చీకటిని జయించిన విజయగానం | singer vaikom vijayalakshmi journey of success story | Sakshi
Sakshi News home page

చీకటిని జయించిన విజయగానం

Jul 21 2026 6:35 AM | Updated on Jul 21 2026 11:54 AM

singer vaikom vijayalakshmi journey of success story

న్యూస్‌మేకర్‌

కళ్లు లేకపోవడం శాపం కాదు, చూసే మనసు లేకపోవడమే అతి పెద్ద లోపం అని నిరూపించింది ఆ గొంతు. ప్రపంచాన్ని చూసే భాగ్యం ఆ కళ్లకు లేదు, కానీ తన అసాధారణ పాటతో ప్రపంచం తన వైపు చూసేలా చేసింది. మలయాళ చిత్రం ‘ఏ.ఆర్‌.ఎం’లో పాడిన అద్భుతమైన జోలపాటకు ‘జాతీయ ఉత్తమ గాయని’గా నిలిచిన వైకోమ్‌ విజయలక్ష్మి ప్రస్థానం అవార్డులకే పరిమితం కాని సుదీర్ఘ ఆత్మగౌరవ పోరాటం!

‘కె.జె.ఏసుదాస్‌ గారు ఎక్కడ ఉన్నా నాకు ఫోన్‌ చేయక మానరు. ఆయనే నాకు ఎన్నో సంగీత మెళకువలు నేర్పిన గురువు’ అంటారు వైకోమ్‌ విజయలక్ష్మి. 
‘చూపు లేని నాకు ఎస్‌.జానకి, వాణి జయరామ్‌ వంటి గాయనులే సంగీత సరస్వతులుగా కనిపించారు. వారి పాటలు వినే పాడటం నేర్చుకున్నాను’ అంటారామె.

అంధులు గాయనీమణులుగా రాణించడం మనకు తెలిసిందే. కాని జాతీయగాయనిగా అవార్డు పొందడం మాత్రం విజయలక్ష్మికే సాధ్యమైంది. చూపు లేకపోయినా సినీ సంగీతంలో సంగీత దర్శకుడిగా రవీంద్ర జైన్‌ ఎన్నో విజయాలు సాధించారు. గాయనిగా వైకోమ్‌ విజయలక్ష్మి  ‘ఏ.ఆర్‌.ఎం’ సినిమాలో ‘అంగు వాన కోనిలు’ అనే గొప్ప పాట పాడి నేషనల్‌ అవార్డు పొందారు. టివోలి థామస్‌ ఈ సినిమా హీరో.

తోడుగా నిలిచిన తండ్రి... కేరళలోని కొట్టాయం జిల్లా వైకోమ్‌లో 1981 విజయదశమి నాడు మురళీధరన్, విమల దంపతులకు విజయలక్ష్మి జన్మించారు. పండుగరోజే పుట్టినా ఆ దంపతుల ఆనందం ఎంతోకాలం నిలవలేదు. పుట్టుకతోనే మెదడు నరాల బలహీనత కారణంగా ఆమెకు చూపు రాదని డాక్టర్లు తేల్చేశారు. ఆ సమయంలో మురళీధరన్‌ది మద్రాస్‌లో (చెన్నై) ఎలక్ట్రానిక్స్‌ వ్యాపారం. అయితే ఐదేళ్ల వయసుకే రేడియోలో వచ్చే ఇళయరాజా, ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ల తమిళ పాటలను విని, అచ్చు గుద్దినట్టు హమ్‌ చేస్తున్న కూతురిని చూసి వ్యాపారాన్ని పక్కనబెట్టి, ఆమెకు సంగీతమే సర్వస్వం చేయాలని నిశ్చయించుకుని సొంత ఊరు వైకోమ్‌ తిరిగి వచ్చేశారు. 

గాయత్రి వీణలో మేటి... విజయలక్ష్మికి చూపు లేని కారణంగా పాఠశాల విద్య, సాంప్రదాయ అక్షరాస్యత సాధ్యపడలేదు. కానీ వినికిడి శక్తితో దాదాపు 100కు పైగా రాగాలను గురువు లేకుండా సొంతంగా నేర్చుకుంది. కూతురి ప్రతిభకు ఎలక్ట్రానిక్స్‌ రంగంలో తనకున్న అనుభవాన్ని జోడించిన మురళీధరన్‌ ఒక సాధారణ ‘తంబురా’ వాయిద్యాన్ని ఎలక్ట్రికల్‌ పద్ధతిలో మోడిఫై చేసి, కేవలం సింగిల్‌ స్ట్రింగ్‌ ఉండేలా  డిజైన్‌ చేశారు. దీని శబ్దానికి ముగ్ధుడైన వయోలిన్‌ విద్వాంసుడు కున్నకుడి వైద్యనాథన్‌ దీనికి ‘గాయత్రీ వీణ’ అని నామకరణం చేశారు. ఈ ఇన్‌స్ట్రుమెంట్‌తో నిరంతరాయంగా 24 గంటల పాటు 67 పాటలు వాయించి విజయలక్ష్మి ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌’ను సొంతం చేసుకున్నారు.

రికార్డింగ్‌ రూమ్‌ సవాళ్లు... సంగీత కచేరీలతో గుర్తింపు వచ్చినా సినిమా రంగంలోకి రావడం విజయలక్ష్మికి అంత సులువు కాలేదు. ‘కళ్లు లేని ఈమె రికార్డింగ్‌ థియేటర్‌లో మైక్‌ ముందు ఎలా నిలబడుతుంది?’ అంటూ ఎన్నో ఆడియో స్టూడియోల నుంచి తిరస్కరణలు, అవమానాలు ఎదురయ్యాయి. చివరకు 2013లో మలయాళ దర్శకుడు కమల్‌ తన ‘సెల్యులాయిడ్‌’ చిత్రంలో ‘కాట్టే కాట్టే’పాటతో ఆమెకు మొదటి బ్రేక్‌ ఇచ్చారు. ఆ మొదటి పాటకే ఆమెకు కేరళ స్టేట్‌ అవార్డ్‌ దక్కింది. అయితే బ్లైండ్‌ సింగర్‌గా రికార్డింగ్స్‌ చేయడం ఒక పెద్ద యుద్ధం. కంపోజర్‌ ట్యూన్‌ వినిపిస్తే, దాన్ని క్షణాల్లో మైండ్‌లో రికార్డ్‌ చేసుకోవాలి. మలయాళం కాకుండా తెలుగు, తమిళం భాషల్లో పాడేటప్పుడు పదాల ఉచ్చారణ మరింత కష్టమయ్యేది. ఒకవైపు హెడ్‌ఫోన్స్ లో మ్యూజిక్‌ ట్రాక్‌ రన్‌ అవుతుంటే, లయ తప్పకుండా, శృతి జారకుండా ఒకే టేక్‌లో పాడటం విజయలక్ష్మి అసాధారణ శైలి.

‘పాట కావాలా? పెళ్లి కావాలా?’ శారీరక లోపాలున్న మహిళలను కట్టుబాట్ల పేరుతో అణచివేయాలని చూసే వారికి విజయలక్ష్మి జీవితం ఒక గుణపాఠం. 2016లో ఒక ఎన్నారైతో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం కాగానే ఆ వ్యక్తి ఆమెపై ఆంక్షలు విధించాడు. ‘నువ్వు స్టేజ్‌ షోలు ఆపేయాలి, సంగీతానికి దూరంగా ఇంట్లోనే ఉండాలి’ అని కండిషన్‌ పెట్టాడు. విజయలక్ష్మి వెనక్కి తగ్గలేదు. ‘నా శ్వాస లాంటి సంగీతాన్ని వదులుకుని నేను బతకలేను’ అంటూ ఆ పెళ్లిని అక్కడికక్కడే రద్దు చేసుకుంటున్నట్లు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ప్రకటించింది. ఆ తర్వాత 2018లో అనూప్‌ అనే సంగీత ప్రియుడిని వివాహం చేసుకున్నప్పటికీ మనస్పర్థల వల్ల 2021లో విడాకులు తీసుకుని ఒంటరిగానే సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

పురుషాధిక్య సమాజపు ఆంక్షలను ధిక్కరించి, ఆత్మగౌరవాన్ని గెలిపించుకున్న ఆ నిర్ణయమే ఈ రోజు ఆమెను దేశంలోనే అత్యున్నత జాతీయ అవార్డు వేదికపై విజేతగా నిలబెట్టింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement