మెరుపు రత్నాలు

Special Story About Women Athletes Of India - Sakshi

స్వర్ణం సాధించడం గొప్ప. రజతమూ తక్కువేం కాదు. కాంస్యం కూడా విలువైనదే. గెలుపు పతకాలు ఇవన్నీ. ఖేల్‌ రత్న.. అర్జున.. ఈ గెలుపు పతకాలకు తళుకులు. ఆ తళుకులకే మెరుపులు.. మహిళా క్రీడామణులు!!

మహిళకు చిన్న గుర్తింపు రావడమే పెద్ద అవార్డు! ఇక పెద్ద అవార్డు వచ్చిందంటే అది దేశానికే గుర్తింపు. మహిళల నైపుణ్యాల సహాయం తీసుకున్న దేశం ముందుకు వెళుతుంది. మహిళల ప్రావీణ్యాలకు స్థానం కల్పించిన దేశం నాగరికం అవుతుంది. మహిళల ప్రతిభకు పట్టం కట్టిన  దేశం ప్రపంచానికే దీటైన పోటీ, వెలుగు దివిటీ అవుతుంది. క్రీడారంగం అనే కాదు, ఏ రంగమైనా దేశానికి మహిళలు ఇచ్చే గుర్తింపు ఇది. అవును. దేశం మహిళలకు ఇవ్వడం కాదు, మహిళలు దేశానికి ఇవ్వడం. ఈ ఏడాది భారతీయ క్రీడారంగంలో వినేష్‌ ఫొగాట్, రాణీ రాంఫాల్, మణికా బాత్రా,  మరో పదకొండు మంది మహిళలు దేశానికి గుర్తింపు ఇచ్చేవారి జాబితాలో ఉన్నారు. క్రీడారంగంలో అత్యున్నత పురస్కారాలైన ‘ఖేల్‌ రత్న’, ‘అర్జున’ అవార్డుల జాబితా అది.

వినేశ్‌ ఫొగాట్, రాణి రాంఫాల్, మణికా బాత్రా ‘ఖేల్‌ రత్న’ పరిశీలనలో ఉన్నారు. దీపికా ఠాకూర్, సాక్షి మాలిక్, మీరాబాయ్, ద్యుతీచంద్, దివ్య కర్కాన్, లవ్లీనా, మనూ బకర్, దీప్తి శర్మ, మధురిక, అదితి అశోక్, సారిక ‘అర్జున’ బరిలో ఉన్నారు. మరో క్రీడా అవార్డు ‘ధ్యాన్‌చంద్‌’కు.. విశాఖపట్నం బాక్సర్‌ నగిశెట్టి ఉషకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 29న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అవార్డు విజేతల పేర్లను వర్చువల్‌గా (ఆన్‌లైన్‌ కార్యక్రమం) ప్రకటిస్తారు. 
ఖేల్‌ రత్న వడపోతలో మిగిలిన ముగ్గురు మహిళలూ దేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినవారే. వినేష్‌ ఫొగాట్‌ రెజ్లర్‌. 2018 కామన్‌వెల్త్, ఏషియన్‌ గేమ్స్‌ ఈవెంట్‌లలో స్వర్ణపతకాలు సాధించారు. 2019 ఏషియన్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యపతకం సంపాదించారు. హర్యానాలోని కుస్తీ యోధుల కుటుంబం నుంచి వచ్చారు వినేశ్‌. ఈ ఆగస్టు 25కి ఆమెకు ఇరవై ఆరేళ్లు నిండుతాయి. బహుశా ఖేల్‌ రత్న ఈసారి వినేశ్‌ పుట్టినరోజు కానుక అవుతుంది. ‘ఫ్రీ స్టెయిల్‌’లో ఒడుపు ఆమె ప్రత్యేకత.

రాణీ రాంఫాల్‌ మహిళా హాకీ టీమ్‌ కెప్టెన్‌. ఖేల్‌ రత్న అవార్డు పరిశీలనకు ఎంపికైన మూడో హాకీ ప్లేయర్, తొలి మహిళా హాకీ ప్లేయర్‌ రాంఫాల్‌. ఆమె నేతృత్వంలోనే 2017 ‘ఉమెన్స్‌ ఏషియా కప్‌’లో భారత హాకీ జట్టు ఘన విజయం సాధించింది. 2018 ఏషియన్‌ గేమ్స్‌లో రాంఫాల్‌ టీమ్‌ రజత పతకం గెలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా అర్హత సాధించడానికి అవసరమైన 2019 క్వాలిఫయర్స్‌ గేమ్‌లో టీమ్‌ కొట్టిన గేమ్‌–ఛేంజింగ్‌ గోల్‌ ఆమెను ఖేల్‌ రత్న కమిటీ దృష్టిలో పడేలా చేసి ఉండొచ్చు. రాణీ రాంఫాల్‌ కూడా హర్యానా అమ్మాయే. వినేశ్‌ ఫొగాట్‌ కన్నా నాలుగు నెలలు చిన్న. పేద కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తండ్రి లాగుడు బండితో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. రాణి ఆరేళ్ల వయసులోనే హాకీ అకాడమీలో చేరారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత బల్‌దేవ్‌ సింగ్‌ దగ్గర  కోచింగ్‌ తీసుకున్నారు. 

ఖేల్‌ రత్నకు కమిటీ పరిశీలనలో ఉన్న మరో మహిళ మణికా బాత్రా టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌. 2018 కామన్‌వెల్త్, ఏషియన్‌ గేమ్‌లలో సింగిల్స్‌లో స్వర్ణ, కాంస్య పతకాలు సాధించారు. 2019 జనవరి నాటికి మణిక టాప్‌ ర్యాంక్‌ మహిళా టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి. ప్రపంచంలో 47 ర్యాంకర్‌. (జనవరి 1–డిసెంబర్‌ 31 మధ్య క్రీడాకారులు సాధించిన విజయాలను అవార్డులకు పరిగణనలోకి తీసుకుంటారు). మణిక న్యూఢిల్లీ అమ్మాయి. వినేశ్, రాంపాల్‌ల కన్నా వయసులో ఏడాది చిన్న. ‘షేక్‌హ్యాండ్‌ గ్రిప్‌’ ప్లేయింగ్‌ స్టయిల్‌లో నిష్ణాతురాలు. అది యూరోపియన్‌ స్టెయిల్‌. రాకెట్‌ హ్యాండిల్‌ని బిగించి పట్టుకుని ఉన్నప్పుడు ఆ పొజిషన్‌ షేక్‌హ్యాండ్‌ ఇవ్వబోతున్నట్లుగా ఉంటుంది. 

పవర్‌ని, స్పిన్‌ని ఈ రకం గ్రిప్‌తో కావలసిన విధంగా నియంత్రించవచ్చు. పెన్‌హోల్డ్‌ గ్రిప్, వి–గ్రిప్, సీమిల్లర్‌ గ్రిప్‌ అనేవి కూడా ఉంటాయి. ఆ గ్రిప్‌లు కొట్టే బంతుల్ని షేక్‌హ్యాండ్‌ గ్రిప్‌తో ఎదుర్కోడానికి ఎంతో ప్రావీణ్యం కలిగి ఉండాలి. మణిక అందులో చెయ్యి తిరిగిన ప్లేయర్‌. ఇక ‘అర్జున’ అవార్డు పరిశీలనకు ఎంపికైన పదకొండుమంది మహిళలు కూడా మణికలా తమ ఆటల్లో ఏదో ఒక ప్రత్యేకమైన ‘గ్రిప్‌’ ఉన్నవారే. రాష్టపతి భవన్‌లో ప్రదానం చేసే అవార్డును ఆ ఉద్వేగంలో, ఆనందంలో.. పొదవి పట్టుకోడానికి ఎలాగూ ఆ గ్రిప్‌ ఉపయోగపడుతుంది. అయితే కరోనా వల్ల ఈసారి విజేతలు ఎక్కడి వాళ్లు అక్కడి నుంచే ఆన్‌లైన్‌లో అవార్డుల ప్రకటనను వినవలసి ఉంటుంది. చిన్న నిరాశే అయినా.. చరిత్రలో ఆ నిరాశ పక్కనే సాధించిన ఘనతా ఉండిపోతుంది. 

నగిశెట్టి ఉష (బాక్సర్‌) 
‘ధ్యాన్‌చంద్‌’ క్రీడా అవార్డు బరిలో ఉన్న ఉష సీనియర్‌ బాక్సర్‌. ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లలో రెండు రజత పతకాలు, ఒక స్వర్ణ పతకం సాధించిన రికార్డు ఉంది. ఆట నుంచి రిటైర్‌ అయ్యాక అనేక మహిళా బాక్సర్‌లకు శిక్షణ కూడా ఇచ్చారు. ఉష ప్రస్తుతం తూర్పు కోస్తా రైల్వేలో (విశాఖ) పని చేస్తున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top