Womens World Boxing Championships 2023: ప్రపంచాన్ని గెలిచిన మన బంగారాలు

Saweety, Nitu, Nikhat and Lovlina clinch historic gold medals at Womens World Boxing Championships - Sakshi

ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌(ఐబీఏ) న్యూదిల్లీలో (మార్చి15–మార్చి26) నిర్వహించిన ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్‌ జరీన్‌ (50 కేజీల విభాగం), స్వీటీ బూరా (81 కేజీల విభాగం), లవ్లీనా (75 కేజీల విభాగం), నీతూ గంగాస్‌ (48 కేజీల విభాగం) స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. నిఖత్‌ నుంచి నీతూ వరకు ఎవరిదీ నల్లేరు మీద నడక కాదు. అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. వాటికి దీటుగా పంచ్‌లు ఇచ్చి తమను తాము నిరూపించుకున్న ఈ స్వర్ణవిజేతలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు...

నిఖత్‌ జరీన్‌: పదమూడేళ్ల వయసులోనే బాక్సింగ్‌ బరిలోకి దిగింది తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌కు చెందిన నిఖత్‌ జరీన్‌. నిఖత్‌లోని ప్రతిభ సంగతి పక్కనపెట్టి ‘మగరాయుడిలా ఈ ఆటలు ఏమిటి’ అన్న వాళ్లే ఎక్కువ. ‘ఎందుకొచ్చిన తలనొప్పి’ అని ఆమె తండ్రి నిఖత్‌ను ఆట మానిపించి ఉంటే విశ్వ విజేతగా నిఖత్‌ను చూసేవాళ్లం కాదు. రింగ్‌లో ఒత్తిడి ఎదురైతే బిత్తరపోయే రకం కాదు నిఖత్‌. ఆ ఒత్తిడినే బలంగా చేసుకునే నైజం ఆమెది.

ఆటకు సంబంధించిన వ్యూహాల పైనే కాదు ఆహార నియమాల విషయంలోనూ దృష్టి సారించే నిఖత్‌ ప్రతికూల వ్యాఖ్యల గురించి పట్టించుకోలేదు. ఆటలో వ్యూహ ప్రతివ్యూహాలపైనే తన ఆసక్తి. వరుసగా రెండో ఏడాది ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌గా నిలిచి తన ప్రత్యేకత చాటుకుంది నిఖత్‌. మేరీ కోమ్‌ తరువాత ఒకటి కంటె ఎక్కువ స్వర్ణాలు గెలిచిన బాక్సర్‌గా నిలిచింది. పోరాటమే తన మార్గం. బలం.

స్వీటీ బురా: హరియాణాలోని హిసార గ్రామీణ ప్రాంతానికి చెందిన స్వీటీ బురా తండ్రి మహేంద్రసింగ్‌ ఒకప్పటి బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌. తండ్రి ప్రభావంతో ఆటలపై స్వీటిలో ఆసక్తి మొదలైంది. బాక్సింగ్‌లో ఓనమాలు నేర్చుకోవడానికి  ముందు స్వీటీ రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్‌. కబడ్డీలో స్వీటీ దూకుడు చూసి తండ్రితో సహా చాలామంది ‘ఈ అమ్మాయికి బాక్సింగ్‌ అయితే కరెక్ట్‌’ అనుకున్నారు. తండ్రి సూచనతో బాక్సింగ్‌ వైపు వచ్చింది స్వీటీ. ఒక ఆటలో ‘సూపర్‌’ అనిపించుకున్నవారికి కొత్తగా వేరే ఆటలోకి వెళ్లి నిరూపించుకోవడం అంత సులువైన విషయం ఏమీ కాదు.

స్వీటీ బడ్డింగ్‌ బాక్సర్‌గా ఉన్నప్పుడు తనకు పెద్దగా సౌకర్యాలు ఉండేవి కావు. ఎక్కడైనా ఖాళీ స్థానం కనిపిస్తే కోచ్‌ అక్కడ శిక్షణ ఇచ్చేవాడు. పొలం భూముల్లో నేర్చుకున్నామా, పట్టణంలోని ప్రసిద్ధ కోచింగ్‌ సెంటర్‌లో నేర్చుకున్నామా అనేదాన్ని స్వీటీ ఎప్పుడూ మనసు మీదికి తీసుకోలేదు. గురువు చెప్పినదానికి తనదైన వ్యూహాన్ని జోడించి ఆటలో రాణించేది. ఒకసారి బాక్సింగ్‌ రింగ్‌లో ఉన్నప్పుడు స్వీటీకి ప్రత్యర్థి గట్టి పంచ్‌ ఇచ్చింది.

‘చుక్కలు కనిపించి ఉంటాయి నీకు’ అని తమ్ముడు అరిచాడు. అతను ఎగతాళిగా అన్నాడా, వ్యూహాత్మకంగా అన్నాడా అనేది వేరే విషయంగానీ తమ్ముడు చేసిన కామెంట్‌తో స్వీటీకి బాగా కోపం వచ్చింది. ఆ కోపం బలంగా మారి ప్రత్యర్థికి చుక్కలు చూపించింది! స్వీటీ పంచింగ్‌ గ్రామర్‌ను చూసి ప్రేక్షకులు వేనోళ్ల పొగిడారు. ఆ విజయంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్‌లో స్వీటీ విజయపరంపర కొనసాగుతూనే ఉంది. ‘ఆట అనేది నా రక్తంలోనే ఉంది’ అని సగర్వంగా చెప్పే స్వీటీ బురాకు రాబోయే ఒలింపిక్స్‌ అనేది లక్ష్యం.

నీతూ గంగాస్‌: హరియాణా రాష్ట్రంలోని బివానీ జిల్లాలోని ఒక గ్రామంలో పుట్టింది నీతూ గంగాస్‌. తల్లి మాటల్లో చెప్పాలంటే చిన్నప్పుడు నీతూ చిలిపి అమ్మాయి. స్కూల్లో తగాదాలు, ఫైట్లు! బాక్సింగ్‌లో ఓనమాలు తెలియకపోయినా ప్రత్యర్థులకు బాక్సర్‌లా పంచ్‌లు ఇచ్చేది. ఇది చూసిన తండ్రి జై భగవాన్‌ కుమార్తెకు బాక్సింగ్‌లో శిక్షణ ఇప్పించడం ప్రారంభించాడు. అప్పుడు నీతూ వయసు 12 సంవత్సరాలు. శిక్షణ తీసుకుంటోందన్న మాటేగానీ బాక్సింగ్‌లో ఎలాంటి ప్రతిభా చూపేది కాదు.

ఎప్పుడూ ఎవరో ఒకరి చేతిలో ఓడిపోతూనే ఉండేది. ఒకరోజు ‘ఇక నా వల్ల కాదు నాన్నా. నాకు బాక్సింగ్‌ వద్దు’ అని ధైర్యంగా తండ్రితో చెప్పింది. ‘అలాగే తల్లీ’ అని ఆయన అని ఉంటే కొత్త చరిత్ర ఆవిష్కరణ అయ్యేది కాదు. కుమార్తెను బాక్సర్‌గా తీర్చిదిద్దడం కోసం చేస్తున్న  ఉద్యోగానికి సెలవు(నాన్‌–పెయిడ్‌ లివ్‌) పెట్టి మరీ కుమార్తె ట్రైనింగ్‌ నుంచి డైట్‌ వరకు దగ్గరుండి పర్యవేక్షించాడు.

కొంతకాలం తరువాత ప్రసిద్ధ బాక్సింగ్‌ కోచ్, బివానీ బాక్సింగ్‌ క్లబ్‌ (బీబీసి) వ్యవస్థాపకుడు జగ్‌దీష్‌ సింగ్‌ దృష్టిలో పడింది నీతూ. ‘బీబీసి’లో చేరడం నీతూకు టర్నింగ్‌ పాయింట్‌గా మారింది. నిజంగా చెప్పాలంటే అసలు సిసలు శిక్షణ అప్పుడే  మొదలైంది. బాక్సింగ్‌లోని మెలకువలను ఔపోసన పట్టి రింగ్‌లో ప్రత్యర్థులను మట్టి కరిపించడం ప్రారంభించింది. గత సంవత్సరం కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో బంగారు పతకం గెలుచుకొని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది నీతూ.

లవ్లీనా బోర్గో హెయిన్‌: అస్సాంలోని గోలగాట్‌ జిల్లాకు చెందిన టికెన్‌ బోర్గోహెయిన్‌ చిన్న వ్యాపారి. ‘పాపం ఈయనకు ముగ్గురూ ఆడపిల్లలే’ అని ఎప్పుడూ ఎవరో ఒకరు అకారణ సానుభూతి చూపుతుండేవారు. ముగ్గురు కుమార్తెలలో చిన్న అమ్మాయి లవ్లీనా బోర్గో హెయిన్‌ అక్కలను స్ఫూర్తిగా తీసుకొని బాక్సింగ్‌ నేర్చుకుంది. ‘మనకెందుకు బాక్సింగ్‌’ అని తల్లిదండ్రులు ఎప్పుడూ అనలేదు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చిన్న కుమార్తెను బాక్సింగ్‌ ఛాంపియన్‌గా చూడాలని కలులు కనేవాడు తండ్రి.

2018, 2019 ఉమెన్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు గెలుచుకొని తల్లిదండ్రుల కళ్లలో వెలుగులు నింపింది లవ్లీనా. గత సంవత్సరం ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలుచుకుంది. అంతర్జాతీయ స్థాయిలో బాక్సర్‌గా పేరు తెచ్చుకున్నా తన మూలాలు మరిచిపోలేదు లవ్లీనా. ఇప్పటికీ తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తుంటుంది. పాదాలెప్పుడూ నేల మీదే ఉండాలనేది తన సిద్ధాంతం. 2020 ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకుంది లవ్లీనా.  ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుచుకోవాలనేది తన కల.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top