
ఉపనిషత్తులు కీర్తించే నిర్గుణ పరబ్రహ్మమే సగుణ సాకార రూపంలో శ్రీరామచంద్రుడుగా, మానవుడిగా, దశరథ మహారాజుకు కుమారునిగా జన్మించాడు. రావణాసురుని సంహరించాలంటే పరమాత్మ మనిషిగానే పుట్టాలి. నరునిగా జన్మించి, వానరాల సహాయంతో మాత్రమే దుష్ట రావణ రాక్షస సంహారం చెయ్యగలుగు తాడు. కనుక పరిపూర్ణ మానవునిలా పుట్టి, మానవులలో ఉత్తమోత్తమ గుణ సమన్వితుడై, మానవునిలాగా సకల భావాలను అనుభవిస్తూ, బంధాలను, అనుబంధాలను, అందరికీ ఆదర్శంగా ఉండేలా ఉత్తమంగా పాటిస్తూ, మంచి కుమారునిలా, సోదరునిలా, భర్తగా, స్నేహితునిలా, రాజుగా అనేక విధాలుగా మానవుని లాగానే ప్రవర్తించాడు.
భరద్వాజ మహర్షి రచించిన భరద్వాజ రామాయణంలో శ్రీరామచంద్రుడు ఎవరెవరికి ఎలా కనిపిస్తున్నాడో, ఎవరు ఎలా అనుకుంటారో ఈ శ్లోకంలో చెప్పారు.
రామః పిత్రోః పుత్రభావం
రావణాయ మనుష్యతాం !
ఋషీణాం భగవద్భావం
దర్శయన్ విచచారహ!!
శ్రీరాముడు దశరథునికి పుత్రునిలా, రావణాసురునికి మనిషిలా, మహర్షులకు భగవంతునిలా కనిపించాడు. విశ్వామిత్ర మహర్షి దశరథుని రాజసభకు వచ్చి, తను చేస్తున్న యాగ రక్షణకు రాముడిని పంపమని అడిగినప్పుడు దశరథ మహారాజు పసిబుగ్గలతో పాలుతాగే వయస్సులో ఉన్న నా రాముడు రాక్షసులతో యుద్ధం చెయ్యటమా !! రాముడిని పంపలేను, నా సైన్యంతో నేను వస్తాను, యాగరక్షణ చేస్తానంటాడు. కానీ విశ్వామిత్రుడు అంగీకరించడు. రాముడినే పంపమంటాడు. పైగా నీ కుమారుని గురించి నీకు తెలీదు. మమకారంతో మోహపడుతున్నావు. రాముడెవరో నాకు తెలుసు, వసిష్ఠ మహర్షికి తెలుసు, తపస్సులో ఉన్న మహర్షులకు తెలుసు అన్నాడు.
తనకు రాముడెవరో తెలుసునన్నాడే కానీ ఆయనే పరమాత్మ అని చెప్పలేదు. అతీంద్రియ దర్శన శక్తి కల మహర్షులందరికీ శ్రీమన్నారాయణుడే శ్రీ రామునిలా వచ్చాడని తెలుసు. కానీ రావణ వధ అయేవరకు ఈ రహస్యం బైట పడరాదనీ, రాముడే తాను మానవుడిలా ప్రవర్తిస్తుంటే, ఆయన దేవుడని చెప్పకూడదని నిర్ణయించుకున్నారు. కానీ రాముడు జన్మించింది మొదలుకొని, అవతార పరిసమాప్తి వరకు మానవుడిలాగే జీవించాడు.
రావణ వధే రామావతార ఉద్దేశ్యం కాదు...
కేవలం రావణ వధ, దుష్ట రాక్షస సంహారము మాత్రమే శ్రీరామావతార ప్రయోజనం కాదు. ధర్మమంటే ఏమిటి? ధర్మాన్ని ఎలా ఆచరించాలి? సత్యమంటే ఏమిటి? ఎలా సత్యనిష్ఠ కలిగి ఉండాలన్నవి బోధించటానికి, ఒక సుస్థిరమైన సత్యమైన సత్పాలనను అందించి, ఆదర్శ రాజ్య పాలనను అందించటానికి, సర్వమానవ బంధాలను ఏ విధంగా పాటించాలో, అన్నింటినీ తాను ఆచరించి చూపించిన మహనీయుడు శ్రీరామచంద్రుడు. మానవుడు సత్యనిష్ఠతో, ధర్మ బుద్ధితో, సద్గురువుల ఆదేశంతో సత్యపథంలో పయనించి దేవుడుగా మారగలడని ప్రత్యక్షంగా ఆచరించి చూపించాడు, అన్ని విధాల ఆదర్శ వంతుడయ్యాడు. నరునిగానే ప్రవర్తిస్తూ, నరునిగానే ఆచరిస్తూ, సాధారణ మానవులకు సాధ్యం కాని ఎన్నింటినో సుసాధ్యం చేసి చూపించాడు.
రావణ వధానంతరం పరమేశ్వరుడే శ్రీరామ చంద్రుని దగ్గరికి వచ్చి, నువ్వు శ్రీమన్నారాయణుడివి, రావణ వధ కోసం నరునిలా అవతరించావు, ఆ కార్యం పూర్తయింది కనుక ఇంక వైకుంఠానికి వచ్చెయ్యమంటాడు. అప్పుడు రాముడు ‘ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం’ అని చెప్పాడు. అంటే ‘నీవు నన్ను ఎవరనైనా అనుకో, నేను మటుకు నన్ను దశరథుని కుమారుడైన రాముడిని, మనిషిని అనే అనుకుంటున్నాను’ అని అర్థం. శ్రీరాముడు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడై రామరాజ్యాన్ని స్థాపించాడు. సృష్టి ఉన్నంత వరకూ సర్వ మానవులూ ఆదర్శంగా భావించే ఆదర్శ పురుషుడయ్యాడు. అందరూ భక్తితో ఆరాధించే దేవుడయ్యాడు. అందుకే రామాయణం రమణీయం. చిర స్మరణీయ కావ్యం అయింది.
– డాక్టర్ తంగిరాల విశాలాక్షి,
విశ్రాంత సంస్కృత ఆచార్యులు