నా మనసుకి కష్టంగా ఉంది! రామా! ఇది నిజమేనా!

Sri Rama Navami 2022: Creative Narration Rama Hanuman Conversation - Sakshi

సృజన రచన

హిమాలయాలలో నిదురిస్తున్న చిరంజీవి అయిన హనుమంతుడికి మెడలో ముత్యాల హారం చేతికి తగలగానే ఏదో జ్ఞప్తికి వచ్చినట్టుగా ఒక్కసారిగా నిద్ర నుంచి మేల్కొన్నాడు. నేడు నా రామయ్య కల్యాణం, నా  సీతారాములు ముత్యాల తలంబ్రాలు పోసుకునే రోజు, నా రాముడు సీతమ్మ మెడలోల ముడి మీద ముడి అంటూ మూడు ముళ్లు వేసే శుభదినం.

ఎన్నాళ్లుగానో ఆ కల్యాణం కన్నులారా తిలకించడానికి వెళ్లాలనుకుంటున్నాను, కాని రామనామస్మరణతో మరచిపోతున్నాను. ఈ సంవత్సరం కూడా మరచిపోతాననుకున్నాను. కాని సరైన సమయానికి ఈ ముత్యాల హారం, అదే ఆ నాడు పట్టాభిషేక సమయంలో సాక్షాత్తు సీతమ్మ నాకు బహూకరించిన ఈ ముత్యాల హారం, నా చేతికి తగిలి, గుర్తుకు వచ్చింది. ఇది నా భాగ్యం.

రామనామ మంత్రం జపిస్తూ అయోధ్యకు... కాదు కాదు... భద్రాద్రికి బయలుదేరతాను. ఏ శుభ ముహూర్తాన కంచర్ల గోపన్న నా రాముడికి మందిరం కట్టించాడో కాని, ఆయన రామదాసు అయ్యాడు, నాటి నుంచి ఆయనకు వైభోగంగా కల్యాణం జరుగుతూనే ఉంది. ఈ సంవత్సరం నేను అక్కడకు వెళ్లి, కన్నులపండువుగా సీతారామకల్యాణం వీక్షిస్తాను. త్రేతాయుగంలో నా రాముడి కల్యాణం జరిగేనాటికి ఆయన  ఎవరో కూడా నాకు తెలియదు కదా.

ఆ వైభోగం ఇలా చూడగలగడం నా భాగ్యమే కదా... అనుకుంటూ... ‘రామ రామ రామ...’ అని స్మరిస్తూ, భద్రాద్రి చేరుకునే సమయానికి, కల్యాణం ప్రారంభమవుతోంది. కల్యాణం కన్నులారా వీక్షించాడు. పరవశించిపోయాడు. తన్మయంలో మునిగితేలాడు. కల్యాణం పరిసమాప్తమైంది. భక్తులంతా ఎక్కడివారక్కడ సర్దుకున్నారు. రామయ్య సీతమ్మతో ఏకాంత మందిరంలోకి ప్రవేశించి, ముచ్చట్లు ప్రారంభించాడు.

వారి వెంటే హనుమ కూడా అంతఃపురం వరకు వచ్చి, బయట నిలబడి, దూరం నుంచి అంతా గమనిస్తున్నాడు. కొద్దిసేపటి తరవాత వారిని సమీపించి, ‘‘తండ్రీ! మీరు ఏకాంత మందిరంలో ఉన్నా కూడా, ఎవరి అనుమతి లేకుండా మీ దగ్గరకు వచ్చే చనువు నాకుంది కనుక, ఇలా వచ్చాను’ అన్నాడు. ఏమిటి హనుమ! ఇలా వచ్చావు, నేను నెరవేర్చవలసిన కార్యం ఏదైనా ఉందా?’ అని మృదుమధుర గంభీర గళంతో అడిగాడు రాముడు.

‘అటువంటిదేమీ లేదు తండ్రీ! మీ జంట చూడముచ్చటగా ఉంది. ఏనాడో త్రేతాయుగంలో శివధనుర్భంగం చేసి, సీతమ్మను చేపట్టావు. ద్వాపరం గడిచింది, కలియుంగలో కూడా కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి. నేటికీ నీ కల్యాణం ఇంత వైభోగంగా జరుగుతోంది. తండ్రీ! నిన్ను వేనోళ్ల కొనియాడినా నా తనివి తీరదు...’ అంటూ పరవశించిపోతుంటే, స్థితప్రజ్ఞుడైన రాముడు నిశ్చలంగా కూర్చున్నాడు.

అంతలోనే హనుమ...
నీ పట్టాభిషేక సమయంలో నువ్వు సీతమ్మ చేతికి ఒక ముత్యాల హారం ఇచ్చి,  ‘జానకీ! ఈ హారాన్ని నీకు ఇష్టమైన వారికి అందించు’ అన్నావు. సీతమ్మవారు... కాదు కాదు... నా కన్నతల్లి...  ఆ హారాన్ని అందుకుని సింహాసనం మీద నుంచి లేచి, మెట్లు అవరోహించి, సభలో అందరి మధ్యగా అడుగులు వేస్తూ, విభీషణ, జాంబవంత సుగ్రీవ, అంగదాది వానరులను ఒక్కొక్కరినీ దాటుకుంటూ వచ్చి, నా దగ్గరకు రాగానే నిలబడిపోయింది.

ఒక తల్లి తన కుమారుడిని చూసినంత ఆప్యాయంగా నా వైపు చూస్తూ, ‘మారుతీ! ఈ హారానికి నీవు మాత్రమే అర్హుడవు’ అంటూ నా చేతికి అందించింది. అక్కడున్నవారంతా హర్షధ్వానాలు చేశారు. సీతమ్మ ఎంపిక ఎంత చక్కగా ఉందో అంటూ సంబరపడ్డారు.

ఆ తల్లిని వేనోళ్ల కొనియాడారు. నేను సిగ్గుతో ముడుచుకుపోతూ, ‘తల్లీ! అంతా రాముని మహిమ వల్లే జరిగిందమ్మా, ఆయన అనుజ్ఞ లేనిదే నేను ఇంత ఘనకార్యం సాధించలేకపోయేవాడిని’ అన్నాను... ఇదంతా నాటి గాథ.

‘తండ్రీ! నీ కథ జరిగిన ఇన్ని వేల సంవత్సరాల తరవాత నిన్ను కొన్ని ప్రశ్నించాలనుకుంటున్నాను. నువ్వు నా తండ్రివి కనుక, నేను ఏది అడిగినా నువ్వు చిరునవ్వుతోనే సమాధానాలు చెబుతావని నాకు తెలుసు కనుక ధైర్యంగా అడుగుతున్నాను. అయితే ఇవి నా సందేహాలు కాదు. నీ గురించి నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటుంటే ఆ మాటలు నన్ను బాధపెడుతున్నాయి. నీ వెంటే ఉండి, నీ అడుగులో అడుగులు వేసిన నాకు, నువ్వంటే ఏమిటో తెలుసు.

ఇతరులు నిన్ను శంకిస్తుంటే నా మనసుకి కష్టంగా ఉంది. అందుకే సందేహ నివృత్తి కోసం నిన్ను ప్రశ్నిస్తున్నాను. మా సీతమ్మ తల్లి రావణుని చెరలో సంవత్సర కాలం ఉండి వచ్చిన తరవాత, నువ్వు ఆమెను అనుమానించావని, అగ్ని ప్రవేశం చేయించావని అందరూ అనుకుంటున్నారు. నీ వంటివానికి అనుమానించే లక్షణం లేదు కదా తండ్రీ. అందునా నీ గాథ రచించిన వాల్మీకి అలా రాసి ఉంటాడనుకోవట్లేదు.... అంటుండగానే... మధ్యలోనే సీతమ్మ అందుకుని,

హనుమా! నీ రామయ్య ఎటువంటివాడో నీకు తెలియదా. నా ప్రభువు రాముడికి అపవాదు రాకూడదనే నేనే, స్వయంగా చితి పేర్చుకుని అగ్నిప్రవేశం చేశాను. భార్యను అనుమానించేంత చిన్నబుద్ధి లేదు రామునికి. రాముడు నాకు భర్త మాత్రమే కాదు, కొన్ని కోట్లమందికి ప్రభువు. ఆయన అందరికీ ఆదర్శంగా ఉండాలే కాని, నియంతలా శాసించకూడదు. ఆయనను ఎవ్వరూ వేలెత్తి చూపకూడదు. అందుకే నాకుగా నేను చితి పేర్చుకున్నాను అని పలికింది జనకరాజ పుత్రి.

రాముడు చిరునవ్వుతో, హనుమా! ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి ఊహలు వారివి. వారి కళ్లకు నా ప్రవర్తన అలా కనిపించి ఉందేమో, వారు అలా అనుకోవడంలో తప్పులేదేమో అన్నాడు. హనుమ మరో ప్రశ్న అడిగాడు... తండ్రీ! నువ్వు భార్యను అనుమానించావని, నిండు చూలాలని కూడా చూడకుండా, ఒక చాకలివాని మాట పట్టుకుని, అరణ్యాలపాలు చేశావని, అక్కడ కుశలవులు పుట్టారని, సీతమ్మ తల్లి భూదేవి ఒడిలో చేరిపోయిందని, ఎన్నెన్ని మాటలు అన్నారయ్యా నిన్ను... అంటూ కన్నీరుమున్నీరవుతుంటే, ‘హనుమా, మనమంతా మనుషులం.

మనుషులలో అన్నిరకాల మనస్తత్వాలవారు ఉంటారు. అందరి అభిప్రాయాలను సహృదయంతో స్వీకరించాలి. ఆ విషయం కల్పితం అని వాల్మీకం చదివితే అర్థం అవుతుంది.. మా కథ రచించిన మహర్షి రామాయణ ఆరంభంలోనే... కుశలవుల చేత ఈ కథను గానం చేయించినట్లు వివరించాడు. నేనంటే భక్తి ప్రపత్తులు ఉన్న మరో కవి, నా సీత దూరమైతే ఎలా ఉంటుందో ఊహించి ఆ కథా రచన చేశాడని పండితులే స్వయంగా ఘోషిస్తున్నారు కదా ... అన్నాడు.

రామా! నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వేమిటో, నీ సత్ప్రవర్తన ఏమిటో, నీ ఏకపత్నీవ్రతమేంటో అర్థమైపోయిందయ్యా. నీ సునిశిత మనస్తత్వం కూడా అర్థమైందయ్యా. ఇందుకు సంబంధించి నేను ఒక్క మాట చెప్పాలయ్యా. నువ్వు సీతమ్మను వెతుకుతూ మా కిష్కింధకు వచ్చావు. సీతమ్మ జాడ గురించి అడిగావు. నేను నగల మూటను తీసుకువచ్చి చూపించాను.

నువ్వు ఒక నగను చేతిలోకి తీసుకుని కంట తడిపెట్టి, పక్కనే ఉన్న సౌమిత్రితో, ‘తమ్ముడూ! నా కళ్లకు నన్నీళ్లు అడ్డపడుతున్నాయి. నగలు నేను గుర్తించలేకపోతున్నాను. మీ వదినగారి నగలు నువ్వు గుర్తించవయ్యా... అన్నావు. అమ్మ అంటే నీకు ఎంత ప్రేమయ్యా. అంతేనా, నీ తమ్ముడు నీకు తగ్గ అనుజుడు. ఆయనకు నగలు చూపితే, ఆయన సీతమ్మ కాలి మంజీరాలు మాత్రమే గుర్తుపట్టగలిగాడు. నిత్యం ఆ తల్లి పాదాలకు నమస్కరించేవాడు నీ తమ్ముడు. ఎంత ఉత్తములయ్యా మీరు.

చివరగా ఒక్క మాట తండ్రి...
ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని సంవత్సరాలు గతించినా, దాంపత్యానికి చిహ్నంగా నా తల్లి సీతమ్మను, నా తండ్రి రామయ్యను చెప్పుకుంటూనే ఉంటారు. అది నాకు ఎంతో సంతోషం రామా! నాకు ఇంతకంటె ఏం కావాలి. నాడు మీ కల్యాణం స్వయంగా చూడలే కపోయామని ఎవ్వరూ బాధపడక్కర్లేదు.

నీ భక్తుడు రామదాసు చేసిన పుణ్యం కారణంగా ప్రజలంతా ఏటేటా మీ కల్యాణం చూస్తూనే ఉంటారు. ఇంక నాకు సెలవు ఇప్పించు రామా! హిమాలయాలకు వెళ్లి, నీ నామస్మరణ చేస్తూ తపస్సులోకి వెళ్లిపోతాను... అని సీతారాముల ఆశీస్సులు తీసుకుని హనుమ నిష్క్రమించాడు.
సృజన రచన – డా. వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top