వరల్డ్ టేబుల్ టెన్నిస్ సింగిల్ టైటిల్స్‌ను గెలుచుకున్న మొదటి భారతీయురాలు ఆకుల శ్రీజ. ఆమె అర్జున అవార్డు సహా ఎన్నో పతకాలు గెలుచుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తోంది. ‘పిల్లలకు చదువు ఒక్కటే కాదు, క్రీడారంగాన్నీ పరిచయం చేసినట్లయితే అన్ని వైపులా అభివృద్ధి చెందుతారు’ అంటారు శ్రీజ తల్లిదండ్రులు ఆకుల ప్రవీణ్‌కుమార్, సాయిసుధ. పిల్లల పెంపకంలో తమ పాత్ర గురించి ప్రవీణ్‌కుమార్ తెలిపిన సంగతులు...
‘‘నేను టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌ని. రోజూ ప్రాక్టీస్‌కి వెళ్లేవాడిని. పిల్లల చిన్నప్పుడు వారిని రెండు, మూడు స్పోర్ట్స్ మీట్స్‌కు తీసుకెళ్లాను. అక్కడ మ్యాచ్‌లో గెలుపొందినవారికి ప్రైజులు ఇవ్వడం, అందరూ చప్పట్లు కొట్టడం చూసి, మా పెద్దమ్మాయి చాలా ఇంప్రెస్ అయ్యింది. ‘డాడీ నాకు కూడా ట్రైనింగ్ ఇప్పిస్తారా’ అని అడిగింది. అంతేకాదు, స్కూల్ నుంచి వస్తూనే స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని గ్రౌండ్‌కు వెళదామని రెడీ అయిపోయేది. ‘నేను కూడా చాంపియన్‌ని అవుతాను’ అనేది. రోజూ నాతో పాటు ప్రాక్టీస్‌కు రావడం చూసి, అకాడమీకి తీసుకెళ్లాను. అక్కడ తను బాగా ఆడటం చూసినవాళ్లు మెచ్చుకోవడంతో మరింతగా ప్రాక్టీస్ చేసేది.
అక్కను చూసి చెల్లెలు..
రవళి మెడల్స్ తీసుకోవడం చూసి, చిన్నమ్మాయి శ్రీజ ‘నేను కూడా టేబుల్ టెన్నిస్ ఆడతాను’ అంది. శ్రీజను కూడా టేబుల్ టెన్నిస్‌లో చేర్పించాను. ఇద్దరూ స్పోర్ట్స్‌లో మంచి ప్రతిభ చూపించేవారు. దీంతో ప్రతి కాంపిటిషన్‌లో వాళ్లు పాల్గొనేలా చూసేవాడిని. గేమ్ పూర్తయ్యేంతవరకు ఉండి, తీసుకొచ్చేవాడిని.
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి ప్రైవేట్‌గా..!
పిల్లల చిన్నప్పుడు నాకు ఓరియంటల్ ఇన్సూరెన్స్‌లో అసిస్టెంట్ ఉద్యోగం. నా భార్య ఎల్‌ఐసీలో జాబ్. ప్రభుత్వ ఉద్యోగాలే అయినా జీతాలు తక్కువ, ఖర్చులు ఎక్కువ ఉండేవి. దీంతో, ఆ జాబ్ మానేసి, జనరల్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా చేరాను. అప్పుడు ‘మా అమ్మనాన్నలు, బంధువులు గవర్నమెంట్ జాబ్ వదులుకోవద్దు’ అని చెప్పారు. కానీ, వాళ్ల మాటలను పట్టించుకోలేదు. నా భార్య సపోర్ట్ చేసింది. నెల జీతం పెరగడం వల్ల ఇద్దరమ్మాయిలను అకాడమీలో చేర్పించడం, వారు కాంపిటిషన్స్‌లో పాల్గొనేలా చూడటం సులువైంది.
రాత్రికి రాత్రి చాంపియన్లు అవరు
మనమేవో త్యాగాలు చేస్తున్నాం కాబట్టి పిల్లలు రాత్రికి రాత్రి చాంపియన్లు కావాలనుకోకూడదు. ‘గెలుపు ఓటములు పట్టించుకోకుండా, మీ కృషి మీరు చేయండి. ప్రతీసారీ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి’ అని పిల్లలకు చెబుతుండేవాళ్లం. పిల్లలు ఓడిపోయినప్పుడు మా బంధువులు ‘అయ్యో, మీరు గవర్నమెంట్ జాబ్ వదలుకున్నారు, కానీ వాళ్లు ఓడిపోయారు’ అన్నట్టుగా మాట్లాడేవారు. ‘పిల్లలను బెస్ట్‌గా ప్రయత్నంచమని చెప్పండి. అంతేకాని, వారు చిన్నబుచ్చుకునేలా మాట్లాడకూడదు’ అని మా పేరెంట్స్‌కి, బంధువులకు గట్టిగా చెప్పాం.
బంగారు పతకాలు
పెద్దమ్మాయి టెన్త్ పూర్తయ్యాక ఒక కాన్సెప్ట్ కాలేజీలో జాయిన్ చేశాం. వాళ్లు ముందుగా స్పోర్ట్స్‌కి సపోర్ట్ చేస్తాం అన్నారు. తర్వాత మూడు నెలలకు ‘మీ అమ్మాయి బాగా చదువుతోంది – గ్రేడ్స్ ముఖ్యం’ అన్నారు. దీంతో రవళి స్పోర్ట్స్ ప్రాక్టీస్ ఆపేసింది. చిన్నమ్మాయి విషయంలో అలా జరగకూడదని తనని బద్రుకా కాలేజీలో చేర్పించాం. ముందుగానే కాలేజీ యాజమాన్యంతో ‘స్పోర్ట్స్‌కు ప్రాముఖ్యం ఇస్తేనే చేర్పిస్తాం’ అని చెప్పాం. కాలేజీ వాళ్లు సపోర్ట్ చేశారు. శ్రీజ ఇంటర్మీడియట్‌లో కాలేజీ టాపర్‌గా గోల్డ్ మెడల్ సాధించింది. దానికి కారణం మా ఆవిడ సాయిసుధ. శ్రీజతో పాటు తనూ టోర్నమెంట్స్‌కు వెళ్లేది. ట్రెయిన్‌లో, రూములో, మ్యాచ్ మధ్యలో వీలు దొరికనప్పుడల్లా చదివించేది.
ఇద్దరి కృషి...
పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రులిద్దరి కృషి ఉండాలి. స్పోర్ట్స్‌లో నేను కేర్ తీసుకుంటే, చదువు విషయంలో సాయిసుధ శ్రద్ధ తీసుకుంది. పిల్లల కెరీర్ గురించి ఆలోచించి మా ఆవిడ జాబ్‌లో ప్రమోషన్లు కూడా తీసుకోలేదు. ప్రమోషన్ తీసుకుంటే ట్రాన్స్‌ఫర్లు అవుతాయని ఆలోచించి అధికారి హోదాను కూడా వద్దనుకుని, వీలైనంత టైమ్ పిల్లలకు కేటాయించేది. పిల్లలిద్దరూ స్పోర్ట్స్‌లో రాణిస్తూ, చదువులోనూ గోల్డ్ మెడల్స్ సాధించారు.
స్పోర్ట్స్.. జాబ్..
పెద్దమ్మాయి ఇంటర్మీడియట్‌లో ఆపేసిన స్పోర్ట్స్ సీబీఐటీలో చేరాక స్టార్ట్ చేసింది. ఇంటర్ కాలేజీ టోర్నమెంట్స్ లీడ్ చేసేది. సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేసింది. ఇప్పుడు అమెరికాలో సెటిలైంది. చిన్నమ్మాయి శ్రీజకి పద్దెనిమిదేళ్లకు ఆర్‌బీఐలో జాబ్ వచ్చింది. ప్రాక్టీస్‌కు, టోర్నమెంట్స్‌లో పాల్గొనడానికి వీలుంటుంది. డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగం చేస్తూనే ఫిజికల్ ఫిట్‌నెస్, ప్రాక్టీస్, టైమ్ ప్లానింగ్ గురించి చాలా క్రమశిక్షణగా ఉంటుంది. తల్లిదండ్రులుగా పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తాం. వారికోసం ఏమైనా చేస్తాం. దానిని పిల్లలు అర్ధం చేసుకొని, వారి భవిష్యత్తును బాగా మలచుకుంటే పెద్దలుగా మనకూ ఆనందం. నేటి తల్లిదండ్రులు పిల్లల చదువు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. దాంతో పిల్లలకు ఒకవైపు మాత్రమే అవకాశాలు ఉంటున్నాయి. స్పోర్ట్స్‌లో అన్నివైపులా వృద్ధి ఉంటుంది.


