మంచి బతుకునీయమ్మా బతుకమ్మా

Special Story About Bathukamma Festival - Sakshi

మన పూర్వీకులు ఇనుము – ఉక్కు తయారీకి తంగేడుచెక్కను వాడేవారట. తోలుతయారీకి తంగేడు ఎంత అవసరమో అందరికి తెలుసు. గునుగుకు నీళ్ళను శుభ్రపరిచే గుణముంది. తమకు నిత్యజీవితావసరాలైన తంగేడు, గునుగుపూలతో మనపూర్వీకులు తమ అమ్మదేవతని పూజించే రూపమే పరిణామంలో జాతరగా మారివుంటుంది. గునుగు, తంగేడుపువ్వులతో కొప్పురం రూపంలో పూలబతుకమ్మను పేర్చి, శిఖరం లేదా సిగమీద గుమ్మడి పువ్వుంచి, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. పూజపువ్వులను తొక్కుట్లవెయ్యని ఆచారమే బతుకమ్మలను నీళ్ళలో వదిలే సంప్రదాయమైంది.

సాధారణంగా  హిందువులు ఆచరించే పండుగలన్నిట్లో అటు సామాజిక ఇటు శాస్త్రీయ కోణాలు దర్శనిమిస్తాయి. అంతర్లీనంగా సమాజానికి తమ కర్తవ్యాన్ని గుర్తుకు తెస్తాయి. అయితే... బతుకమ్మ పండగకు ప్రకృతి రమణీయతకు విడదీయరాని అనుబంధం ఉందనేందుకు నిదర్శనంగా బతుకమ్మలను ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలు, ఆకులతో ఆకర్షణీయంగా తయారు చేసి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకుంటుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు ‘బొడ్డెమ్మ‘ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు.

బతుకమ్మ ఎలా పుట్టింది?
జానపదులు తమకు సంతు కలగాలని,  పుట్టిన పిల్లలను చల్లగా చూడమని అమ్మదేవతల ముందు కట్టిన ముడుపులు, మొక్కులు చెల్లించుకుంటారు. కొంతమంది పుట్టిన పిల్లలు పుట్టినట్లు చనిపోతుంటే, పిల్లలు పుట్టిన వెంటనే పెంట మీద వేసి తెచ్చుకుని ‘పెంటమ్మ లేదా పెంటయ్య’ అని పేరు పెట్టుకుంటారు. మరి కొందరు పుట్టినపిల్లల్ని ఎవరికైనా ఇచ్చి ‘బిచ్చంగా’ తిరిగియ్యమని కోరుకుంటారు. అట్లా తీసుకున్న పిల్లలకు ‘భిక్షపతి, భిక్షమ్మ’లని పేరు పెట్టుకుంటారు. వాళ్ళే బుచ్చపతి, బుచ్చమ్మలుగా పిలువబడు తుంటారు. ఇట్లాంటి సందర్భాల్లోనే బతుకనిపిల్ల బారెడనే సామెతలు పుట్టాయి. పిల్లల్ని బతికించమనే వేడుకునే దేవతల్లో బతుకమ్మ ఒక దేవత. ఆ దేవత వరాన బతికితే బతుకమ్మ, బతుకయ్యలని పేర్లు పెట్టుకుంటారు. ఈ పూలపండుగ బతుకమ్మ ఎంగిలిపూలతో మొదలుపెట్టి సద్దులబతుకమ్మతో ముగిసిపోతుంది. బొడ్డెమ్మ పండుగ నాడు ‘బొడ్డెమ్మ బొడ్డెమ్మా వలలో, బిడ్డాలెందారే.. వలలో’ అని పాడే పాట సంతానం గురించే కదా. నాటి రోజుల్లో నీళ్ళాడే(ప్రసవ)సమయాల్లో శిశుమరణాలు జాస్తిగా వుండేవి. నీటిరేవులే ఆనాటి తల్లులకు ప్రసూతిస్థలాలు. నీళ్ళల్లో ప్రసవించే సమయంలో తల్లులు తమ సంతు బతికినందుకు ప్రతీకగా నీటివారన పెరిగే తంగేడు, గునుగు పూలముద్దలను నిమజ్జనం చేసి వుంటారు. ఆ తల్లుల ఆచారమే బతుకమ్మపండుగగా మారివుంటుంది. ఇది తెలంగాణా ప్రాంతానికే చెందడం మన గొప్ప సంస్కృతికి సాక్ష్యం. కూష్మాండినికి ప్రతీకగా గుమ్మడిపువ్వును పూజించే ఆచారమే బతుకమ్మగా మారిందని కొందరి అభిప్రాయం. 

బతుకమ్మ వెనుక బౌద్ధం?
బతుకమ్మల తయారీలో చాలా భేదాలు కనిపిస్తాయి. బతుకమ్మలు స్తూపాల ఆకారంలో వుంటాయి. లింగాల తయారీలో కూడా ఇటువంటి సంప్రదాయముందని చాలాచోట్ల చెప్పబడింది. పూర్వం బౌద్ధులు తమ ఆరాధనలో భాగంగా చేసుకున్న స్తూపాలను పూలు, మట్టి, ఇసుక, పేడ, రాయి, ఇటుకలతో తయారు చేసుకునేవారు. బౌద్ధభిక్షుకులు నిరంతరం ప్రయాణిస్తుండడం వల్ల స్తూపారాధనకు తమకు దొరికిన వాటినే స్తూపాలుగా చేసుకుని బుద్దునికి ప్రతీకగా నమస్కరించేవారు. పూలు, ఇసుక, మట్టి, పేడ స్తూపాలను నీటిలో కలిపేసేవారు మర్యాదగా. వాళ్ళు తిరుగాడిన ప్రదేశాల్లోని ఎన్నో వాగులు, ప్రవాహాలు భిక్కేరులుగా పిలువబడుతున్నది ఒక్క తెలంగాణలోనే. అందువల్లనే తొలుత బౌద్ధులైన గిరిజనులు, వనజనులు ఈ ఆచారాన్ని కొనసాగించి వుంటారు. దానికి వారి కోరికలు మన్నించిన అమ్మదేవతకు ప్రతీకగా తర్వాత చేసుకుని వుంటారు. పిదప కాలాల్లో వచ్చిన మతపరిణామాలవల్ల ఈ దేవతలను తమ తమ మతదేవతలు గా చేసుకున్నారు. ఆ దేవతలే బౌద్ధంలో హారీతిగా, జైనంలో ఆమ్రకూష్మాండినిగా, హిందూమతంలో అంబికగా పూజింపబడ్డారు. తెలంగాణాలో అతిప్రాచీనమైన అమ్మదేవతల ఆరాధనమే తల్లులరూపంలో ఏ దేవత వచ్చినా తమదేవతల్లో కలుపుకున్న సంప్రదాయమే బతుకమ్మజాతరగా నిలిచిపోయింది. దసరాపండుగతో బతుకమ్మను కలుపడం, అమ్మదేవతలను కాకుండా పితృదేవతలను పూజించే ఆచారంగా మారడం ‘పెత్రామాస’(పితృ అమావాస్య) ను ఈ పండుగలో చేర్చడం తర్వాతి కాలాల్లో వచ్చిన పరిణామమే.

ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. అలాగే జొన్న పంట కోతకు సిధ్ధంగా తలలూపుతూ ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని రంగు రంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక 
తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు.. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. పాటల వెనుక ఉండే మర్మం ఇదే..

–శ్రీకాంత్‌ శర్మ, 
హిందూ ధర్మచక్రం

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top