హ్యాపీ వెడ్డింగ్‌.. నగరంలో పెళ్లి సందడి మొదలు | Subha Muhurtham Dates in 2024 | Sakshi
Sakshi News home page

హ్యాపీ వెడ్డింగ్‌.. నగరంలో పెళ్లి సందడి మొదలు

Oct 17 2024 7:41 AM | Updated on Oct 17 2024 10:07 AM

Subha Muhurtham Dates in 2024

వచ్చే నెల నుంచి ముహూర్తాలు ప్రారంభం 

రిసార్ట్‌లు, కన్వెన్షన్‌ సెంటర్లు, బాంకెట్‌ హాళ్లకు డిమాండ్‌ 

ప్రీ–వెడ్డింగ్‌ షూట్స్‌తో సందడిగా షూటింగ్‌ స్పాట్లు 

ప్రత్యేకమైన థీమ్‌లు, కాన్సెప్‌్టలతో వేదికల అలంకరణ

గ్రేటర్‌లో పెళ్లి సందడి మొదలైంది. వచ్చే నెల నుంచి వివాహ ముహూర్తాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నగరంలోని కన్వెన్షన్‌ సెంటర్లు, బాంకెట్‌ హాళ్లు, కమ్యూనిటీ సెంటర్లకు డిమాండ్‌ ఏర్పడింది. మరోవైపు వధూవరులు పెళ్లి షాపింగ్‌లతో నగరంలోని జ్యువెలరీ షోరూమ్‌లు, షాపింగ్‌ మాళ్లలో రద్దీ మొదలైంది.. అంగరంగ వైభవంగా వివాహ వేడుకలను తీర్చిదిద్దేందుకు వెడ్డింగ్‌ ప్లానర్లు, అలంకరణ డిజైనర్లు తమ పనుల్లో బిజీగా ఉన్నారు. 

ముహూర్తాలు ఇవే.. 
దీపావళి తర్వాతి నవంబర్‌ 12 నుంచి ఫిబ్రవరి వరకూ వివాహాలకు శుభ ముహూర్తాలని పండితులు చెబుతున్నారు. నవంబర్‌ 12, 13, 17, 22, 23, 25, 26, 28, 29 తేదీల్లో వివాహాలకు శుభ ముహూర్తాలుగా ఉన్నాయి. అలాగే డిసెంబర్‌ 3, 4, 5, 9, 10, 11, 14, 15 తేదీలు కూడా శుభప్రదమే. దీంతో నగరంలో పెళ్లి హడావుడి మొదలైంది.

హాళ్లు.. హౌస్‌ఫుల్‌.. 
ఓ వైపు పెళ్లి సందడి.. మరోవైపు నూతన సంవత్సర వేడుకలు కూడా రానుండటంతో చాలా మంది వివాహ కుటుంబాలు ఒకటి రెండు నెలల ముందే రిసార్ట్స్, హోటళ్లలోని ఫంక్షన్‌ హాళ్లను బుకింగ్‌ చేసుకున్నారు. కన్వెన్షన్‌ సెంటర్లు, కమ్యూనిటీ హాళ్లలో బుకింగ్స్‌ జోరుగా సాగుతున్నాయి. కొంపల్లి, శామీర్‌పేట, తుర్కపల్లి, తిమ్మాపూర్, షాద్‌నగర్, మొయినాబాద్, చేవెళ్ల, ఘట్‌కేసర్‌ వంటి శివారు ప్రాంతాల్లోని కన్వెన్షన్‌ సెంటర్లు, రిసార్ట్‌లతో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నానక్‌రాంగూడ, గచి్చ»ౌలి వంటి ప్రధాన నగరంలోని స్టార్‌ హోటళ్లలోని బాంకెట్, పార్టీ హాల్స్‌ అన్నీ ఇప్పటికే హౌస్‌ఫుల్‌ అయ్యాయి.  

కూరగాయల ధరలు పెరగడంతో.. 
కూరగాయల ధరలు పెరుగుదల కూడా పెళ్లింట భారంగా మారింది. టమోట, బెండకాయ, ఉల్లిగడ్డ, మిర్చిలతో పాటు వంట నూనె, పన్నీర్‌ వంటి ఆహార ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఫుడ్‌ క్యాటరర్స్‌ ప్లేట్‌కు రూ.350 నుంచి రూ.1,500 వరకూ చార్జ్‌ చేస్తున్నారు. ఇక మాంసాహార భోజనమైతే అంతకుమించి అన్నట్లు ఉంది.  

థీమ్స్, కాన్సెప్ట్‌లతో బిజీ.. 
ఉన్నత వర్గాల కుటుంబాలు, ఉద్యోగస్తులైన వధూవరులు ప్రత్యేకమైన థీమ్‌లు, కాన్సెప్‌్టలతో మండపాల అలంకరణ కోరుతున్నారు. ప్రీ–వెడ్డింగ్‌ ఫొటో షూట్‌లకూ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఆయా పెళ్లి వేడుకలు, ఫొటో షూట్‌లు వైభవంగా, సజావుగా జరగడానికి ఈవెంట్, వెడ్డింగ్‌ ప్లానర్లు, ఫొటో గ్రాఫర్లు బిజీ బిజీలో గడుపుతున్నారు. మరోవైపు కళ్యాణ మండపాల నిర్వాహకులు సుమారు 300 నుంచి 700 మంది అతిథులు హాజరయ్యేలా వేడుకలను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం బాంకెట్‌ హాల్, పార్టీ లాన్స్, కన్వెన్షన్‌ సెంటర్ల అద్దె రోజుకు రూ.లక్ష  నుంచి రూ.10 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయి.

ప్రీ వెడ్డింగ్‌ షూట్స్‌ షురూ.. 
వివాహ వేదికలు లగ్జరీగా ఉండాలని వధూవరులు భావిస్తున్నారు. ఖర్చుకు వెనకాడట్లేదు. వారి అభిరుచులకు తగ్గట్టుగా, సంప్రదాయాలను ప్రతిబింబించేలా మండపాలు, వేదికలు ఉండేలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. లావెండర్, వింటేజ్‌ వంటి థీమ్‌లతో ప్రాంగణాలను అద్భుతంగా అలంకరిస్తున్నారు. ఇక ప్రీ–వెడ్డింగ్‌ షూట్స్‌తో ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్లు బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో చారి్మనార్, గోల్కొండ కోట, రామోజీ ఫిల్మ్‌ సిటీ, చౌమోహల్లా ప్యాలెస్, తారమతి బారాదరి, బొటానికల్‌ గార్డెన్, కుతుబ్‌షాయి టూంబ్స్‌ వంటి ప్రాంతాల్లో ప్రీ–వెడ్డింగ్‌ షూట్స్‌తో సందడి నెలకొంది. దీంతో పాటు ఫుడ్‌ క్యాటరర్స్, మెహందీ ఆరి్టస్ట్‌లు, ఫొటోగ్రాఫర్లు, బాజా భజంత్రీలకు ఫుల్‌ డిమాండ్‌ ఏర్పడింది.

శానిటైజేషన్, భద్రతకే అధిక ప్రాధాన్యం..
పెళ్లి సీజన్‌తో పాటు న్యూ ఇయర్‌ కూడా రానుండటంతో రిసార్ట్‌లోని వెడ్డింగ్‌ జోన్స్, హోటళ్లలోని బాంకెట్, పార్టీ లాన్స్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. అతిథులకు వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులూ కాకుండా శానిటైజేషన్, భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ తరహా ఈవెంట్‌ సెంటర్లు ఇప్పటికే చాలా వరకూ బుక్‌ అయ్యాయి. 
– డాక్టర్‌ కిరణ్, సీఈఓ, సుచిరిండియా గ్రూప్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement