చినుకులా రాలి... నదులుగా సాగి 

Special Story On Noted Music Director Rajan - Sakshi

ప్రభాతాన వినాలంటే అతని పాట ఉంది. ‘పూజలు చేయ పూలు తెచ్చాను’ పరవశాన పాడుకోవాలంటే అతని పాట ఉంది. ‘మల్లెలు పూసె వెన్నెల కాసే’ ఒకరి సమక్షంలో మరొకరు పాడుకోవాలంటేనో? ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది’ నిరాశలో ఒక తోడు కావాలా? ‘మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం’ కుర్రకారు శిగమూగాలంటే? ‘ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా’ తెలుగుపాటకు పల్లవి అనుపల్లవిగా భాసించిన రాజన్‌– నాగేంద్ర సోదరుల్లో నాగేంద్ర ఇరవై ఏళ్ల క్రితమే వెళ్లిపోయారు. ఇప్పుడు రాజన్‌ వంతు. మెలొడీ.. లాలిత్యం... రాజన్‌ నాగేంద్రల సంగీతం.. చల్లదనాన్ని పంచిన మంచు శిఖరం కూలి కాలంలో కరిగిపోయింది నేడు. సంగీత దర్శకుడు రాజన్‌కు నివాళి ఇది.

రాజన్‌ ఇకలేరు
ప్రముఖ సంగీత దర్శకులు రాజన్‌ (87) మృతి చెందారు. ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని స్వగృహంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1933లో మైసూర్‌లోని శివరాంపేట్‌లో రాజప్పకు జన్మించారు రాజన్‌. రాజప్ప హార్మోనియమ్, ఫ్లూట్‌ ప్లూయర్‌. పలు చిత్రాలకు పని చేశారాయన. తన సంగీత జ్ఞానాన్ని చిన్నప్పటినుంచే పిల్లలకు పంచారు రాజప్ప. 1952లో కన్నడ చిత్రం ‘సౌభాగ్య లక్ష్మీ’తో సోదరుడు నాగేంద్రతో కలసి సంగీతదర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించారు రాజన్‌. దాదాపు 40 సంవత్సరాల పాటు సుమారు 375 సినిమాలకు ఈ ద్వయం సంగీతం అందించారు. కన్నడ, తెలుగు, తమిళం, తుళు, సింహళ భాషల్లో సంగీతాన్ని అందించారు. రాజన్‌–నాగేంద్ర ద్వయంగా ఈ ఇద్దరూ పాపులర్‌.

తెలుగులో తొలి నంది అవార్డు అందుకున్న సంగీత దర్శకులు ఈ సోదరులే. ‘పంతులమ్మ’ చిత్రానికి ఈ పురస్కారం లభించింది. తెలుగులో ‘అగ్గిపిడుగు, పూజ, పంతులమ్మ, మూడుముళ్లు, సొమ్మొకడిది సోకొకడిది, ప్రేమఖైదీ, రెండు రెళ్ల ఆరు, నాగమల్లి, పులి బెబ్బులి, కిలాడీ దొంగలు’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలకు సంగీతం అందించారు. 2000 సంవత్సరంలో నాగేంద్ర మృతి చెందారు. రాజన్‌ బెంగళూరులో ‘సప్త స్వరాంజలి’ అనే సంగీత పాఠశాలను స్థాపించారు. లాక్‌డౌన్‌లోనూ ఆన్‌లైన్‌లో సంగీత పాఠాలు తీసుకున్నారాయన. రాజన్‌ కుమారుడు అనంత్‌ కుమార్‌ కూడా సంగీతదర్శకుడే. సోమవారం బెంగళూరులోని హెబ్బాళలోని స్మశాన వాటికలో రాజన్‌ అంత్యక్రియలు జరిగాయి. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తపరిచారు. 

తెలుగువారు ఘనకార్యాలు చేస్తుంటారు. కాకపోతే తెలుగువారికి పెద్దగా పట్టదు. కన్నడ సీమలో తెలుగువారు రాజన్‌–నాగేంద్ర చాలా పెద్ద సంగీత దర్శకులు అయ్యారు. వారి దగ్గర పి.బి.శ్రీనివాస్, ఎస్‌.జానకి, ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం అనే తెలుగువారు చాలా హిట్‌ సాంగ్స్‌ పాడారు. కన్నడ ప్రజల కంఠానికి తెలుగు వారు రాసిన గంధం ఇది. కన్నడిగులు అది గుర్తించి గౌరవిస్తారు. తెలుగువారు చాలా తక్కువ ప్రస్తావిస్తారు.

రాజన్‌–నాగేంద్రల తండ్రి తరం తెలుగు ప్రాంతం నుంచే మైసూర్‌ ప్రాంతానికి వలస వెళ్లింది. వారు నేటికీ తెలుగే ఇంట్లో మాట్లాడుకుంటారు. వారి ఇంటి భాష తెలుగు. బతుకు భాష కన్నడం. రాజన్‌–నాగేంద్రల తండ్రి రాజప్ప అలనాడు మైసూర్‌ ప్రాంతంలో మూకీ సినిమాలు రిలీజైతే హాల్లో కూచుని సన్నివేశాలకు తగినట్టుగా వాద్యసంగీతం సృష్టించి షోకు ఇంత చొప్పున తీసుకునేవాడు. ఆ రోజుల్లో మూకీ సినిమాల వ్యాఖ్యాతలకు, ఇలా వాద్యహోరు సృష్టించేవారికి నాలుగు డబ్బులు దొరికేవి. అయితే ఆ డబ్బుల కంటే తన ఇద్దరు పిల్లలకు నాలుగు స్వరాలు అందివ్వడమే మంచిదని రాజప్ప అనుకునేవాడు. ఆయన ఇద్దరు కొడుకులు రాజన్‌–నాగేంద్ర తండ్రి కోరినట్టే సంగీతం నేర్చుకున్నారు. రాజన్‌కు వయొలిన్‌లో గొప్ప ప్రవేశం వచ్చింది. నాగేంద్ర పాటలు పాడేవాడు. అన్నదమ్ములకు సంగీతం మీదే ధ్యాస ఉండటంతో అతి కష్టం మీద హైస్కూలు వరకూ చదివి పద్నాలుగు పదిహేనేళ్లు రావడంతోటే బెంగళూరులో సంగీత బృందాల్లో పని చేయడం మొదలెట్టారు. వారి ప్రతిభను గమనించి కన్నడిగుడని అందరూ పొరబడే మరో సంగీత ఉద్దండుడు, కన్నడ తొలి టాకీకి సంగీతాన్ని అందించిన టి.ఆర్‌.పద్మనాభశాస్త్రి వారిని మద్రాసు తీసుకెళ్లి ఒక సినిమా సంగీతంలో భాగం చేశారు. అక్కడ ఒకటి రెండేళ్లు ఉన్నాక తిరిగి బెంగళూరు చేరుకున్నారు అన్నదమ్ములు.

విఠలాచార్య విన్న పాట
అతి పొదుపుగా ఖర్చు చేసి సినిమా పూర్తి చేసే విఠలాచార్య ఈ కొత్త పిల్లలను సినిమా సంగీత దర్శకులను చేసి సినిమా ఖర్చును తగ్గించుకోదలచి కన్నడలో ‘సౌభాగ్యలక్ష్మి’ (1952) అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు. అది రాజన్‌ నాగేంద్రల మొదటి సినిమా. వారి పని తీరు నచ్చాక ముఖ్యంగా డబ్బు గురించి అన్నదమ్ములకు పట్టింపు లేదని గ్రహించాక ఆయన మరో కన్నడ సినిమా ‘చంచల కుమారి’కి అవకాశం ఇచ్చాడు. అంతటితో ఆగక తెలుగుకు ‘వద్దంటే పెళ్లి’ (1957)తో పరిచయం చేశాడు. 1964లో విఠలాచార్య తీసిన ‘నవగ్రహ పూజా మహిమ’ లో ‘ఎవ్వరో ఎందుకీ రీతి సాధింతురు’ పాట పెద్ద హిట్‌ అయ్యింది. అయితే ఆ పాట  ఓ.పి.నయ్యర్‌ చేసిన పాటకు కాపీ. తొలి రోజుల్లో నిలదొక్కుకోవడానికి రాజన్‌ నాగేంద్ర హిందీ బాణీల ప్రభావంతో చేసేవారు. కాని ‘అగ్గి– పిడుగు’లో వారు చేసిన ‘ఏమో ఏమో ఇది’ నేటికీ నిలిచి ఉంది. అసలైన రాజన్‌ నాగేంద్ర కన్నడ సీమలో ‘గంధదగుడి’ (1963) సినిమాతో రెక్కలు సాచారు. ఎన్‌.టి.ఆర్‌ ‘అడవిరాముడు’ సినిమాకు మూలంగా నిలిచిన ఈ హీరో రాజ్‌కుమార్‌ సినిమా రాజన్‌ నాగేంద్ర పాటలు తోడై సిల్వర్‌ జూబ్లీగా నిలిచింది. ఇందులో పి.బి.శ్రీనివాస్‌ పాడిన ‘నావాడువనుడియె కన్నడ నుడి’ పాటతో రాజన్‌–నాగేంద్ర కన్నడిగుల హృదయాలలో శాశ్వతస్థానం సంపాదించుకున్నారు.

నింగి నేల ఒకటాయెనే
రాజన్‌–నాగేంద్రల రెండవ రాకడ ‘పూజ’ (1975)తో జరిగింది. ఏ.వి.ఎం వారు తీసిన ఈ సినిమా అంతగా ఆడకపోయినా పాటలు నేటికీ పాడుతున్నాయి. ఇందులో రాజన్‌–నాగేంద్ర తమ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని తెలుగుసీమకు చూపారు. ‘ఎన్నెన్నో జన్మల బంధం’ పాట ఒక బెస్ట్‌ డ్యూయెట్‌గా ఎంచబడుతుంది. ‘పూజలు చేయ పూలు తెచ్చాను’, ‘మల్లెతీగ వాడిపోగా’, ‘నింగి నేల ఒకటాయెనె’, ‘అంతట నీరూపం’, ‘నీ దయ రాదా’... పాటలు వీరికి పునఃస్వాగతం పలికాయి. ఆ వెంటనే సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘పంతులమ్మ’ పాటలూ సినిమాను మ్యూజికల్‌ హిట్‌ను చేశాయి. ‘సిరిమల్లె నీవే’, ‘మానసవీణ మధుగీతం’, ‘మనసెరిగిన వాడు మా దేవుడు’ పాటలు గానానికి, శబ్దానికి వీరిచ్చే విలువను తెలియ చేశాయి. సింగీతం, రాజన్‌ నాగేంద్రల కాంబినేషన్‌లో  ‘సొమ్మొకడిది సోకొకడది’ కూడా హిట్టే. ఇందులోని ‘ఆ పొన్న నీడన’, ‘తొలి వలపూ తొందరలు’ కొబ్బరాకుల మీది పచ్చదనంతో ఉంటాయి. 

మధువనిలో రాధికవో
సుందరమైన కుటుంబ కథలకు, లలితమైన ప్రేమ కథలకు రాజన్‌ నాగేంద్రల సంగీతం బాగుంటుందనే అభిప్రాయం స్థిరపడింది. ‘ఇంటింటి రామాయణం’ (వీణ వేణువైన సరిగమ విన్నావా, మల్లెలు పూసె వెన్నెల కాసే), ‘అల్లరి బావా’ (మధువనిలో రాధికవో), ‘నాగమలి’్ల (నాగమల్లివో తీగమల్లివో, రాగం తీసే కోయిల), ‘అద్దాల మేడ’ (పరిమళించు పున్నమిలో) ఇవన్నీ రాజన్‌ నాగేంద్రల మెలడీలతో నిండాయి. ఆ తర్వాత జంధ్యాల వచ్చి వారితో జత కట్టారు. ‘నాలుగు స్తంభాలాట’ పాటలు ముఖ్యంగా ‘చినుకులా రాలి’ ఇంటింట శ్రోతలు కోరే పాట అయ్యింది. జంధ్యాలతో రాజన్‌ నాగేంద్రలు ‘మూడు ముళ్లు’, ‘రెండురెళ్లు ఆరు’, ‘చూపులు కలసిన శుభవేళ’, ‘రాగలీల’ సినిమాలు తీశారు. ‘లేత చలి గాలులు’, ‘కాస్తందుకో దరఖాస్తందుకో’, ‘చలికాలం ఇంకా ఎన్నాళ్లో’ ఈ సినిమాల పాటలు. అలనాటి ‘చూపులు కలిసిన శుభవేళ’ పాటను ‘మేల్‌ డ్యూయెట్‌’ అంతే అర్థవంతంగా రాజన్‌ నాగేంద్రలు మలిచారు. ‘ప్రేమ ఖైదీ’, ‘అప్పుల అప్పారావు’ వారి చివరి హిట్‌ సినిమాలు.

మనిషే మణిదీపం
సంగీత ద్వయం అంటే ఒకరిది బాణి, ఒకరిది ఆర్కెస్ట్రయిజేషన్‌. రాజన్‌ నాగేంద్రలో పెద్దవారైన రాజన్‌ సినిమా బాణీలు కూర్చేవారు. నాగేంద్ర పాట నేర్పించేవారు. రాజన్‌ పర్‌ఫెక్షనిస్ట్‌. ఒక్కోసారి ఐదారుసార్లు రికార్డు చేసేవారు. ట్రాకులు పాడించకుండా గాయకుల చేతే ప్రాక్టీసు చేయించి పాడించేవారు. కన్నడంలో రాజ్‌కూమార్‌ స్టార్‌ హీరో చేత కూడా తమకు కావాల్సినట్టుగా పాడించుకున్న సంగీత దర్శకులు రాజన్‌ నాగేంద్ర. ఆ సంగీతద్వయానికి ఎందరో అభిమానులు ఉన్నారు. వారందరూ ఇవాళ వారి పాటలను తలుచుకుంటారు. కొలుచుకుంటారు.
మణిషే మణిదీపం మనసే నవనీతం...
– సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top