెంకట్రామయ్య స్థానిక సిమెంటు కంపెనీలో పని చేస్తూ ఉద్యోగ విరమణ పొందాడు. ఓ వైపు పని చేస్తూ వ్యవసాయం చేసేవాడు. 2013లో ఓసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ముంజంపల్లిలో బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు మొదటిసారి ఎడ్లబండ్ల పోటీలు చూశాడు.
ఎడ్లకు ఎలాంటి శిక్షణ లేకుండా పోటీల్లో పాల్గొని ఓటమి చవిచూశాడు. ఆ తర్వాత ఎడ్లను ప్రత్యేకంగా పోషిస్తూ తర్ఫీదు ఇచ్చి పోటీల్లో సత్తా చాటాడు. జగిత్యాల జిల్లా లొత్తునూర్, రాపల్లి, సిల్వకోడూరు, గోవిందుపల్లి, చర్లపల్లి, నందిమేడారం ఇలా ఏ గ్రామంలో పోటీలు జరిగినా పాల్గొన్నాడు. 2015 నుంచి విజయపరంపరం కొనసాగింది. నాలుగేళ్లలో 36సార్లు గెలుపొందగా.. ద్వితీయ, తృతీయ స్థానాల్లో లెక్కలేనన్ని సార్లు విజయబావుటా ఎగురవేశాడు. పాత మంచిర్యాలలో ఎనిమిదేళ్లపాటు ఎండ్లబండ్ల పోటీలు నిర్వహించి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు.
చిన్నప్పటి నుంచి ఎద్దులంటే ఇష్టం..
ఎడ్ల శృతి కలవాలే. మన శృతి రెండూ ఉండాలే. మన చేతుల్లో మెదిలితేనే సులువుగా గెలువొచ్చు. ఎంతమంచి ఎడ్లనిచ్చినా ఇవన్నీ లేకుంటే గెలవడం కష్టం. ఓసారి చిన్నకోడూర్‌లో ఆ ఊరి పెద్ద మనిషి నీ ఎడ్లు ఇస్తే గెలుస్తా అన్నాడు. సరిగ్గా గీతకాడికి పోయినంక గెలువలేమని గ్రహించి వెనువెంటనే ఎడ్లబండి సవారీ నాకు ఇవ్వడంతో గెలిచా. వ్యవసాయం అంటే మక్కువ కావడంతో చిన్నప్పటి నుంచి ఎద్దులను ఇష్టంగా పెంచడం అలవాటైంది. అప్పట్లోనే నెలకు క్వింటాలు ఉల్వలు దాణాగా పెట్టేవాళ్లం. ఎద్దుల శిక్షణతోపాటు పది మందికి పోటీల్లో గెలుపొందడం ఎలా అనేదానిపై తర్ఫీదు ఇచ్చాను. వయస్సు పైబడడంతో పోటీలకు దూరంగా ఉంటున్న.
– తూముల వెంకట్రామయ్య, జిల్లా ఎడ్లబండ్ల పోటీల అసోసియేషన్ అధ్యక్షుడు


