Schools Of Solapur District Will Plant Trees Under AP CM YS Jagan Oxygen Park - Sakshi
Sakshi News home page

సీఎం జగన్ స్పూర్తిగా.. మహారాష్ట్రలో లక్షా 11వేల మొక్కలు నాటే కార్యక్రమం

Published Mon, Jul 10 2023 12:10 PM

Schools Of Solapur District Will Plant Trees Under AP CM YS Jagan Oxygen Park - Sakshi

సాక్షి, షోలాపూర్ : మన రాష్ట్రం కాదు, మన భాష కాదు.. అయినా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ అంటే వారికి ఎంతో ఇష్టం. సీఎం జగన్ ను ముద్దుగా దాదా అని పిలుచుకునే షోలాపూర్ వాసులు.. ఈ వర్షాకాలం పురస్కరించుకుని భారీ ఎత్తున చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి పేరు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేరిట దాదాశ్రీ ఫౌండేషన్‌ వీఈటీ తరపున మహారాష్ట్ర షోలాపూర్‌ జిల్లాలోని 11 తాలూకాలోని అన్ని గ్రామాల్లో, పాఠశాలల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (దాదాశ్రీ) ఆక్సిజన్ పార్క్ ప్రచారం ద్వారా మొక్కలు నాటుతున్నారు. 


ఏకలవ్య అభిమాని కాకా సాహెబ్

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి మీడియాలో చదివి అభిమానిగా మారిపోయారు షోలాపూర్ రైతు కాకాసాహెబ్‌ లక్ష్మణ్‌ కాక్డే. ఈ ఏడాది ఏప్రిల్ లో మండుటెండలు లెక్క చేయకుండా.. షోలాపూర్ నుంచి విజయవాడ, తాడేపల్లి వరకు సైకిల్ పై వచ్చి మరీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. అదే అభిమానంతో ఇప్పుడు ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో చేపట్టారు.


(చదవండి : ఇది కదా అభిమానం అంటే.. మహారాష్ట్ర నుంచి విజయవాడకు సైకిల్ పై)

సీఎం జగన్ .. యువతరానికి స్పూర్తి

ఒక మంచి కార్యక్రమానికి పరిధి ఏముంటుంది? సమాజానికి హితం చేసే పనులు ఎవరు చేపట్టినా సంతోషమే... ఇది కాకాసాహెబ్‌ లక్ష్మణ్‌ కాక్డే ఆలోచన. తన అభిమాన నాయకుడు సీఎం జగన్ కోసం.. అలాగే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సమాజానికి తన వంతుగా మేలు చేయాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. షోలాపూర్ జిల్లాలో దాదాపు 4800 పాఠశాలలున్నాయి. ప్రతి పాఠశాలలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. మొత్తం  లక్షా 11 వేల 111 మొక్కలు నాటనున్నారు.


ఉద్యమంలా మొక్కల పెంపకం

ఈ కార్యక్రమాన్ని ఐఏఎస్ అధికారి బాలాజీ మంజులే ప్రారంభించారు. కాకాసాహెబ్‌ లక్ష్మణ్‌ కాక్డే  నేతృత్వంలోని సీఎం జగన్ దాదాశ్రీ ఫౌండేషన్‌ అభినందనీయమని, మొక్కల పెంపకం ఒక ఉద్యమంలా సాగాలని, దీని వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని బాలాజీ మంజులే అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి  కర్మల తహసీల్దార్‌ విజయ్‌ జాదవ్‌ సాహెబ్‌, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు బిభీషన్‌ అవతే, వ్యవసాయోత్పత్తి కమిటీ డైరెక్టర్ ఆనంద్ కుమార్ ధేరే సహా పలువురు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement