
మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన మీరా మురాటీ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ‘టెస్లా’లో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేసింది. ఆ తరువాత వర్చువల్ రియాలిటీ స్టార్టప్ ‘లిప్ మోషన్’లో పనిచేసింది. 2016లో ‘ఓపెన్ ఏఐ’లో చేరిన మీరా రకరకాల ప్రాజెక్ట్‌లలో ముఖ్యపాత్ర పోషించింది. అడ్వాన్స్‌డ్ ఏఐ మోడల్స్, టూల్స్ డెవలప్‌మెంట్‌లో కీలకంగా వ్యవహరించింది. చీఫ్ టెక్నికల్ ఆఫీసర్(సీటీవో) స్థాయికి చేరింది.
సొంతంగా కంపెనీ స్థాపించాలనేది మీరా మురాటీ చిరకాల స్వప్నం‘డూ మై వోన్ ఎక్స్‌ప్లోరేషన్’ అంటూ గత సంవత్సరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఓపెన్‌ఏఐ’కి గుడ్‌బై చెప్పింది.
ఫిబ్రవరి 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) స్టార్టప్ ‘థింకింగ్ మెషిన్ ల్యాబ్’ మొదలుపెట్టింది. ‘టెస్లా’ను విడిచి ‘ఓపెన్‌ఏఐ’లో చేరడానికి గల కారణం గురించి ఇలా చెప్పింది...‘నాకు మొదటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయాలపై ఆసక్తి. ఆ ఆసక్తితోనే ఓపెన్ ఏఐలో చేరాను’. ‘ఓపెన్‌ఏఐ’ని విజయవంతం చేయడంలో మీరా కృషి ఎంతో ఉంది.
అల్బేనియాలో పుట్టిన మీరా మురాటీకి చిన్నప్పటి నుంచి సాంకేతిక విషయాలపై అమితమైన ఆసక్తి. ‘జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు సాంకేతిక జ్ఞానం పరిష్కారం చూపుతుంది’ అంటుంది మీరా. టెక్నాలజీలో హాటెస్ట్ కంపెనీలుగా పేరున్న ‘టెస్లా’ ‘ఓపెన్‌ఏఐ’లను వదులుకొని సొంత స్టార్టప్ మొదలుపెట్టిన మీరా మురాటీ విజయం సాధించగలదా?‘కచ్చితంగా’ అని చెప్పడానికి ఎన్నో సంస్థలలో ఆమె అద్భుతమైన, ప్రతిభావంతమైన పనితీరు బలమైన సాక్ష్యం.
(చదవండి: మనకు మనమే స్పెషల్...)