33 ఏళ్ల తర్వాత బాద్‌షాకు ఆదాబ్‌..! | Shah Rukh Khan wins his first National Film Award | Sakshi
Sakshi News home page

33 ఏళ్ల తర్వాత బాద్‌షాకు ఆదాబ్‌..!

Aug 2 2025 10:09 AM | Updated on Aug 2 2025 10:39 AM

Shah Rukh Khan wins his first National Film Award

ముప్పై మూడు ఏళ్ల సుదీర్ఘ నటనానుభవం తర్వాత షారుక్‌ ఖాన్‌ను భారత ప్రభుత్వం ఉత్తమ నటుడిగా గుర్తించింది. ‘దీవానా’ (1992) నుంచి షారుక్‌ ఖాన్‌ బాలీవుడ్‌లో ప్రవేశించి ‘కింగ్‌ ఖాన్‌’గా ప్రేక్షకుల అభిమానం పొందుతూ, దేశ విదేశాల్లో ఎన్నో అవార్డులు పొందుతున్నా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు మాత్రం రాలేదు. 

ఇన్నాళ్ల తర్వాత అదీ మన సౌత్‌ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటించిన ‘జవాన్‌’ సినిమాకు వరించింది. అయితే అది కూడా పూర్తి అవార్డు కాదు. సగమే. మరో సగాన్ని యువ నటుడు విక్రాంత్‌ మాసేతో (ట్వల్త్‌ ఫెయిల్‌ సినిమాకు) పంచుకోవాలి. అంటే ఈసారి ఉత్తమ నటుడు పురస్కారాన్ని ఇద్దరు నటులకు ప్రకటించారు. 

సినిమా రంగంలో ఎటువంటి ఘరానా వంశాల మద్దతు లేకపోయినా ఢిల్లీ నుంచి మధ్యతరగతి యువకుడిగా వచ్చి జెండా ఎగుర వేసిన వాడు షారుక్‌. తనతరం హీరోలు ఆమిర్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్‌లతో పోటీ పడి తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. వేగమైన శరీర కదలికలు, వినూత్నమైన డైలాగ్‌ డెలివరీ, అల్లరి చిల్లరిగా కనిపిస్తూనే లోతైన భావాలు పలికించడం ప్రత్యేకతగా షారుక్‌ ప్రేక్షకులకు నచ్చాడు. ‘బాజీగర్‌’, ‘డర్‌’ సినిమాల్లో నెగెటివ్‌ కేరెక్టర్లు వేసినా యువత అతణ్ణి హీరోగానే చూసింది. 

ఆ తర్వాత ‘దిల్‌ వాలే దుల్హనియా లేజాయేంగే’ (1995)తో పూర్తి సూపర్‌స్టార్‌గా అవతరించాడు. ‘పర్‌దేశ్‌’, ‘దిల్‌తో పాగల్‌ హై’, ‘దిల్‌ సే’, ‘కభీ ఖుషీ కభీ గమ్‌’.. అన్నీ హిట్‌గా నిలిచాయ్‌. దర్శకుడు కరణ్‌ జొహర్, జూహీ చావ్లాలతో చాలా హిట్స్‌ సాధించాడు షారుక్‌. దిలీప్‌ నటించిన ‘దేవదాసు’ పాత్రను మళ్లీ పోషించి మెప్పించాడు. 

‘కల్‌ హోనా హో’, ‘వీర్‌జారా’, ‘చక్‌దే ఇండియా’ వంటి సినిమాలు అతడి ప్రతిభను పదేపదే నిరూపించాయి. స్టార్‌గా ఉండి కూడా ‘మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌’ లో బుద్ధిమాంద్యం ఉన్న హీరోగా నటించాడు. ‘ఓమ్‌ శాంతి ఓమ్‌’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ సినిమాలు ఆబాలగోపాలాన్ని అలరించాయి. షారుక్‌కు ఉత్తమ నటుడు అవార్డు తెచ్చిన ‘జవాన్‌’ను 300 కోట్లతో నిర్మిస్తే 1100 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ షారుక్‌ బాలీవుడ్‌ కా బాద్‌షాగానే కొనసాగుతున్నాడు. 

(చదవండి: స్త్రీ వాణి రాణించింది..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement