గద్దెలే గర్భగుడులుగా..గిరిజనులే పూజారులుగా..వెదురుకర్రలే ఉత్సవమూర్తులుగా..కుంకుమ భరిణెలే అమ్మల ప్రతిరూపాలుగా..బెల్లమే నిలువెత్తు బంగారంగా... ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే వనదేవతల పండుగే మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన మేడారం మాఘశుద్ధ పౌర్ణమి వచ్చిందంటే జనారణ్యంగా మారుతుంది. ‘జంపన్న వాగులో తడవని వ్యక్తి.. సమ్మక్క, సారలమ్మ జాతరకు పోయిరాని ఊరు’ ఉండదంటే అతిశయోక్తి కాదు.. కొండకోనల నడుమ ఓ మారుమూల గ్రామంలో జరిగే జాతరకు ఇంత ఖ్యాతి రావడానికి వెనుక వందల ఏళ్ల నాటి చరిత్ర, లక్షలాది మంది భక్తుల నమ్మకం దాగి ఉంది.
వీరత్వానికి ప్రతీకలు..
సమ్మక్క– సారలమ్మలు ధీర వనితలు.. 800 ఏళ్ల క్రితమే నారీభేరి మోగించిన వీరత్వానికి ప్రతీకలు. నమ్మిన జనం కోసం, నమ్ముకున్న విలువల కోసం, జాతి ఆత్మాభిమానం కోసం కాకతీయ సేనలకు ఎదురొడ్డి నిలిచారు. అపార పోరాట పటిమను ప్రదర్శించారు. ప్రాణాలు త్వజించి అందరి హృదయాల్లో నిలిచారు. మట్టిలో కలిసిపోయి పుడమితల్లిని పుణ్యభూమిగా మార్చారు. అయిన వారి కోసం అసువులు బాసి దేవతలయ్యారు. కాలక్రమేణా అందరికీ అమ్మలయ్యారు. అందుకే ఆదివాసీలు ఆ తల్లులకు గుండెల్లో గుడి కట్టారు. రెండేళ్లకోసారి జాతర నిర్వహిస్తూ వారి త్యాగనిరతిని గుర్తు తెచ్చుకుంటారు.
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతి గాంచిన ఈ జాతరకు కోటి మంది భక్తులు తరలివస్తారు.. అమ్మల ఆశీర్వాదాలు అందుకుంటారు.. భక్తి పారవశ్యంలో మునిగితేలుతారు. మేడారం మహా జాతరలో నెలలు నిండిన గర్భిణులూ అమ్మవార్లను దర్శించుకునే సంప్రదాయం ఉంది. ఆడపిల్లలు జన్మిస్తే సమ్మక్క లేదా సారలమ్మ అని, అబ్బాయి పుడితే జంపన్న అనే పేర్లు పెట్టుకొని కన్నవారు మురిసిపోవడం ఆనవాయితీగా వస్తోంది. జాతరకు అన్ని సమయాల్లోనూ మహిళలూ రావొచ్చు.
నాలుగు రోజుల వైభవం
జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దె పైకి తీసుకొస్తారు. రెండో రోజు చిలుకల గుట్టలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. వీరిని తీసుకొచ్చే సమయంలో భక్తులు పూనకంతో ఊగి΄ోతారు. మూడో రోజు అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువుదీరి భక్తుల పూజలందుకుంటారు. నాలుగవ రోజు సాయంత్రం వన ప్రవేశం చేస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. ఇంతితై.. వటుడింతై అన్నట్లు.. మేడారం నిత్య నూతనమై అమ్మల ఆశీర్వాదంతో దేదీప్య మానంగా కాంతులీనుతోంది.
హైద్రాబాద్ నుంచి మేడారం 245 కి.మీ. కారులో వెళ్లేవారికి 5.20 గంటల సమయం పడుతుంది. ఎన్‌హెచ్ –163 రహదారి పై ప్రయణించే భక్తులు హైద్రాబాద్, యాదగిరిగుట్ట, జనగామ, రఘునాథపల్లి, కరుణాపురం, కాజీపేట, ఆత్మకూరు, మల్లంపల్లి, ములుగు, జంగాలపల్లి, చల్వాయి, పస్రా, నార్లాపూర్‌ల మీదుగా మేడారం చేరుకోవాలి.
ఈ రోడ్డు పై పెంబర్తి శివారులో 90 – 90.5 కి.మీలు, వీఓ హోటల్ నుంచి అక్షయ హోటల్ 9.5–94 కి.మీలలో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి.
జనగామ – నెల్లుట్ల మధ్యలో రోడ్డు దాటేందుకు ఇబ్బందులు తప్పవు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై పలువురు చనిపోయారు. పెంబర్తి, నిడిగొండ, యశ్వంతపూర్, రాఘవపూర్, చాగళ్లు, పెండ్యాల అండన్‌పాస్‌లు లేక΄ోవడంతో జాతీయ రహదారి దాటేందుకు ఇబ్బందులు తప్పవు.
నెల్లుట్ల బైపాస్ రోడ్డు ఆర్టీసీ కాలనీ బ్రిడ్జి, నడిగొండ యూటర్న్, రఘునాథ్‌పల్లి శివారు, చాగళ్లు, స్టేషన్ ఘన్‌పూర్, కరుణాపురం, ధర్మసాగర్ మండల రాంపూర్ క్రాస్ రోడ్డు, మడికొండ కందాల దాబా, కాజీపేట డీజిల్ కాలనీ, కాజీపేట నుంచి ఫాతిమా ఫ్లైవర్, సుబేదారి పారెస్టు ఆఫీస్, దామెర మండలం పసరగొండ, ఊరుగొండ శివారు, ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్ రోడ్, కటాక్షపూర్‌లను ‘బ్లాక్‌స్పాట్’లుగా అధికారులు గుర్తించారు.
మల్లంపల్లి, ములుగు, జంగాలపల్లి, చల్వాయి, పస్రా, నార్లాపూర్ మూలమలుపులు ముప్పును అధిగమించితే మేడారం చేరుకున్నట్లే.
హైద్రాబాద్ – వరంగల్ జాతీయ రహదారి పై జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్నపెండ్యాల బస్‌స్టేజీ నుంచి వంగాలపల్లి – కరుణాపురం బస్‌స్టేజీల వరకు మూడు యూటర్న్‌లు ఉన్నాయి
చిన్నపెండ్యాల నుంచి ఘనాపూర్ వెళ్లాల్సిన వాహనాలు గ్రానైట్ సమీపంలో యూటర్న్ తీసుకోవాలి. వాహన చోదకులు తక్కువ దూరంలో దాబా హోటల్ సమీపంలో రాంగ్ రూట్‌లో యూటర్స్ తీసుకుంటున్నారు.
హైద్రాబాద్ టు మేడారం : 3 టోల్ గేట్లు
హైద్రాబాద్ నుంచి మేడారం జాతర వచ్చే ప్రయాణికులు మూడు టోల్‌గేట్లు దాటాలి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమళ్ల వద్ద మరోటి, ములుగు దాటాక జవహర్‌నగర్ వద్ద ఇంకో టోల్‌గేట్ ఉంటుంది. అయితే జాతర జరిగే నాలుగు రోజుల పాటు జవహర్‌నగర్ టోల్ ఎత్తేస్తారు. కరీంనగర్ నుంచి మేడారం 153 కి.మీ
కరీంనగర్, కేశవపట్నం, హుజురాబాద్, కమలాపూర్, రేగొండల మీదుగా ములుగు చేరుకుని వెంకటాపూర్, చల్వాయిల మీదుగా మేడారానికి 3.40 గంటల సమయం పడుతుంది.భూపాలపల్లి నుంచి మేడారం 53.8 కి.మీ.
మల్లంపల్లి, రాంపూర్, దూదేకులపల్లి, బయ్యక్కపేట, తక్కళ్లగూడెం, నార్లాపూర్‌ల మీదుగా 1.10 గంటల నుంచి 1.30 గంటల వ్యవధిలో మేడారం చేరుకోవచ్చు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ సమీపంలోని కొత్తపల్లి వద్ద, కాళేశ్వరం – మహదేవపూర్ మధ్య మూలమలుపు ప్రమాద భరితంగా ఉన్నాయి.
కాళేశ్వరం నుంచి ఇసుక లారీలు ఎక్కువగా 353 సీ జాతీయ రహదారి పై ప్రయాణిస్తాయి. ఒక్కోసారి వీటిని రోడ్డు పక్కనే నిలుపుతారు. వీటివల్ల ప్రమాదాలు జరిగే అస్కారం ఎక్కువ.
భూపాలపల్లి, పరకాల, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ శివారు ్ర΄ాంతాల్లోనూ రహదారి పక్కనే వాహనాలు నిలుపుతున్నారు. వరంగల్ నుంచి మేడారం 95.5 కి.మీ.
ట్రాఫిక్ ఇబ్బందులు లేకుంటే భక్తులు ఎన్‌హెచ్ 163 రహదారి గుండా 2.20 గంటల నుంచి 2.40 గంటల వ్యవధిలో చేరుకోవచ్చు. వరంగల్ నుంచి మేడారం వెళ్లే భక్తులు హనుమకొండ, ఆరెపల్లి, దామెర, ఆత్మకూరు, జవహర్‌నగర్, మచ్చాపూర్, చల్వాయి, గోవిందరావుపేట, రాఘవపట్నం, ఇప్పలగడ్డ, మొట్లగూడెం, వెంగ్లాపూర్, నార్లాపూర్ ద్వారా మేడారం చేరుకుంటారు.
వరంగల్ నుంచి ములుగుకు ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడుపుతోంది. ఇక ట్రావెల్ బస్సులు, కార్లు, ఇతర వాహనాలలో వివిధ ్ర΄ాంతాల నుంచి జనం మేడారం చేరుకుంటాం.
కాజిపేట/వరంగల్ రైల్వే స్టేషన్‌లలో దిగిన భక్తులు ఇక్కడ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మేడారంగద్దెల వరకు చేరుకోవచ్చు.
హనుమకొండ నుంచి మేడారానికి హెలికాఫ్టర్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
మహబూబాబాద్ నుంచి మేడారం 134 కి.మీ
సూర్యపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి నర్సంపేట ద్వారా మేడారం వెళ్లే భక్తులు సొంత వాహనంతో అయితే 134 కిలోమీటర్లు ప్రయాణించాలి. గమ్యస్థానానికి 3.20 గంటల్లో మహబూబాబాద్, గూడూరు, ఖానాపూర్, నర్సంపేట, నల్లబెల్లి, మల్లంపల్లి, జాకారం, ములుగు, జంగాలపల్లి, చల్వాయి, పస్రా, నార్లాపూర్‌ల మీదుగా మేడారం చేరుకోవచ్చు.
నర్సంపేట నుంచి మేడారం వరకు ఈ దారిలో 30 వరకు మూలమలుపులు ఉన్నట్టు ఎన్ హెచ్‌ఏఐ అధికారులు గుర్తించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం మీదుగా మేడారం మహాజాతరకు తెలంగాణ ΄పాటు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల భక్తులు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రై వేటు వాహనాల్లో భారీగా తరలివస్తారు. మహారాష్ట్రంలోని గడ్చిరోలి, గొండియా జిల్లాలు, ఛత్తీస్‌గఢ్ నుంచి భూపాలపట్నం, బీజాపూర్ జిల్లాల భక్తులు, తెలంగాణ నుంచి పూర్వపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, చెన్నూర్‌ల నుంచి ఈ దారిగుండా మేడారం జాతరకు వస్తారు.
ఇతర పర్యాటక ప్రదేశాలు..
ములుగు జిల్లాలోని మేడారం నుంచి 50–60 కిలోమీటర్ల దూరంలో రామప్ప ఆలయం ఉంది. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ చారిత్రక ఆలయం అద్భుతమైన కళా నైపుణ్యంతో విలసిల్లుతుంది. ఈ చారిత్రక ఆలయం ప్రపంచవారసత్వ సంపదగా గుర్తించబడింది. వరంగల్‌లోనే వేయిస్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్‌ను సందర్శించుకోవచ్చు. ములుగు జిల్లాకు 17 కి.మీ దూరంలో లక్నవరం సరస్సు ఉంది.
ఈ సరస్సుపై వేలాడే వంతెనలపై నడుస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. బోటింగ్ సదు΄ాయం కూడా ఉంది. ఇదే జిల్లాలో వాజేడు మండలం చీకుపల్లి సమీపంలో తెలంగాణ నయాగారగా పిలిచే బొగత జలతం ఉంది. వరంగల్ పట్టణానికి 51 కి.మీ దూరంలో భీముని పాదం జలపాతం ఉంటుంది. పాకాల సరస్సు, ఏటూరు నాగారం అభయారణ్యం, పాండవుల గుట్టలు..., ఈ ప్రాంతపు ఆకర్షణీయ పర్యాటక స్థలాలుగా గుర్తింపు పొందాయి.
(చదవండి: ఇంటిపేరే ‘బెంగళూరు’..!)


