
క్రీడల్లో రాణించాలని సాధన చేస్తున్నాం కదా.. గుడ్లు, పాలు తినాలి.. లేకపోతే బలం ఎలా వస్తుంది? జిమ్‌కి వెళ్తున్నాం.. మటన్, చికెన్ తినాల్సిందే.. లేకపోతే వర్కవుట్ ఏం చేస్తాం? మజిల్ ఎలా బిల్డ్ చేస్తాం? అని భావిస్తాం. అయితే ఇవన్నీ అపోహలేనని కొట్టిపారేస్తున్నారు సినీహీరో అరవింద్ కృష్ణ. అంతేకాదు గట్టిగా వాదిస్తున్నారు కూడా.. ఆ గట్టితనమే ఆయనకు వీగన్ వాయిస్ ఆఫ్ ది ఇయర్ అవార్డును తెచ్చిపెట్టింది. అయితే ఒక సినిమా నటుడిగా మరోవైపు బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా తనను నిలబెట్టిన వీగన్ అంతకు మించిన లాభాలే తనకు అందించిందంటున్న అరవింద్ కృష్ణ ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే..
‘టీనేజ్ చదువు మొత్తం అమెరికాలోనే సాగింది. అదే సమయంలో నేను బాస్కెట్ బాల్ కూడా ఆడేవాడిని. అప్పుడు నేను కూడా చాలా మందిలాగే స్పోర్ట్స్‌లో రాణించాలంటే మటన్, చికెన్, ఎగ్స్ తప్పక తినాలని భావించే నాన్ వెజిటేరియన్‌నే’.
స్లాటర్ హౌస్ తెచ్చిన ఛేంజ్..
నాకు 17ఏళ్ల వయసులో అనుకోకుండా స్లాటర్ హౌస్‌కి వెళ్లాల్సి వచ్చింది. అక్కడి పరిస్థితులు చూశాక, మూగజీవుల విలాపం.. నాలో అనూహ్య మార్పుకు దారితీసింది. నన్ను పూర్తి వెజిటేరియన్‌గా మార్చేసింది. విచిత్రం ఏమిటంటే.. నాన్ వెజ్ తిన్నప్పటి కంటే ఆ తర్వాతే నేను ఆటగాడిగా రాణిస్తున్నాననేది నాకు అర్థమైంది. అప్పటి నుంచి శాఖాహారం వైపు ఆకర్షితుడినయ్యాను.
వీగన్.. విన్ విన్..
వీగన్ శైలి ఆహారం పరిచయం తర్వాత నా జీవితమే మారిపోయింది. 33 ఏళ్ల వయసులో వీగన్‌గా మారాను. పాలు సహా జంతు సంబంధ ఉత్పత్తులన్నీ మానేశాక.. నా ఆరోగ్యం మెరుగుపడింది. గ్లూటెన్‌కు శరీరంలో చోటు ఇవ్వకపోవడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. తద్వారా శారీరక సామర్థ్యం పెరిగింది. చర్మం మరింత కాంతివంతగా మారింది.
ఆలోచనల్లో వేగం, పదను పెరిగింది. ఇది క్రీడా జీవితానికి బాగా ఉపకరించింది. దీంతో వీగన్యురీ అంబాసిడర్ బాధ్యతలు ఆనందంగా స్వీకరించాను. గతేడాది భారత్‌లోనే అతిపెద్ద వీగన్ థీమ్ సదస్సు జరిగిన వీగన్ ఇండియా కాన్ఫరెన్స్‌లో వీగన్ వాయిస్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందుకున్నా.
డబుల్ రోల్‌లో సక్సెస్‌ఫుల్‌గా..
నటుడిగా రామారావు ఆన్ డ్యూటీ, ఏ మాస్టర్‌పీస్, రైజ్ ఆఫ్ సూపర్‌హీరో వంటి సినిమాలతో పాటు త్వరలో రానున్న అండర్ వరల్డ్ బిలియనీర్ వంటి వెబ్‌సిరీస్‌లతోనూ తగినంత గుర్తింపుతో సంతృప్తిగా ఉన్నాను. దేశంలోనే ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా ఉన్న ఏకైక నటుడిని కూడా. ఇప్పటికీ బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొంటా. నా ఫిజిక్ చూసి వీగన్ ఫుడ్‌తో ఎలా సాధ్యం అని అడుగుతుంటారు. అయితే ఆ ఫుడ్ కాబట్టే ఇలాంటి ఒరిజినల్ ఫిట్‌నెస్ సాధ్యమైందని చెబుతుంటా.
‘అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ సమాఖ్య (ఎఫ్‌ఐబీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఐపీఎల్ తరహాలో బాస్కెట్‌బాల్ పోటీ 3 బీఎల్‌లో పాల్గొన్నా. ప్రతిష్టాత్మక ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఏకైక భారతీయుడిని కావడం విశేషం. హైదరాబాద్ 3 బీఎల్ జట్టుకు నాయకత్వం వహించాను. ఇందులో ఇతర దేశాల ఆటగాళ్లు ఉన్నారు. జీవితంలో విజయానికి క్రమశిక్షణ కీలకం. అవి క్రీడలే నాకు నేర్పించాయి. నా క్రీడా నేపథ్యం నా వ్యక్తిత్వాన్ని రూపుదిద్దింది’ అని అరవింద్ చెప్పుకొచ్చారు.
(చదవండి: వైష్ణోదేవి దర్శనం..హిమాలయాల వీక్షణం..!)