
Image credit: Amy Jones
పులి మనతో మాట్లాడగలదా?
తన బాధను మనతో చెప్పుకోగలదా?
ఈ ఫొటో చెప్పగలదు..
ఆ పులి కథనే కాదు..
అందులోని అంతులేని వ్యథనూ
మనకు కళ్లకు కట్టినట్లు చూపించగలదు
ఓ గదిలో బంధించి కొడితే..
పిల్లి అయినా పులిలా మారుతుందట..
కానీ అదే గదిలో ఓ పులి
పిల్లిలా మారిన కథ ఇది...
ఆ పులి పేరు... సలమాస్..
సలమాస్.. ఓ ఇండో చైనీస్ ఆడ పులి.. థాయ్‌లాండ్‌లోని ఓ ప్రైవేటు బ్రీడింగ్ ఫార్మ్ దాని నివాసం. జీవిత ఖైదు వేసినా.. 14 ఏళ్ల తర్వాత విడుదలయ్యే చాన్స్ ఉంది.. సలమాస్ విషయంలో అది 20 ఏళ్లు.. చిన్నపాటి కాంక్రీట్ గదిలోనే అన్నేళ్లూ గడిపేసింది. తొలి సంధ్యను చూసింది లేదు.. తొలకరిలో తడిచింది లేదు.. జీవితాంతం పిల్లల్ని కనే యంత్రంగా పనిచేసింది. థాయ్‌లాండ్‌లోని టైగర్ టూరిజం, పులుల పళ్లు, గోర్లు, చర్మం, ఎముకలు, పంజా, మాంసం వంటి అక్రమ విక్రయాల వ్యాపారాల కోసం వరుసగా పిల్లల్ని కంటూనే ఉంది.
ఈ క్రమంలో తన ఆరోగ్యం క్షీణించింది. చిక్కిశల్యమైంది. ఎముకల గూడులా మారింది. కానీ నిర్వాహకుల మనసు కరగలేదు. మరణమే మేలు అనుకునేలా తన బతుకును మార్చారు. దానికి నిదర్శనమే ఈ చిత్రం. అయితే, అదృష్టవశాత్తూ 2023 డిసెంబర్‌లో వైల్డ్ లైఫ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆఫ్ థాయ్‌లాండ్ సలమాస్‌తో పాటు ఆ ఫాంలో ఉన్న మరికొన్ని పులులను రక్షించింది. వాటిని తమ అభయారణ్యానికి తరలించింది.

ఇక్కడే సలమాస్ తన
జీవితపు మలి సంధ్యలో తొలి సంధ్యను చూసింది.
తొలకరిలో తడిచింది.
తొమ్మిది నెలల అనంతరం అక్కడే
తుది శ్వాస విడిచింది.
సలమా అంటే అరబిక్‌లో శాంతి అని అర్థం అట.
రెస్ట్ ఇన్ పీస్ అంటే మరణానంతరం
శాంతి లభించుగాక అని అర్థం అట..
జీవితాంతం అశాంతితో బతికిన
సలమాస్.. రెస్ట్ ఇన్ పీస్!
బ్రీడింగ్ ఫార్మ్‌లో సలమాస్ దయనీయ స్థితిని తన ఫొటోతో చిత్రిక పట్టిన ఆమీ జోన్స్‌కు ఇటీవలి ఎన్విరాన్‌మెంటల్ ఫొటోగ్రఫీ పోటీల్లో హ్యూమానిటీ వెర్సస్ నేచర్ విభాగంలో తొలి బహుమతి దక్కింది.
– సాక్షి, సెంట్రల్ డెస్క్