Sakshi News home page

అంతర్జాతీయ యోగా దినోత్సవం నేడు: యోగా..  కొత్త కొత్తగా

Published Wed, Jun 21 2023 3:32 AM

This is the story of yoga influencers - Sakshi

యోగా నిపుణులు, సాధకులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్‌ మీడియాలో తమ ఉనికిని కొత్తగా చాటుతున్నారు. వారి నిజాయితీ, స్ఫూర్తిదాయకమైన వారి మాటలు, ఉత్సాహం ఆకర్షణీయంగా మార్చే సుగుణాన్ని కళ్లకు కడుతున్నాయి. యోగా ఆరోగ్యాన్ని, ఫిట్‌నెస్‌ను రెండింటినీ అద్భుతంగా మారుస్తుంది. రోజువారి జీవనంలో యోగా ఒక భాగం అవడానికి ఇన్‌ఫ్లుయెన్సర్లు మరిన్ని హంగులు అద్దుతున్నారు.

శాస్త్రీయ యోగాభ్యాసం ద్వారా వేగవంతమైన ఆధునిక యుగానికి తమను తాము గొప్ప స్ఫూర్తిగా మార్చుకుంటున్నారు. సెలబ్రిటీల నుంచి ఎంతోమంది మహిళలు యోగా పాఠాలు చెబుతూ సోషల్‌ మీడియాలో కనిపిస్తారు. వారి నుంచి ఎంతో ప్రేరణను పొందవచ్చు. ఈ రోజు నుంచే యోగాను దైనందిన జీవనంలో భాగం చేసుకోవచ్చు. 

ప్రపంచస్థాయి ప్రభావం శిల్పా శెట్టి
భారతదేశంలో అత్యంత ప్రభావ వంతమైన ఫిట్‌నెస్‌ ఐకాన్స్, యోగా ఇన్‌ఫ్లుయెన్సర్‌లలో ఒకరుగా నిలిచింది శిల్ప. ఐదుపదులకు చేరువలో ఉన్న శిల్ప యోగా కోసం చాలా కాలం శిక్షణ పొందారు. తీరైన శరీరాకృతిని పొందడానికి, దైనందిన జీవనంలో వ్యాయామాన్ని చేర్చడానికి ఫిట్‌నెస్‌ ఫిల్మ్‌లు రూపొందించింది. యోగాకు సంబంధించిన డీవీడీలను కూడా రిలీజ్‌ చేసింది.

కొన్ని జీవన శైలి మార్పులు మనలో ఎలాంటి పెద్ద మార్పులను తీసుకువస్తాయో చూపించడానికి సోషల్‌మీడియాను ఉపయోగిస్తుంది. ఆమె యూ ట్యూబ్‌ ఛానెల్‌కి 3 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రపంచ స్థాయిలో భారతీయ యోగానుప్రోత్సహించడంలో శిల్ప చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఆమె వ్యాయామం చేసే విధానం, తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారం గృహిణులకు స్ఫూర్తినిస్తుంది. 

యోగా సౌందర్యం దీపికా మెహతా 
రోజును యోగాసనాలతో కొత్తగా ్రపారంభించాలనే ఆలోచనను దీపికా మెహతా కళ్లకు కడుతుంది. ఆమె యూ ట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా యోగా లో కళా దృష్టి ఉంటుందని చూపుతుంది. ‘రెండు దశాబ్దాల క్రితం మరణం అనుభవాన్ని చవిచూశానని, యోగా పునర్జీవితాన్ని ఇచ్చింద’ని చెబుతుంది.

రాక్‌ క్లైంబింగ్‌ ప్రమాదం తర్వాత ఆమె ఇకపై నడవలేదని వైద్యులు అంచనా వేశారు. యోగా ట్రైనర్, అష్టాంగ యోగా స్పెషలిస్ట్‌ అయిన దీపికా యూ ట్యూబ్‌ ఛానెల్‌ కి దాదాపు 4 లక్షల మంది సబ్‌ స్క్రైబర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చూపే యోగా ప్రతిభ ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తాయి. ఎంతోమంది బాలీవుడ్‌ సెలబ్రిటీలకు యోగా గురూగా మారింది.

లోపాలను సరిదిద్దుతూ...  సునయన రేఖీ
యోగా హెల్త్‌ అండ్‌ లైఫ్‌ స్టైల్‌ కోచ్‌గా సునైనా రేఖీ తనను తాను కొత్తగా ఎప్పుడూ పరిచయం చేసుకుంటూనే ఉంటుంది. భారతదేశంలోని అత్యంత పేరొందిన యోగా ట్రైనర్లలలో సునయన ఒకరు. రిషీకేశ్‌లో యోగా సాధన చేసిన సునయన ఇప్పుడు ముంబైలోని అనేక ప్రసిద్ధ యోగా స్టూడియోలలో నిపుణురాలిగా శిక్షణ ఇస్తోంది.

సాధనకు బలమైన పునాదిని ఏర్పరచడానికి, గాయాలను మాన్పడానికి నిపుణులైన పర్యవేక్షణ అవసరమని సునయన వీడియోలు నిరూపిస్తాయి. యోగా సాధనలో చిన్న చిన్న లోపాలు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాయో కూడా వివరిస్తుంది. మనస్సు, శరీరం, ఆత్మపై యోగా వల్ల కలిగే మంచి ప్రయోజనాల గురించి వివరిస్తుంది. 

నిరాశకు దూరం నటాషా 
నృత్యకారిణి, ఫొటోగ్రాఫర్, యోగా సాధకురాలు నటాషా నోయల్‌. యూ ట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ నుంచే కాదు సోల్‌ఫుల్‌ హ్యాపీనెస్‌ బ్లాగ్‌ ద్వారా తన యోగానుభవాలను తెలియజేస్తుంది. మాట్లాడుతుంది. తత్త్వశాస్త్రాన్ని సాధన చేసే నటాషా ‘మీ మానసిక దృఢత్వమే మీ లక్ష్యం. మిగతావన్నీ అప్రధానం’ అని చెబుతుంది.

తన బాల్యంలో జరిగిన విషాదకర సంఘటనల నుంచి తేరుకొని, కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. కండరాల బలాన్ని పునర్నిర్మించే ప్రయత్నంలో ఆమె యోగా సాధకురాలిగా మారింది. ఆమె యూ ట్యూబ్‌ ఛానెల్‌కు సుమారు ఏడు లక్షల ముప్పై వేల మంది సభ్యులు ఉన్నారు. నిరాశ, ఆందోళన, బాడీ షేమింగ్‌ గురించి చర్చించడానికి ఆమె తన సోషల్‌మీడియా ΄్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తుంది.

యోగా ద్వారా సెల్ఫ్‌ గ్రోత్, చికిత్స గురించి మరీ మరీ చెబుతుంది. ప్రతిరోజూ మరింత బలంగా మారడానికి ప్రయత్నిస్తూనే ఉండాలని సూచనలు ఇస్తుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ద్వారా కష్టపడి పని చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో అందుకు తనే ఉదాహరణగా చూపుతుంది.

యోగాసిని రాధికా బోస్‌ 
అనేక పేరొందిన కంపెనీలతో కలిసి పనిచేసిన అనుభవం రాధికా బోస్‌కు ఉంది. అయితే, ఆమె తన ఆరోగ్యకరమైన జీవనాన్ని సూచించడానికి మాత్రం సోషల్‌మీడియానే ప్రధాన వేదికగా ఎంచుకుంటుంది. రాధిక సూచించే అంశాలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంటాయి. ప్రతిష్టాత్మకమైన మ్యాగజైన్‌లలో ఆమె యోగసాధన గురించి ప్రచురించాయి.

‘మీడియా, ప్రకటనలలో గ్లాస్‌ సీలింగ్‌ను ఛేదించడానికి మహిళలు గొప్ప పురోగతిని సాధించారు. అయితే మనం ఇంకా పితృస్వామ్యంలో జీవిస్తున్నాం, అన్నింటినీ దాటుకొని చాలా దూరం ప్రయాణించాల్సింది మనమే’ అని నమ్మకంగా చెబుతుంది. యోగా, వ్యాయామ జీవనశైలితో పాటు ఇతర ఆరోగ్య మార్గదర్శకాలను అందిస్తుంది. 9 సంవత్సరాలుగా యోగా సాధన చేస్తూ, నిపుణురాలిగా తన ప్రతిభను చాటుతోంది. 

Advertisement

What’s your opinion

Advertisement