లైన్‌ ఉమెన్‌

Special Story About Usha Jagdale from Maharashtra In Family - Sakshi

కొన్ని కఠినతరమైన ఉద్యోగాల్లో వారు చేసే పనిని బట్టి ఇప్పటికీ మెన్‌ లేదా మ్యాన్‌ అనే సంబోధిస్తుంటారు. అలా పిలిచే వాటిలో ‘లైన్‌ మ్యాన్‌ లేదా వైర్‌ మ్యాన్‌’ ఒకటి. కరెంట్‌కు సంబంధించిన పనుల్లో మహారాష్ట్ర స్టేట్‌ ఎలక్ట్రిసిటీ డిస్టిబ్య్రూషన్‌ కంపెనీ లిమిటెడ్‌లో ‘లైన్‌ ఉమెన్‌’గా విధులను నిర్వర్తిస్తున్నది ఉషా జగ్దాలే.

నిచ్చెన లేకుండా విద్యుత్‌ స్తంభం ఎక్కుతున్న ఈ యువతిని చూస్తే ఎవ్వరైనా ‘వారెవ్వా’ అంటారు. ఆడవాళ్లు తలుచుకోవాలేగాని ఏ కష్టం చేయడానికైనా వెనకాడరు అంటూ అమ్మాయిలను పిలిచి మరీ ఉదాహరణగా చూపుతారు. ఇంతకు ముందెన్నడూ ఒక మహిళ కరెంట్‌ పోల్‌ను ఎక్కడం లేదా హై పవర్‌ కరెంట్‌ తీగల కనెక్షన్‌ను సరిచేయడం చూడలేదు సుమా అని ఆశ్చర్యపోతారు. ఇటీవల ట్విట్టర్‌ పేజీ నుండి ఒక వీడియో షేర్‌ అయ్యింది.

అందులో, ఒక మహిళ విద్యుత్‌ స్తంభంపైకి సులభంగా ఎక్కడం కనిపిస్తుంది. విద్యుత్‌ సరఫరా సమస్య పరిష్కరించి పోల్‌ నుంచి కిందకు దిగుతున్నట్లు కూడా ఆ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో ఉషా జగ్దాలేకి సంబంధించింది. లాక్డౌన్‌ సమయంలో, ఎలక్టీష్రియన్లు సమయానికి చేరుకోలేకపోయినప్పుడు, విద్యుత్‌ సరఫరా ఫిర్యాదులను పరిష్కరించడానికి ఉషా జగ్దాలే చాలామందికి సహాయపడింది. ‘వైర్‌ ఉమెన్‌’గా అందరిచేత శభాష్‌ అనిపించుకుంటుంది.

వైర్లను కనెక్ట్‌ చేయడంలో ప్రత్యేకత
నిచ్చెన లేకుండా విద్యుత్‌ స్తంభంపైకి ఎక్కి భద్రతా పరికరాలు లేకుండా తెగిన వైర్లను కలుపుతుంది. చిన్నతనం నుంచీ క్రీడలపై ఆసక్తి ఉన్న ఉష క్రీడాకారిణి కూడా. మహారాష్ట్ర రాష్ట్ర స్థాయి ఖోఖో జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉంది. ఇప్పటివరకు రాష్ట్రస్థాయిలో 11 బంగారు పతకాలను సాధించింది. 

ప్రశంసల జల్లుతో పాటు సేఫ్టీ సూచనలు
స్పోర్ట్స్‌ కోటా నుంచి టెక్నీషియన్‌ ఉద్యోగానికి ఎంపికయ్యింది ఉషా జగ్దాలే. మొదట ఆమెకు ఆఫీసు పనే ఇచ్చారు. కానీ ఉష ఆఫీసు పనికి బదులుగా వైర్‌ ఉమెన్‌గా పనిచేయడానికి ఇష్టపడింది. అదే ఆమెను అందరిలో ప్రత్యేకంగా చూపుతుంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో ఎక్కువగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా ఉషా జగ్దాలే ధైర్యానికి ఆశ్చర్యపోతున్నారు. ఈ వార్త వైరల్‌ అయిన వెంటనే, కొంతమంది ఉషను ప్రశంసిస్తుండగా, చాలామంది సేఫ్టీ కిట్‌ వాడమని సలహా ఇస్తున్నారు. 
మొత్తానికి మగవారు మాత్రమే చేయగలరు అనుకునే పనుల్లో మగువలూ తమ సత్తా చాటుతున్నారు. నిర్వర్తించే విధుల పేర్లను దర్జాగా మార్చేస్తున్నారు. అందుకు ఉదాహరణ ఈ లైన్‌ ఉమెన్‌ జాబ్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top