ముగ్గురు తల్లుల ముచ్చట

Special Story About Vienna And Poonam And Raina From Mumbai - Sakshi

బిజినెస్‌

కాలేజీ రోజుల నుంచి కన్న కల వారికి పిల్లలు పుట్టిన తర్వాత నెరవేరింది. వియని, పూనమ్, రైనా ముగ్గురూ చిన్ననాటి స్నేహితులు. ఉండేది ముంబయ్‌లో. ఈ ముగ్గురూ కలిసి ఏదైనా మంచి గుర్తింపు వచ్చే వ్యాపారం చేయాలని కలలు కన్నారు. ముగ్గురూ కాలేజీ చదువులు పూర్తయ్యాక ఉద్యోగాల్లో చేరారు. రోజులో ఎక్కువ సమయం ఉద్యోగానికే కేటాయించేవారు. పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలు పుట్టిన తర్వాత ఓ వైపు ఉద్యోగం, మరోవైపు పిల్లల పనులతో తీరికలేకుండా ఉండేవారు. ఆ సమయంలోనే పిల్లల దుస్తుల బ్రాండ్‌ ప్రారంభించాలనుకున్నారు. ముగ్గురూ ఒక్కొక్కరూ రూ.30 వేలతో రెండేళ్ల క్రితం ‘ఓయి ఓయి’ అనే పేరుతో కిడ్స్‌ బ్రాండ్‌ని ప్రారంభించారు. దానర్ధం ఫ్రెంచ్‌లో ‘ఎస్‌ ఎస్‌’.  

‘నేను తల్లినయ్యాక ఇంటి నుండి ఆఫీసు పని చేసేదాన్ని. ఒక రోజు నా పై అధికారి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కుదరదు, ఉద్యోగం వదులుకోమని చెప్పారు’ కొన్ని కంపెనీలు ఇప్పటికీ పని చేసే తల్లుల స్థితిని పట్టించుకోకపోవడం వల్ల చాలా మంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆమె ఈ పరిస్థితిని చెబుతూ ‘మేం ముగ్గురం చిన్నప్పటి నుంచీ స్నేహితులం. మాకు ఒకరి స్వభావాలు మరొకరికి బాగా తెలుసు. మా ముగ్గురికీ చిన్నపిల్లలు ఉన్నారు. మేం ఈ వ్యాపారం ప్రారంభించాక ఒక్కొక్కరం ఒక్కోసారి వీలును బట్టి వర్క్‌ చేసుకునే అవకాశం లభించింది’ అని తెలిపారు వియని.

రెండేళ్ల క్రితం ప్రారంభం
‘2018లో ముందు తెలిసిన వారి ద్వారా, ఇన్‌స్ట్రాగామ్‌ ఆర్డర్‌ల ద్వారా మా వ్యాపారాన్ని కొనసాగించాలనుకున్నాం. ఇందుకు మా బ్రాండ్‌ దుస్తులను మా పిల్లలకే వేసి ఫొటో షూట్‌ చేయించాం. వాటిని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్‌ చేశాం. దీంతో మా ఫ్రెండ్స్, ఇతర కుటుంబ సభ్యులు, తెలిసినవారు మా నుండి బట్టలు కొన్నారు. వినియోగదారుల నుండి మంచి స్పందన వచ్చినప్పుడు మా ఇన్‌సా ్టగ్రామ్‌ ఖాతాలో వాటిని పోస్ట్‌ చేస్తూ ఆర్డర్‌లను పెంచడంపై దృష్టి పెట్టాం’ అని రైనా చెప్పారు. ‘మొదట్లో పెద్దగా డబ్బు సంపాదించకపోయినా ఆర్డర్‌ రాగానే మెటీరియల్‌ తేవడం, డిజైనింగ్‌ చేయడం.. త్వరగా వినియోగదారునికి అందించడం చేసేవాళ్లం. ఎంతోమంది చిన్నారులను మా దుస్తులతో అందంగా ఉంచుతున్నాం అనే ఆలోచన మాలో హుషారుని ఇచ్చింది’ అని వియని చెప్పారు.

సెలబ్రిటీల నుంచి... 
ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా త్వరలోనే ప్రముఖుల నుంచి ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. ఇనాయా ఖేము, తైమూర్‌ అలీ ఖాన్, ఆరాధ్య బచ్చన్, మెహర్‌ బేడి ధుపియా వంటి పిల్లలంతా ప్రముఖ సెలబ్రిటీల పిల్లలు. ఇప్పుడు ఆ పిల్లలే మా ‘బుల్లి క్లయింట్లు’ అని గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ ముగ్గురు తల్లులు. శోభా డే మనవరాళ్ళు, లిసా రే కుమార్తెలు వీరి ప్రచారంలో ఇప్పుడు భాగమయ్యారు. ‘ఓయి ఓయి’ కి మిగతా ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్స్‌ వేదికగా నిలిచాయి. 
ట్రిక్స్‌ అండ్‌ టిప్స్‌ 
సరసమైన ధరలకు స్మార్ట్‌ క్యాజువల్‌ బ్రాండ్‌ని అందిస్తూ వచ్చారు. తల్లిదండ్రులకు పెప్పీ ప్రింట్ల నుండి పలాజో సెట్ల వరకు ఒకే చోట దొరికే సదుపాయం కల్పించారు. దీంతో వ్యాపారాన్ని షాపుల ద్వారానూ  కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. బాంబే టైమ్స్‌ ఫ్యాషన్‌ వీక్‌లో హాప్‌స్కాచ్‌తో ‘ఓయి ఓయి’ని విజయవంతంగా ప్రారంభించారు. లిటిల్‌ మఫెట్, ఫస్ట్‌క్రీ, మింత్రాతో కలిసి పనిచేయడం ఈ బ్రాండ్‌కు మరింత సహాయపడింది.  

ఆర్డర్లు .. అవార్డులు
రెండుసార్లు కిడ్స్‌స్ట్రాపెస్, ఇండియా కిడ్స్‌ బ్రాండ్‌ అవార్డు, స్మార్ట్‌ దుస్తులు పిల్లల విభాగంలో అత్యంత గుర్తింపు పొందిన బ్రాండ్లలో ఒకటిగా పేరు సంపాదించింది ఓయి ఓయి. 2021 నాటికి నెలకు 10,000 ఆర్డర్లు పొందాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ 3 మామ్స్‌. కోవిడ్‌–19 ప్రభావం ఈ బ్రాండ్‌ కార్యకలాపాలపైనా చూపింది. అయితే లాక్డౌన్‌ ముగిసిన నాటి నుంచి అత్యధిక అమ్మకాలూ జరిగాయని ఈ ముగ్గురు తల్లులూ సగర్వంగా చెబుతున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top