ఎకో గణేశా! ఏకదంత గణేశా!!

Special Story About Rishita Sharma Green Utsav Programme - Sakshi

ఎకో ఏకదంతి

ఏ సామాజిక ఉద్యమానికైనా పిల్లలను మించిన సారథులు మరెవరూ ఉండరు. వాళ్ల మెదడులో ఒక బీజాన్ని నాటితే అది మొలకెత్తి మహావృక్షమై పెరుగుతుంది. ఉద్యమం ఉద్దేశం నెరవేరి తీరుతుంది. ‘మట్టి గణేశుడిని పూజిద్దాం’ అని పెద్దవాళ్లకు ఎంతగా చెప్పినా అలా విని ఇలా వదిలేస్తారు. అదే పిల్లలకు చెబితే చేసి చూపిస్తారు. గణేశ చతుర్ధి అంటేనే పిల్లల పండుగ. ఆ వేడుక కోసం పిల్లల చేతనే గణేశుడి బొమ్మను తయారు చేయిస్తే ఎలా ఉంటుంది? మట్టితో గణేశుడి విగ్రహాన్ని చేయడమెలాగో పిల్లలకు నేర్పిస్తే చాలు. ఎంతటి రంగురంగుల ఆకర్షణీయమైన ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ బొమ్మలు కనిపించినా సరే పిల్లలు వాటి వంక కూడా చూడరు. బెంగళూరుకు చెందిన రిషితాశర్మ కూడా అలాంటి ప్రయోగాన్నే చేస్తున్నారు.

ఉద్యమ సాధనం
రిషితాశర్మ జీరో వేస్ట్‌ యాక్టివిస్ట్‌. ప్రజల్లో సామాజిక చైతన్యం తీసుకురావడానికి ఆమె గత ఆరేళ్లుగా గ్రీన్‌ ఉత్సవ్‌ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గణేశ విగ్రహాల మీద ప్రత్యేక దృష్టి పెట్టిన రిషిత 2017 నుంచి మట్టి గణేశుడి తయారీ వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. బెంగళూరులో తాను నివసించే వైట్‌ ఫీల్డ్‌లో ఉన్న అపార్ట్‌మెంట్‌ సొసైటీ నుంచే మొదలు పెట్టారామె. ఏడాదికి నలభై వర్క్‌షాప్‌లతో మొత్తం ఎనిమిది వందల మందికి మట్టి వినాయకుడి బొమ్మల తయారీ నేర్పిస్తున్నారు. అందులో ఎక్కువగా పిల్లలను భాగస్వాములను చేస్తున్నారు. 
అరగంటలో రెడీ
వినాయకుని బొమ్మ చేయడానికి బంకమట్టి, నీరు, టూత్‌ పిక్‌లు(ఏదో ఒక పుల్లలు), చాకు లేదా స్పూన్‌ తీసుకోవాలి. మట్టిని ఫొటోలో ఉన్నట్లుగా తయారు చేసుకోవాలి. పుల్లల సహాయంతో మట్టి ముద్దలను జత చేయాలి. మట్టి ముద్దను స్పూన్‌తో వత్తి చెవుల ఆకారం వచ్చేటట్లు చేయాలి. పాదాలకు, చేతులకు వేళ్లను పుల్లతో లేదా స్పూన్‌ చివరతో నొక్కుతూ గీయాలి. తలపాగా కూడా అంతే. రంగులు కావాలంటే కృత్రిమ రంగుల జోలికి పోకుండా ఇంట్లో ఉండే పసుపు, బీట్‌రూట్‌ రసంతో విగ్రహానికి రంగులు అద్దాలి. ఇంకా ఆకర్షణీయంగా కావాలనుకుంటే పెసలు, మినుములు, కూరగాయల గింజలు, ఆవాల వంటి దినుసులను మట్టిలో కలుపుకోవచ్చు లేదా వినాయకుడి విగ్రహం మీద అలంకరించవచ్చు. అయితే ఇవి తప్పనిసరి కాదు. 

ఎప్పటికీ పండగే
వినాయక చవితి వేడుకలు పూర్తయిన తర్వాత విగ్రహాన్ని నీటిలో కరిగించి ఆ మట్టిని మొక్కలకు పోసుకోవచ్చు. మట్టిలో కనుక గింజలను కలిపి ఉంటే... ఒక మడిని సిద్ధం చేసుకుని ఆ మడిలో వినాయకుడిని కరిగించిన మట్టి నీటిని పోయాలి. ఓ వారానికి మొలకల రూపంలో పచ్చదనం ఇంటి ఆవరణలో వెల్లివిరుస్తుంది. ఆ పచ్చదనం ఎప్పటికీ వాడని పండుగ.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top