బోధనా పద్ధతి
గురువు తాను ఏ విద్యనైనా శిష్యులకు నేర్పే ముందు, శిష్యుడు ఆ విద్యను గ్రహించటానికి మానసికంగా సంసిద్ధంగా ఉన్నాడా లేదా అన్నది గమనించటం అవసరం అని ప్రస్నోపనిషత్తు చెబుతుంది. విద్యార్థి మానసిక స్థితిని పరీక్షించిన తర్వాత పాఠాలు బోధించటం విజయవంతమైన విద్యకు కారణమవుతుంది.
ఇది నాడే కాదు నేటి విద్యా విధానానికి అయినా అవసరమే! కేవలం పాఠాలు చెప్పటం మాత్రమే ఉపాధ్యాయుని కర్తవ్యం కాదు విద్యార్థికి చదువు, సంస్కారం, వ్యక్తిత్వం అన్నీ నేర్పిస్తూ అతనిని పరిపూర్ణ వ్యక్తిగా తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయునిదే. పూర్వం గురువులు అలాగే బోధించేవారు. ప్రస్నోపనిషత్తులో పిప్పలాద మహర్షి, శిష్యులు తన దగ్గరికి విద్యార్జన కోసం రాగానే ఆయన ఏదీ బోధించలేదు.
వారి అర్హతను పరీక్షంచటానికి, వారిలో విద్యార్జనకు తగిన మానసిక స్థితి ఏర్పడటానికి ఒక సంవత్సరకాలం తపోమయ జీవితం గడపమని చెప్పాడు. ఆ తర్వాత వచ్చి ప్రశ్నలు అడగమని, తనకు తెలిసినవి చెపుతానని చెప్పాడు. ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన పిప్పలాద మహర్షి తనకు తెలిసినట్లయితే చెపుతాను అనటం మహర్షి వినయగుణాన్ని చెబుతుంది. ఇది ఒక గురువు అహంకార రహితంగా ఎలా ఉండాలో తెలుపుతుంది.గురువు ఆదేశానుసారం శిష్యులు ఒక సంవత్సరం తపోమయ జీవితం గడిపి తర్వాత అనేక ప్రశ్నలడిగి జ్ఞానార్జన చేశారు.
– డా. చెంగల్వ రామలక్ష్మి
ఇదీ చదవండి: శ్రీవారి దర్శనానికి ఈ మెట్ల మార్గమే ఎందుకు ప్రత్యేకం?


