
రన్నింగ్ రేస్‌లో తాబేలుతో పోటీ పడి అతి ఆత్మవిశ్వాసంతో ఓడిపోయిన కుందేలు కథ గురించి మనకు తెలిసిందే. మరి ఆ తరువాత ఏం జరిగింది?’ కుందేలులో ఆత్మవిశ్వాసం లేకుండా పోయిందా? తాబేలులో వోవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసిందా?
‘అసలు ఆ తరువాత ఏం జరిగింది?’ అనే పాయింట్‌పై వచ్చిన నాటకం....సూపర్ టార్టైస్, సూపర్ రాబిట్. హాంగ్ సెంగ్‌హీ దర్శకత్వం వహించిన ఈ కొరియన్ నాటకాన్ని ఇటీవల బెంగళూరులో ప్రదర్శించారు. ‘ఒకసారి వచ్చిన ఫలితంతో వ్యక్తులను నిర్ణయించలేము అని చెప్పడానికి, పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఈ నాటకం ఉపయోగపడుతుంది’ అంటున్నాడు హాంగ్. కొరియన్ డ్రామా కంపెనీ ఈ నాటకాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శిస్తోంది.
‘భారతీయ ప్రేక్షకుల ముందు నటించాలనే నా కల నెరవేరింది’ అంటున్నాడు కిమ్ మిన్–కి అనే ఆర్టిస్ట్. హాస్యాన్ని, సందేశాన్ని మిళితం చేస్తూ సాగే ఈ నాటకంలో సంగీతం, రిథమ్స్ ప్రత్యేక ఆకర్షణ.నాటకంలో అత్యంత ఆకట్టుకునే ఘట్టం? డైరెక్టర్ హాంగ్ ఇలా అంటున్నాడు...‘చివరి ఘట్టం. నేనేమిటి? నేను నిజంగా కోరుకునేది ఏమిటి? అని నాటకంలో ప్రతి క్యారెక్టర్ తనను తాను తెలుసుకుంటుంది’.
(చదవండి: ఎవరీ మీరా మురాటీ..? టెస్లా టు థింకింగ్ మెషిన్ ల్యాబ్..)