breaking news
Pippalada Maharshi
-
శాంతం.. అభయం... అమరం అంతా ఓంకారమే!
పిప్పలాద మహర్షి దగ్గరకు బ్రహ్మజ్ఞాన జిజ్ఞాసతో వెళ్లిన ఆరుగురు ఋషులలో అయిదోవాడు శిబిదేశానికి చెందిన సత్యకాముడు. అప్పటిదాకా గురువుగారు చెప్పిన సమాధానాలు, తీర్చిన సందేహాలు అన్నీ శ్రద్ధగా విన్నాడు. గార్గ్యుడు అడిగిన జాగ్రత్, స్వప్న, సుషుప్తి (మెలకువ, కలలు, గాఢనిద్ర) దశలకు పిప్పలాదుడు చెప్పిన వివరణ ప్రకారం గాఢనిద్రలో అన్నీ ఆత్మలో లీనమై పోతాయి. అయితే అలా జరిగినట్టు ఆ ప్రాణికి తెలియదు. ప్రాణుల్లో శ్రేష్ఠుడైన మానవుడు ధ్యానసాధనతో మెలకువలోనే ఆత్మలో లీనమయ్యే స్థితికి చేరుకోవచ్చునేమో అనిపించిన సత్యకాముడు మహర్షిని ఇలా ప్రశ్నించాడు. ‘‘గురుదేవా! మనుష్యుడు బతికి ఉన్నంతవరకు ఓంకారాన్ని నిష్ఠతో ధ్యానిస్తే ఏ లోకానికి వెళతాడు?’’ ఆ ప్రశ్నకు పిప్పలాదుడు ఇలా సమాధానం చెప్పాడు. ‘‘సత్యకామా! ఓంకారం పరమూ, అపరమూ అయిన బ్రహ్మస్వరూపం. ఈ రెండిటిలో మొదటిది పైస్థాయికి చెందుతుంది. రెండవది సాధారణమైంది. విజ్ఞుడైన సాధకుడు పై రెండు మార్గాలలో దేనిని స్వీకరిస్తే, ఆ స్థితిని పొందుతాడు. ఓంకారాన్ని ఏకమాత్ర (లఘువు)గా ఏకాగ్రతతో ధ్యానించేవానికి జ్ఞానోదయం అవుతుంది. అయితే వెంటనే మనుష్యలోకానికి తిరిగి వచ్చేస్తాడు. ఋగ్వేద అధిదేవతలు అతణ్ణి భూలోకానికి తీసుకు వస్తారు. జ్ఞానోదయమై తిరిగి వచ్చిన ఆ మానవుడు తపస్సు, బ్రహ్మచర్యం, శ్రద్ధ మొదలైన సద్గుణాల సంపదతో మహిమాన్వితుడు అవుతాడు. ఓంకారాన్ని రెండు మాత్రలుగా (దీర్ఘం)దీక్షతో ధ్యానం చేసినవాడు మనస్సుతో లీనమవుతాడు. యుజుర్వేద మంత్ర దేవతలు ఆ సాధకుణ్ణి చంద్రలోకానికి తీసుకుపోతారు. అతడు ఆ లోకంలో సుఖసంపదలను అనుభవించి తిరిగి భూలోకానికి వస్తాడు. ఓంకారాన్ని మూడుమాత్రలుగా (సుదీర్ఘంగా) దీక్షగా పరమపురుష ధ్యానం చేసినవాడు సూర్యలోకానికి చేరుకుంటాడు. పాము కుబుసం రూపంలో పాతచర్మాన్ని విడిచిపెట్టినట్టు పాపాల నుంచి బయటపడతాడు. సామవేదాధిదేవతలు అతణ్ణిబ్రహ్మలోకానికి తీసుకుపోతారు. బ్రహ్మలోకానికి వెళ్లిన జీవుడు పరాత్పరుడు, అన్ని ప్రాణుల్లో ఉండేవాడు, సర్వశ్రేష్ఠుడు అయిన పరమ పురుషుణ్ణి దర్శిస్తాడు. నాయనా! నేను చెప్పినట్టు ఓంకారాన్ని మూడు దశల్లో ఒకటి, రెండు, మూడు మాత్రల్లో ధ్యానించేవాడు. ఆయా ఫలితాలను పొందినా అవి తాత్కాలికమే. మళ్లీ భూమికి రాక తప్పదు. ఒకదశ నుండి మరొక దశకు అవిచ్ఛిన్నమైన అనుసంధానంలో ధ్యానం చేస్తూ, బాహ్య, అభ్యంతర, మధ్యమ స్థితులను సమానంగా నిర్వహించేవిధంగా ఓంకారాన్ని ధ్యానం చేసే విద్వాంసుడు దేనికీ చలించడు. పతనం కాడు. సత్యకామా! ఋగ్వేద పద్ధతిలో ఓంకారధ్యానం చేసినవాడు ఇహలోకాన్ని, యజుర్వేద పద్ధతిలో చేసినవాడు అంతరిక్షలోకాలనూ, సామవేదపద్ధతిలో చేసినవాడు విజ్ఞులు చేరుకునే బ్రహ్మలోకానికి చేరుకుంటాడు. ఈ సత్యాన్ని అన్వేషించే మహాత్ములు ఓంకారంతోనే శాంతమూ, అజరమూ, అమరమూ, అభయమూ, పరమపదమూ అయిన యోగస్థితిని పొందుతున్నారు’’. అలా పిప్పలాద మహర్షి చెప్పిన ఓంకార ధ్యానక్రమం మానవజాతికి సాధన మార్గంలో పరబ్రహ్మలో లీనమై అవిచ్ఛిన్నమైన యోగస్థితిని పొంది ఇహలోకంలో జీవించే జీవన్ముక్తిని, ప్రశాంతతను ప్రసాదిస్తుందని సత్యకాముడు, మిగిలినవారు అర్థం చేసుకున్నారు. పరిమిత ధ్యానం, మెలకువ, కల, గాఢనిద్ర, చావుపుట్టుకల వలె వస్తూపోతూ ఉండే ఫలితాన్ని ఇస్తుంది. అపరిమిత ధ్యానం ఎడతెగని జ్ఞానాన్ని ఇస్తుందని తెలుసుకున్నారు. చివరిగా సుకేశుడు అడిగిన ఆరోప్రశ్న ‘‘పదహారు కళలతో ఉన్న పురుషుడు ఎవడు?’’ దీనికి సమాధానం వచ్చేవారం చూద్దాం. - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
ఆత్మజ్ఞానాన్ని పొందితే...అన్నీ తానే!
ప్రశ్నోపనిషత్ పిప్పలాద మహర్షి దగ్గరకు బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి వెళ్లిన ఆరుగురు రుషులు ప్రాథమిక దశ నుండి క్రమంగా ఒక్కొక్క ప్రశ్న అడిగి సమాధానాలు పొందుతున్నారు. ప్రాణం రాకడ, నిలకడ, పోకడలను గురించి ఆశ్వలాయనుడు అడిగిన మూడోప్రశ్నకు సమాధానంగా మహర్షి ‘ఆత్మనుంచి ప్రాణం పుడుతుంది’ అని వివరించాడు. తరువాత సూర్యవంశానికి చెందిన గార్గ్యుడు అనే రుషి నాలుగోప్రశ్న ఇలా అడుగుతున్నాడు. ‘‘భగవాన్! ఆత్మలోనుండి ప్రాణశక్తితో దేహాన్ని ధరించిన జీవునిలో జాగ్రత్, స్వప్న, సుషుప్తి (మెలకువ, కలలు, గాఢనిద్ర) అవస్థలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. జీవునిలో నిద్రించేవి ఏవి? కలలు కనేవి ఏవి? మేలుకొని ఉండేవి ఏవి? వచ్చిన కలలను అనుభవించేది, చూసేది ఏ దైవ శక్తి? ఆ సుఖం అంతా ఎవరికి చెందుతోంది? ఇవి అన్నీ ఎవనియందు ప్రతిష్ఠితమై ఉంటున్నాయి?’’ అని ప్రశ్నించాడు. పిప్పలాద మహర్షి అడిగిన ప్రశ్నలన్నీ శ్రద్ధగా విన్నాడు. జ్ఞానసముపార్జనకు వచ్చిన ఆరుగురు ఒకేవిధమైన పరిశోధనాదృష్టితో వినటం, తెలుసుకోవటం ఆయనకు నచ్చింది. నాలుగోప్రశ్నకు ఇలా సమాధానం చెబుతున్నాడు. ‘‘గార్గ్యా! సూర్యుడు అస్తమించేటప్పుడు అతని కిరణాలు అన్నీ తేజోమండలంలో ఐక్యమైపోతాయి. ఉదయించేటప్పుడు అన్నీ బయటకి వ్యాపిస్తాయి. అలాగే ఒక ప్రాణి నిద్రపోతున్నప్పుడు ఇంద్రియాలు అన్నీ మనసులో ఐక్యమవుతాయి. అప్పుడు ఆ మనిషి వినలేడు, చూడలేడు. వాసన చూడలేడు. రుచి చూడలేడు. స్పర్శజ్ఞానం ఉండదు. మాట్లాడలేడు. దేనినీ స్వీకరించలేడు. ఆనందించలేడు. వదలలేడు. పట్టుకోలేడు. కదలలేడు. ఈ స్థితిని నిద్రించటం అంటారు. నాయనా! దేహి నిద్రపోతున్నప్పుడు ప్రాణశక్తి అగ్నిహోత్రంలా వెలుగుతూనే ఉంటుంది. అపాన వాయువు గార్హపత్యాగ్ని (గృహంలో ఎప్పుడూ వెలిగేది). వ్యానవాయువు అన్వాహార్యపచనాగ్ని (వంటకు ఉపయోగించేది), గార్హపత్యాగ్ని నుంచి తయారయ్యేదే ఆహవనీయాగ్ని (యజ్ఞానికి ఉపయోగించేది), ఈ మూడింటిని త్రేతాగ్నులు అంటారు. ప్రాణి నిరంతరమూ ఉచ్ఛ్వాస, నిశ్వాసలనే ఆహుతులను సమానంగా సమర్పించటం వల్ల వెలిగే ఆ హవనీయాగ్నియే సమాన వాయువు. ఈ యజ్ఞాన్ని చేసే యజమానుడే మనస్సు. ఈ యజ్ఞం ద్వారా ప్రాణి కోరే ఇష్టఫల మే ఉదాయనవాయువు. ఈ వాయువే దేహిని ఎల్లప్పుడూ పరబ్రహ్మం దగ్గరకు చేరుస్తూ ఉంటుంది. నిద్రలో తరువాత దశ స్వప్నావస్థ. ఈ దశలోని అనుభూతులన్నీ జీవుడు తానే పొందుతాడు. మెలకువతో ఉన్నప్పుడు తాను భౌతికమైన ఇంద్రియాలతో చూసినవే చూస్తాడు. విన్నవే వింటాడు. వివిధప్రదేశాలలో వివిధ దిశలలో భౌతికంగా తాను అనుభవించినవాటినే స్వప్నంలో అనుభవిస్తాడు. మెలకువతో చూసినవి, చూడనివి, విన్నవి, విననివీ, అనుభవించినవీ, అనుభవించనివీ, సత్యాసత్యాలన్నిటినీ కలలో జీవుడు దేహంతో సంబంధం లేకుండా తానే అనుభవిస్తాడు. జీవుడు స్వప్నావస్థ దాటి దివ్యమైన తేజస్సులో కలిసిపోతాడు. అప్పుడు కలలు రావు. ఆ స్థితిలో ఆత్మానందం కలుగుతుంది. ఆకాశంలో ఎగిరే పక్షులన్నీ చివరికి తాముండే చెట్టుపైకి చేరుకున్నట్టు అన్నీ ఆత్మలో ఐక్యమైపోతాయి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు, వాటి తత్వాలు, కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం అనే జ్ఞానేంద్రియాలు వాటి తత్త్వాలు, నోరు, చేతులు, కాళ్లు, మలమూత్రావయవాలు అనే కర్మేంద్రియాలు, వాటి తత్త్వాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం, తేజస్సు, వాటివిధులు, ప్రాణశక్తితో ముడిపడి ఉన్నవన్నీ ఆత్మలో లీనమైపోతాయి. నాయనా! చూసేది, స్పృశించేది, వినేది, వాసన చూసేది, రుచి చూసేది, తలచుకునేది, తెలుసుకునేది, చేసేది, విజ్ఞానవంతమై ఉండేది అంతా ఆత్మయే. చావుపుట్టుకలు లేని పరమాత్మలో ఈ ఆత్మ కలిసిపోతోంది. అదే సుషుప్తి. రంగు, రుచి, వాసన, రూపం, నీడ లేనిది స్వచ్ఛమూ, శాశ్వతమూ అయిన ఆత్మానుభూతిని, ఆత్మజ్ఞానాన్ని ఎవడు పొందుతాడో వాడే సర్వజ్ఞుడు అవుతాడు. సర్వమూ తానే అవుతాడు. విజ్ఞానాత్మా సహదేవైశ్చ సర్వైః ప్రాణా భూతాని సంప్రతిష్ఠంతి యత్ర తదక్షరం వే దయతే యస్తు సోమ్య స సర్వజ్ఞ సర్వమేవా వివేశేతి జ్ఞాన, కర్మేంద్రియాలు, మనోబుద్ధి అహంకారాలు, చిత్తం, తేజస్సు, ప్రాణం అన్నింటికీ కేంద్రమై, శాశ్వతమైన విశ్వాత్మను పరమాత్మను తెలుసుకున్నవాడు అన్నీ తానే అవుతాడు. అంతటా తానే అవుతాడు’’. ఇలా నిద్ర గురించి అడిగిన ప్రశ్నకు ఆత్మజ్ఞానాన్ని పొందే క్రమాన్ని నిద్రతో అన్వయించి వివరించాడు పిప్పలాద మహర్షి. తరువాత సత్యకాముడు అడిగిన ప్రణవోపాసన ప్రశ్నకు సమాధానాన్ని వచ్చేవారం చూద్దాం. - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్