గ్రామానికి ఆరు బయట ఉండే నిర్మాణమే బొడ్రాయి. దీనికి దేవాలయం లాంటి ఎలాంటి నిర్మాణం ఉండదు. గ్రామంలో అన్ని వర్ణాల వారూ స్వేచ్ఛగా పూజించుకొనే అవకాశం ఉంటుంది. గ్రామ ప్రజలందరూ కలిసి ఏడాదికి కనీసం ఒకసారైనా బొడ్రాయికి పూజలు, తిరునాళ్ళు జరిపిస్తూ సామూహిక వేడుకలు జరుపుకొంటారు. అయితే బొడ్రాయి అంటే ఏమిటో, ఆ బొడ్రాయికి పూజలు ఎందుకు జరుపుకోవాలో చాలామందికి తెలియకున్నా, పూజలు, తిరునాళ్లు వంటి కార్యక్రమాలను ఎంతో భక్తిశ్రద్ధలతో జరిపిస్తారు.
ఈ నేపథ్యంలో బొడ్రాయిపై అవగాహన కోసం... మన గ్రామీణ సంస్కృతిలో బొడ్రాయికి ఉన్న ప్రాముఖ్యత ఎనలేనిది. బొడ్రాయి అసలు రూపం బొడ్డురాయి. సంస్కృతంలో దీనిని నాభిశిల అంటారు. మానవ శరీరానికి గర్భస్థ పిండ దశ నుండీ రక్షణ, పోషణ తల్లి నాభినుండి ఎలా లభిస్తాయో, గ్రామాని కి రక్షణ, పోషణ సమృద్ధులను ప్రసాదించే తల్లి గనుక ఆ శిలా మాతను బొడ్డురాయి అన్నారు. శరీర మధ్యంలో నాభి అమరి ఉన్నట్లు గ్రామానికి మధ్య లో బొడ్రాయిని స్థాపిస్తారు.
గ్రామ నిర్మా ణం జరుగుతున్న దశలో వాస్తు ప్రకారం పండితులను సంప్రదించి నలు ది క్కులలో గ్రామం ఎలా విస్తరించాలో, అలాగే వాస్తు శాస్త్ర వర్గులను బట్టి కొత్తగా ఏర్పడే గ్రామంలో అన్ని సౌకర్యాలూ అంటే రహదారులు, కూడళ్ళు, బా వులు, చెరువులు, దేవాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, వ్యవసాయ భూములు, వ్యాపార సముదాయాలు, శ్మశాన వాటిక మొదలుగా అన్నిటికీ నిర్దిష్టమైన స్థల నిర్దేశం చేస్తారు. గ్రామ మధ్యంలో, నాలుగు రహదారులు కలిసే చోటులో బొడ్రాయిని ఏవిధంగా ప్రతిష్ఠించాలో కూడా ప్రణాళిక వేసుకొనేవారు.
బొడ్రాయిని ప్రతిష్ఠించే ప్రదేశాన్ని గు ర్తించాక అక్కడ నేలను తవ్వి, శంకుస్థాపన చేసి, మొదట పరమేశ్వరుని అనుగ్రహ శక్తి అయిన శీతలా దేవి చక్రాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసి అందులో స్థాపిస్తారు. దాని పైన నాలుగు పలకలు కలిగిన చతురస్రాకారపు నిర్మాణాన్ని, దానిపైన ఎనిమిది పలకలుగల నిర్మాణాన్ని, ఆ పై భాగాన లింగాకారం కలిగిన శిలను ప్రతిష్ఠిస్తారు.
నాలుగు పలకల నిర్మాణం బ్రహ్మ స్వరూపమని, ఎనిమిది పలకల నిర్మాణం విష్ణు స్వరూపమని, ఆపైన ప్రతిష్ఠించిన లింగాకారపు శిలను శివ స్వరూపమని భావిస్తారు. ఇలా శీతలాదేవి యంత్రం స్త్రీ స్వరూపంగా, ఆ పైన ఉన్న త్రిమూర్త్యాత్మకమైన బొడ్రాయిని పురుష స్వరూపంగా భావిస్తారు. గ్రామానికి పొలిమేరలలో ఎనిమిది మంది అక్కమ్మ దేవతలు అనే స్త్రీ దేవతలకు సంబంధించిన యంత్రాలను కూడా స్థాపిస్తారు. అందువలన గ్రామానికి దుష్ట శక్తులు, చెడు గ్రహాలు, ఆధి వ్యాధుల పీడలు అంటవని విశ్వసిస్తారు.
రహదారుల విస్తరణ సమయంలో కానీ, కాలక్రమేణా బొడ్రాయి రహదారికంటే చాలా దిగువకు కుంగినప్పు డు కానీ, దానిని శాస్త్రోక్తంగా వెలికితీసి పునః ప్రతిష్ఠ చేస్తారు. గ్రామం వాస్తు పురుషుని నాభి స్థానమే బొడ్రాయి. నేల అనే శయ్య పై ఆసీనుడైన బొడ్రాయి రూప పురుషునికి, మా ఇంట నిత్యమూ ధనధాన్య సమృద్ధి ఉండేలా ఆశీర్వదించమని కోరుతూ భక్తితో నమస్కరిస్తున్నాను అనే అర్థం వచ్చే శ్లోకం చదువుకొని బొడ్రాయిని ప్రార్థించుకోవాలన్నది పెద్దల మాట.
నవ వధువులు ఊరిలోకి అడుగు పెట్టినప్పుడు, అలాగే ఊరి నుండి తమ అత్త వారింటికి వెళ్ళేటప్పడు.. తప్పకుండా తొలుత బొడ్రాయికి నమస్కరించి, పసుపు కుంకుమలు, పూలతో బొడ్రాయిని పూజించే సంప్రదాయం ఉంది. అలాగే ఇంటి ఆడ పిల్లలకు వడిబియ్యం పెట్టినప్పుడు బొడ్రాయి వద్ద నమస్కరించి ఆశీస్సులు
కోరే ఆచారమూ ఉంది.
– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి


