Dilip Kumar: మొఘల్‌ ఏ ఆజమ్‌ ఆఖరు సలామ్‌

sakshi special story about legendary actor Mughal E Azam dilip kumar - Sakshi

దిలీప్‌ కుమార్‌ (1922 – 2021)

‘సుహానా సఫర్‌ ఔర్‌ ఏ మౌసమ్‌ హసీ’... అతని సినిమా ప్రయాణం అతి సుందరం.
‘ఏ మేరా దీవానాపన్‌ హై..’ నటన పట్ల అతని ఉన్మత్తతా అతి సుందరం.
‘మధుబన్‌ మే రాధికా నాచెరే’... వెండితెరపై ఆ లీలా వినోదమూ సుందరమే.
‘యూసఫ్‌ ఖాన్‌’ అని తల్లిదండ్రులు పేరు పెట్టారు. జగతి ‘దిలీప్‌ కుమార్‌’ అని పిలుచుకుంది.
భారత ఉపఖండం ఎల్లలు గీసుకొని ఉండొచ్చు. కాని అతణ్ణి అభిమానించడంలో గీతలన్నీ దారులుగా మారడం అతి సుందరం.
కొందరు పట్టాభిషేకం వల్ల చక్రవర్తులు అవుతారు. కొందరు ప్రజల అభిషేకం వల్ల. దిలీప్‌ కుమార్‌ను ‘సినీ మొఘల్‌ ఏ ఆజమ్‌’ అని పూమాల వేసుకోవడం బహు సుందరం.
ట్రాజెడీ కింగ్‌... కామెడీ స్టార్‌... రొమాంటిక్‌ హీరో... మెథడ్‌ యాక్టర్‌... పేర్లు ఏవైనా అతడు పలకడం సుందరం.
మేకప్‌ వేసుకున్న కోహినూర్‌ వ్రజ్రం ఇన్నాళ్లు వెండితెరపై మెరిసి ఇకపై నింగిలో తళుకులీననుంది.

ఖదీర్‌

‘‘జనం ఆకలితో మాడుతుంటే మనం వాళ్లకు దక్కాల్సిన తిండి గింజల్ని రేట్లు పెంచి అమ్ముకుని మన బొక్కసాన్ని నింపుకున్నాం. ఊళ్లో మహమ్మారి కమ్ముకుంటే మనం మందుల్ని దాచిపెట్టి వాటి రేట్లు పెంచేశాం. పోలీసులు దాడి చేస్తారని తెలియగానే అవే మందుల్ని మురుక్కాలవల్లో పారబోశాం. మనిషికి దక్కాల్సిందేదీ మనిషికి దక్కకుండా చేస్తున్నాం’’

– ఫుట్‌పాత్‌ (1953)

‘‘అనార్కలి సమాధి మీద నాలుగు కాళ్లు నిలబెట్టి తప్ప మీ సింహాసనం నిలవదు అని మీరనుకుంటే జహాపనా... ఈ సలీమ్‌ అటువంటి సింహాసనాన్ని ఎప్పటికీ కోరుకోడు’’

– మొఘల్‌ ఏ ఆజమ్‌ (1960)

‘‘ఏదో ఒక ఉపాయం ఆలోచించు దొరబాబూ. ఊళ్లో మీరూ ఉండేలా మేమూ ఉండేలా. యంత్రాలూ పరికరాలతోపాటు మనుషులు కూడా ఉండేలా. అందరం కలిసి బతికే మార్గం ఆలోచించు’’

– నయాదౌర్‌ (1957)

‘‘ఎవడయ్యా ఆ బడుద్దాయి.. వేదన తట్టుకోవడానికి తాగేది? నేను తాగుతున్నానంటే కారణం కనీసం ఊపిరన్నా ఆడుతుందని’’

– దేవదాస్‌ (1954)

‘రైట్‌ బ్రదర్స్‌’ ప్రపంచానికి ఎగరడం నేర్పించారు. అదొక రికార్డు. దిలీప్‌ కుమార్‌ ఈ దేశంలో నటులను నేలన నడవడం నేర్పించాడు. అదీ రికార్డే. నాటకం చూడ్డానికి వచ్చిన ప్రేక్షకుడికి వినిపించేలా అరిచి డైలాగులు చెప్పే రోజులు పోయాయి. అరవొద్దు. దూరం నుంచి కనిపించేలా ముఖమంతా కదిలించే భావాలు చూపించాల్సిన అవసరం లేదు. చూపించొద్దు. ఇది సినిమా. దీనికి వేరేగా చేయాలి... నాలా చేయాలి అని చేసి చూపించాడు దిలీప్‌ కుమార్‌.

ఒక కాలం ఉంటుంది. అరణ్యాలు మార్గాలు తొలుచుకునే కాలం. కొత్తది ఒకటి ఏర్పడే కాలం. అలాంటి కాలంలో అలాంటి వాళ్లు పుడతారు. సినిమా సంగీతం ఇలా ఉండాలి అని నౌషాద్‌ వచ్చాడు. సినిమా పాట ఇంత లలితంగా ఉండాలి అని లతా వచ్చింది. సినిమా దర్శకత్వం ఇలా ఉండాలి అని మహబూబ్‌ ఖాన్‌ వచ్చాడు. సినిమా నటన ఇలా ఉండాలని దిలీప్‌ కుమార్‌ వచ్చాడు.

‘దీదార్‌’ (1951) సినిమాలో దిలీప్‌ కుమార్‌ అంధుడు. అప్పటివరకూ సినిమాల్లో అంధులు వేగంగా కనురెప్పలు మూస్తూ కంటి కింద నల్ల చారలతో నటించేవారు. అదొక స్టీరియోటైప్‌. దిలీప్‌ ఆ సినిమాలో కళ్లు తెరిచి అంధుడుగా నటించాడు. శరీర కదలికా, మాట, నడక వల్ల తాను అంధుడు అని ప్రేక్షకులకు చెప్పాడు.


సినిమా అంటే ఆ పూటకు మేకప్‌ వేసుకుని, ఆ రోజుకు సీన్‌ పేపర్‌ చదువుకుని, ఆ షాట్‌లో చెప్పాల్సిన డైలాగ్‌ చెప్పి మధ్యాహ్నం షెడ్యూల్‌కు ఇంకో స్టూడియోకు పరిగెత్తి పోవడం కాదు అని వృత్తి ఏకాగ్రతను మొదట పాటించినవాడు దిలీప్‌ కుమార్‌. తెర మీద నీలా కనిపిస్తున్నావా నీ పాత్రలా కనిపిస్తున్నావా అని అందుకై మధనపడ్డ వాడు దిలీప్‌ కుమార్‌. ఒక కాలంలో ఒకే సినిమా అని అతడు పాటించిన సూత్రాన్ని దాదాపు 50 ఏళ్ల తర్వాత రజనీకాంత్, ఆమిర్‌ఖాన్‌ పాటించి విజయాలు సాధించి ఆపై అందరు హీరోలు అదే ధోరణికి వచ్చేలా చేశారు. వీరి దారికి మ్యాప్‌ ఇచ్చినవాడు దిలీప్‌ కుమార్‌.
∙∙
‘చేతులు ఎక్కడ పెట్టుకోవాలి?’ ఇది తెలిస్తే నటులైపోతారు. ఒక నటుడు నటించడానికి చేతులే పెద్ద అడ్డం అని నటులకు మాత్రమే తెలుస్తుంది. ఆ చేతుల్ని అలా జార్చి వదల్లేము. చీటికి మాటికి కదిలించలేము. ఈ చేతుల్ని హ్యాండిల్‌ చేయడానికి కొందరు వాటిని విసురుతూ నటిస్తే, కొందరు కాలర్‌ దగ్గరకు తెచ్చి నటిస్తే, కొందరు ఒక చేతిని సగం మడిచి, మరికొందరు బెల్ట్‌ పట్టుకుని నటించడం చూశాం. వారి నటనలో  చేతులు రిజిస్టర్‌ అవుతాయి. దిలీప్‌ కుమార్‌ నటనను చూడండి. అతడు రిజిస్టర్‌ అవుతాడు. చేతులు కాదు. భారతదేశ నటులందరిలోనూ చేతులను సరిగ్గా పెట్టి నటించడం తెలిసిన మొదటి నటుడు దిలీప్‌ కుమార్‌. యాక్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో అందుకై అతడి సినిమాలు చూపిస్తారు.
∙∙
‘నా విజయం నీ గుండెల్లో గడబిడ పుట్టిస్తే అంతే చాలు. నీ ఇనాం నీ దగ్గరే పెట్టుకో. నా విజయాన్ని నేను తీసుకెళ్తా’ అని ‘ఆన్‌’ (1952) సినిమాలో దిలీప్‌ కుమార్‌ అంటాడు. విజయం సాధిస్తే అలా సాధించాలి అనుకున్నవాడు దిలీప్‌ కుమార్‌. పెషావర్‌లో పుట్టి (1922) మరో పదేళ్ల తర్వాత కుటుంబం ముంబైకి వలస రావడం వల్ల అక్కడే చదువుకున్న దిలీప్‌ కుమార్‌ కాలేజ్‌లో రాజ్‌ కపూర్‌కు క్లాస్‌మేట్‌. చదువుకుని సొంతగా బతకాలనుకునే ఖాన్‌ల స్వభావం చదువు పూర్తి కావడంతోటే అతణ్ణి  పూణెకి తీసుకెళ్లింది. అక్కడ సొంతంగా డ్రైఫ్రూట్స్‌ షాప్‌ పెట్టాడు. సంవత్సర కాలంలోనే లాభంతో తండ్రి దగ్గరకు వస్తే తండ్రి సంతోషించాడు. అయితే ఈ అందగాణ్ణి, చక్కటి మాట ఉన్నవాణ్ణి, మర్యాదపూర్వక ప్రవర్తన ఉన్నవాణ్ణి, మంచి ఇంగ్లిష్‌ మాట్లాడుతున్నవాణ్ణి నటి దేవికా రాణి చూసింది. అప్పటికే ఆమె సూపర్‌స్టార్‌. బాంబే టాకిస్‌ స్టూడియో ఓనర్‌. కొత్త హీరోలతో సినిమాలు తీయాలని వెతుకుతోంది ఆమె. ‘నీ జీతం 1250 రూపాయలు’ అని దిలీప్‌ కుమార్‌తో దేవికా రాణి చెప్తే అది నెలకా సంవత్సరానికా అర్థం కాలేదు దిలీప్‌కు.

1944లో 150 రూపాయలు పెద్ద జీతం. ‘నాకు మా స్టూడియోలో నెలకు 150 ఇస్తున్నారు. నీకు అది సంవత్సరానికి అయి ఉంటుంది’ అని రాజ్‌ కపూర్‌ ఆ సందేహానికి జవాబు చెప్పాడు. కాని తప్పు. నెలకు 1250 రూపాయలు ఆఫర్‌ చేసింది దిలీప్‌ కుమార్‌కు దేవికా రాణి. అలాంటి బ్యాంగ్‌తో మొదలయ్యాడు దిలీప్‌ కుమార్‌.

కాలేజ్‌లో ఫుట్‌బాల్‌ను స్పోర్ట్స్‌ ప్రిఫెరెన్స్‌గా తీసుకున్న దిలీప్‌ కుమార్, ఎప్పుడూ నాటకాలు వేయని దిలీప్‌ కుమార్, హాలీవుడ్‌ సినిమాలు తలమునకలుగా చూసి ఎరగని దిలీప్‌ కుమార్, దేవ్‌ ఆనంద్‌కు ఉన్నట్టుగా గ్రెగెరి పెక్‌ మోడల్‌ లేని దిలీప్‌ కుమార్, రాజ్‌ కపూర్‌కు ఉన్నట్టుగా సురభి నాటక సంస్థ లాంటిది లేని దిలీప్‌ కుమార్‌ అంత మంచి నటుడు ఎలా అయ్యాడు. అది రహస్యం. ఎప్పుడూ ఎవరికీ తెలియదు. అయ్యాడు. అవడానికే అతడు నిరంతరం శ్రమించాడు. దేవికా రాణి అతణ్ణి పెట్టి తీసిన మొదటి సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. కాని ఇలా కొత్త తరహా నటన చూపుతున్న నటుణ్ణి అందరూ గుర్తించారు. మహబూబ్‌ ఖాన్‌ మల్టీస్టారర్‌గా రాజ్‌కపూర్, నర్గిస్, దిలీప్‌ కుమార్‌లను పెట్టి తీసిన ‘అందాజ్‌’ (1949)తో దిలీప్‌ కుమార్‌ తన ఊనికిని పూర్తిగా నిరూపించాడు.

వరుసగా వచ్చిన మూడు సినిమాలు ‘దీదార్‌’ (1951), ‘తరానా’ (1951), ‘దాగ్‌’ (1952) దిలీప్‌ కుమార్‌ను ట్రాజెడీ కథలతో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాయి. అంతిమంగా ‘దేవదాస్‌’ (1955) అతణ్ణి ‘ట్రాజెడీ కింగ్‌’ను చేసింది. మెథడ్‌ యాక్టింగ్‌ అంటే పాత్రను మననం చేసుకుంటూ ఉండటం. మామూలు వ్యక్తిగా తక్కువ పాత్రగా ఎక్కువ ఉండటం. దిలీప్‌ కుమార్‌ ఈ పాత్రలతో ఎంత మమేకం అయ్యాడంటే ఆ కథలతో తనకు ఏ సంబంధం లేకున్నా ఆ విషాదం కమ్ముకుని డిప్రెషన్‌ రాసాగింది. డాక్టర్లు ‘ఇక మానెయ్‌. సరదా పాత్రలు చెయ్‌’ అంటే దిలీప్‌ దారి మార్చాడు. ఆజాద్‌ (1955), నయాదౌర్‌ (1957), మధుమతి (1958) అతణ్ణి చలాకీగా దూకుడుగా చూపించాయి. కాని అతడేంటో ఇంకా తెలియాల్సి ఉంది. ఎవరెస్ట్‌ ఎక్కాల్సి ఉంది. ఆ ఎవరెస్టే ‘మొఘల్‌ ఏ ఆజమ్‌’.

హీరోలు డ్యూయెట్లు పాడుతూ ప్రేమిస్తారు. విడిపోతే విరహగీతాలు ఆలపిస్తారు. చివర్లో నాలుగు ఫైట్లు చేసి హీరోయిన్‌ని సొంతం చేసుకుంటారు. ఇదీ ప్రేమంటే. కాని ‘మొఘల్‌ ఏ ఆజమ్‌’లో సలీమ్‌గా దిలీప్‌ కుమార్‌ చూపిన ప్రేమ వేరు. ప్రేమ అంత గంభీరంగా ఉంటుందని, అంత గాఢంగా ఉంటుందని, అంత తెగింపుగా ఉంటుందని, అంత గర్జనతో ఉంటుందని, ఒక సామ్రాజ్యాన్నే గడగడలాడించే సత్తాను చిన్న గుండెలో ఇముడ్చుకుని ఉంటుందని దిలీప్‌ కుమార్‌ చూపించాడు. ఆ పాత్రకు అంతకు ముందు ఎలాంటి మోడల్‌ లేదు. ఏ మోడల్‌ అయినా అతడే చూపాడు. ‘జంజీర్‌’తో యాంగ్రీ యంగ్‌ మేన్‌ వచ్చాడని అమితాబ్‌ని చూపి అంటారు. నిజానికి యాంగ్రీ యంగ్‌మేన్‌ 1960లోనే వచ్చాడు. అతడు దిలీప్‌ కుమార్‌.

రాజ్‌ కపూర్‌ వినోదం, సందేశం చూపే ప్రయత్నం చేశాడు. దేవ్‌ ఆనంద్‌ ఒట్టి వినోదమే. దిలీప్‌ కుమార్‌ వినోదం, సందేశం మాత్రమే కాదు అర్థవంతమైన ఒక జీవన అనుసరణను తన పాత్రల ద్వారా ఇస్తూ పోయాడు. మనం రాజ్‌ కపూర్, దేవ్‌ ఆనంద్‌ల పాత్రలను వారి సినీ ఇమేజ్‌ను ఒక అనుసరణీయతకు తీసుకోలేము. దిలీప్‌ కుమార్‌ను తీసుకోగలము. హీరోగా తన వయసు అయిపోయింది సరైన పాత్రలకు తగిన సంసిద్ధత తీసుకోవాలని 5 సంవత్సరాలు కెమెరా ముఖం చూడకుండా ఇంట్లో కూచున్నవాడు దిలీప్‌ కుమార్‌. ఆ తర్వాత కెమెరా ముందుకు వస్తే? అదొక ‘క్రాంతి’ (1981), ‘శక్తి’ (1982), ‘విధాత’ (1984), ‘కర్మ’ (1986), ‘సౌదాగర్‌’ (1991) అయ్యాయి. నువ్వొక మణివి. అవును. దానికి విలువుంది. అవును. కాని చీటికి మాటికి దానిని తీసి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. కిరీటంలోనే పెట్టాలి. అలా పెట్టి బతికినవాడు దిలీప్‌. అందుకే యాభై ఏళ్ల కెరీర్‌లో కేవలం 60 సినిమాలు మాత్రమే చేశాడు.

దిలీప్‌ కుమార్‌ ‘నయాదౌర్‌’లో డాన్స్‌ చేశాడు. అరె అన్నారు. ‘రామ్‌ ఔర్‌ శ్యామ్‌’లో కామెడీ చేశాడు. పడీ పడీ నవ్వారు. ‘గంగా జమున’లో న్యాయం కోసం ఆయుధం పట్టిన గ్రామీణుడిగా చూసి అతని పక్షం వహించారు. ‘మషాల్‌’లో అర్ధరాత్రి వాన కురిసిన ముంబై వీధుల్లో చావు బతుకుల్లో ఉన్న భార్యను బతికించుకోవడానికి దారిన పోయే కార్లను ఆపుతూ పరిగెత్తుతూ ‘ఏయ్‌ భాయ్‌’ అని అరుస్తూ ఉంటే ఉద్వేగంతో కన్నీరు మున్నీరు అయ్యారు. అతడు రాజేసిన స్పందనలకు నెత్తిన పెట్టుకున్నారు. చిల్లర మల్లర సినిమాలు చేయకుండా, చిల్లర మల్లర యాడ్స్‌లో నటించకుండా, రాజకీయ పదవుల కోసం చిల్లర మల్లర నాయకులతో స్నేహం నటించకుండా, చిల్లర మల్లర డబ్బు తీసుకుని శ్రీమంతుల పెళ్లిళ్లలో డాన్సులు చేయకుండా, చిల్లర మల్లర వాగుడు వాగకుండా, చిల్లర మల్లర ఇంటర్వ్యూలు ఇవ్వకుండా, షోస్‌ చేయకుండా నటుడికి ఉండాల్సిన సంస్కారం కోసం, జ్ఞానం కోసం, శీలం కోసం, నడవడిక కోసం తన ఎదుట ఒక బెత్తం ఉన్నట్టుగా దేవుని బెత్తమో ప్రేక్షకుని బెత్తమో... దానికి జవాబుదారిౖయె ఉండటానికి ప్రయత్నించడమే దిలీప్‌ కుమార్‌ గొప్పతనం. అతడి లాంటి వాణ్ణి చూసి నేర్చుకోవాలంటే అతడి లాంటి వాళ్లు మళ్లీ మళ్లీ రారు. అలా ఎదిగే ఐశ్వర్యం అందరికీ అబ్బదు. ఒక్కడే దిలీప్‌ కుమార్‌.

ఆజ్‌ పురానే రాహోన్‌ సే కోయి
ముఝె ఆవాజ్‌ న దే
దర్ద్‌ మె డూబె గీత్‌ న దే
ఘమ్‌ కా సిసక్తా సాజ్‌ న దే

 

► మధుబాలతో ప్రేమ..అనార్కలి దక్కలేదు
దిలీప్‌ కుమార్, మధుబాల కలిసిన నటించిన మొదటి సినిమా ‘తరానా’ (1951) ఫ్లాప్‌. వాళ్ల రెండో సినిమా ‘సంగ్‌ దిల్‌’ (1952) బిలో యావరేజ్‌. మూడో సినిమా ‘అమర్‌’ (1954) యావరేజ్‌. వాళ్లు కలిసి నటించిన ఒకే ఒక్క సూపర్‌హిట్‌ సినిమా ‘మొఘల్‌ ఏ ఆజమ్‌’ (1960). దురదృష్ట వశాత్తూ ఆ సినిమా నాటికి వాళ్ల ప్రేమ ముగిసింది. ‘ప్యార్‌ కియాతో డర్నా క్యా’ అని మొఘల్‌ ఏ ఆజమ్‌ సినిమాలో హిట్‌ పాట. దిలీప్‌కుమార్, మధుబాల కూడా తమ ప్రేమను దాచుకోలేదు. కలిసి మెలిసే తిరిగారు. కాని మధుబాల తండ్రి అతావుల్లా ఖాన్‌కు దిలీప్‌తో మధుబాల ప్రేమ నచ్చలేదు. దానికి కారణం మధుబాల కూడా హీరోయిన్లలో సూపర్‌స్టార్‌ కావడం. ఇంకా ఆమె ఎదుట చాలా కెరీర్‌ ఉండటం. ఆమె సంపాదన కుటుంబానికి ముఖ్యం కావడం. ఒక రకంగా తండ్రికీ దిలీప్‌కి మధ్య మధుబాల నలిగిపోయింది. ఇది ‘నయాదౌర్‌’ (1957) సినిమాతో పతాక స్థాయికి చేరింది. ఆ సినిమా చేయడానికి అడ్వాన్స్‌ తీసుకున్న మధుబాలాను షూటింగ్‌ అవుట్‌ డోర్‌ అనేసరికి తండ్రి నిలువరించాడు.

ఔట్‌డోర్‌లో దిలీప్‌ ఉంటాడు కనుక తన కంట్రోల్‌ ఉండదు అని భయపడ్డాడు. షూటింగ్‌ ఆగిపోయేసరికి ఒళ్లు మండిన దర్శకుడు బి.ఆర్‌.చోప్రా కోర్టుకెక్కాడు. ఆ సమయంలో తండ్రి మర్యాద దిలీప్‌ కాపాడాలని మధుబాల ఆశించింది. కాని దిలీప్‌ మధుబాలకు ఆమె తండ్రికి వ్యతిరేకంగా బి.ఆర్‌. చోప్రా పక్షాన సాక్ష్యం చెప్పాడు. దీంతో ఆమె మనసు ముక్కలయ్యింది. ‘మొఘల్‌ ఏ ఆజమ్‌’ షూటింగ్‌ సమయానికి వారి మధ్య మాటలు లేవు. ‘ఒక్కసారి మా నాన్నకు సారీ చెప్పు చాలు’ అని మధుబాల అంది. దిలీప్‌ చెప్పలేదు. ఆ వాక్యూమ్‌ను నింపుకోవడానికి ఆమె హడావిడిగా వివాహితుడైన కిశోర్‌ కుమార్‌ను పెళ్లి (1960) చేసుకుంది. కాని దిలీప్, మధుబాల తమ టర్మ్స్‌ బాగలేకపోయినా ఎంతో ప్రొఫెషనలిజమ్‌తో మొఘల్‌ ఏ ఆజమ్‌లో నటించారు. ఉద్యానవనంలో ఎక్కడో దూరంగా తాన్‌సేన్‌ పాడుతూ ఉండగా వారి మధ్య ప్రణయ సన్నివేశం ఒకటి నడుస్తుంది. దానిని చూసిన వారెవరైనా వారు మాటలు మానుకున్న ప్రేమికులు అనుకోగలరా? వారి ప్రేమ కనీసం తెర మీదైనా పండింది.

మధుబాలతో...

ఆమె అతణ్ణే తన బిడ్డ అనుకుంది
ప్రేమికులు మొండిగా ఉంటారు. మధుబాలను ప్రేమించిన దిలీప్‌ కుమార్‌ ఆమెతో పెళ్లి ఇక జరగదని అర్థమయ్యాక (1957) దాదాపు 11 ఏళ్ల పాటు మరో ప్రేమకథ వైపు చూళ్లేదు. ఆ కాలంలో అతని జీవితం లో ఏ స్త్రీ ఉందో కూడా ఎవరికీ తెలియదు. కాని తన 44 ఏళ్ల వయసులో తన కంటే 22 ఏళ్లు చిన్నది అయిన సైరా బానుతో ప్రేమలో పడ్డాడు. ఆమె హైస్కూల్‌ రోజుల నుంచి దిలీప్‌ ఫ్యాన్‌. చేసుకుంటే ఇలాంటి వాణ్ణే చేసుకోవాలి అనేదట. దిలీప్‌ కుమార్‌ని కలవడానికే సినిమా రంగంలోకి వచ్చిందట. కాని దిలీప్‌కు ఆమె పట్ల ఎటువంటి భావాలూ లేవు. ‘బచ్చీ’ (చిన్న పిల్ల) అని దూరం పెడుతూ వచ్చాడు. సినిమాల్లో తన పక్కన చాలా రోజుల తర్వాతగానీ తీసుకోలేదు. కాని సైరా ప్రేమ దిలీప్‌ కుమార్‌ పట్ల గట్టిది. వాళ్లు 1966లో వివాహం చేసుకున్నారు. దిలీప్‌ కుమార్‌ మగ దురహంకారి కాడు. పెళ్లయ్యాక సైరాబాను నటిగా కొనసాగడానికి అతడు ఏ అడ్డంకీ చెప్పలేదు. పెళ్లి తర్వాత సైరా దాదాపు పదేళ్లు హీరోయిన్‌గా నటించింది. ఆమె కెరీర్‌లో హిట్స్‌గా నిలిచిన ‘పడోసన్‌’, ‘విక్టోరియా నం.203’ వంటివి పెళ్లి తర్వాతే వచ్చాయి. సైరాకు దూకుడు ఎక్కువ. గర్భం దాల్చిన తర్వాత కూడా షూటింగ్‌లలో పాల్గొంది. ఆ సమయంలో చేసిన హార్స్‌ రైడింగ్‌ ఆమెకు ప్రమాదం తెచ్చి పెట్టిందని అంటారు.

కడుపులో బిడ్డకు ఎనిమిది నెలల వయసులో ఆమెకు హై బ్లడ్‌ ప్రెషర్‌ వల్ల అబార్షన్‌ చేయాల్సి వచ్చింది. అంత లేటు అబార్షన్‌ కావడం వల్ల సైరా మళ్లీ గర్భం దాల్చే శక్తిని కోల్పోయింది. కాని దిలీప్‌ కాని సైరా కాని దీని గురించి ఎటువంటి ఫిర్యాదు లేకుండా జీవించారు. సైరా తనే దిలీప్‌కు తల్లయ్యింది. అతణ్ణే బిడ్డగా చేసుకుని అనుక్షణం చూసుకుంది. 98వ ఏట ఆఖరి నిమిషం వరకూ కూడా దిలీప్‌ కోసం పాకులాడిందామె. దిలీప్‌ మరణంతో ఆమె జీవితంలో అతి పెద్ద శూన్యం రానుంది.

సైరాబానుతో పెళ్లి

హీరోలకు హీరో
హీరో అంటే ఎవరు? ఇన్‌స్పయిర్‌ చేసేవాడు. దేశంలో నటన విషయంలో దిలీప్‌ ఇన్‌స్పయిర్‌ చేసినట్టుగా మరో నటుడు చేయలేదు. నటుడు ధర్మేంద్ర పంజాబ్‌లో కాలేజీకి వెళ్లి వస్తూ దిలీప్‌కుమార్‌ సినిమాలు చూస్తూ ఇతనిలా హీరో అవ్వాలి అనుకుని హీరో అయ్యాడు. దిలీప్‌ అంటే ధర్మేంద్రకు చాలా గౌరవం. ఒక కడుపున పుట్టని తమ్ముణ్ణి అని చెప్పుకునేవాడు. దిలీప్‌ కుమార్‌ ధర్మేంద్రతో ‘దేవుడు నన్నెందుకు నీ అంత అందంగా పుట్టించలేదు’ అనేవాడు. పాకిస్తాన్‌ నుంచి శరణార్థిగా వచ్చి ఢిల్లీ శిబిరంలో ఉన్న ఒక బాలుడు సినిమాకు వెళ్లి అందులోని దిలీప్‌ను చూసి హీరో అవ్వాలనుకున్నాడు. ఆ సినిమాలో దిలీప్‌ పేరు మనోజ్‌. అదే తన పేరుగా చేసుకున్నాడు. అతడే మనోజ్‌ కుమార్‌. అమితాబ్‌ బచ్చన్, షారూక్‌ ఖాన్‌ ఇద్దరూ దిలీప్‌ కుమార్‌ సినిమాలు చూసి నటనను నేర్చుకున్నామని బహిరంగంగా చెప్పారు, ఆయనను ఇమిటేట్‌ చేస్తూ నటిస్తారు కూడా. చిన్న గొంతుతో ఇంటెన్స్‌గా నటించడం దిలీప్‌ మొదట చూపెట్టాడు. అమితాబ్, షారూక్‌ అలాంటి సన్నివేశాల్లో దిలీప్‌ మార్గమే పాటిస్తారు. ‘మాకో కొడుకు పుట్టి ఉంటే అచ్చు నీలా ఉండేవాడు’ అని సైరా షారూక్‌తో అంది.

ధర్మేంద్రతో..., మనోజ్‌ కుమార్‌తో.., అమితాబ్, షారూక్‌తో..

 హైదరాబాద్‌ అల్లుడు
దిలీప్‌ కుమార్‌ హైదరాబాద్‌ అల్లుడు. అవును. అయితే రెండేళ్లే. 1981–83 మధ్య అతడు తన జీవితంలోకి ఇంకో స్త్రీని ఆహ్వానించాడు. ఆమె హైదరాబాద్‌కు చెందిన అస్మా రహమాన్‌. ‘నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు ఏదైనా ఉంటే ఆమెను వివాహం చేసుకోవడమే’ అన్నాడు దిలీప్‌ కుమార్‌ తన ఆత్మకథ ‘ది సబ్‌స్టాన్స్‌ అండ్‌ షాడో’లో. హైదరాబాద్‌లో ఒక క్రికెట్‌ టోర్నీలో పాల్గొనడానికి వచ్చిన దిలీప్‌కుమార్‌కు అతని చెల్లెళ్లు అస్మా రహమాన్‌ను పరిచయం చేశారు. అప్పటికే ఆమెకు వివాహం అయ్యింది. ముగ్గురు పిల్లలు. కాని ఆమె దిలీప్‌కు చాలా పెద్ద ఫ్యాన్‌. దిలీప్‌తో విపరీతంగా ప్రేమలో ఉన్న ఆమె అతణ్ణి పెళ్లాడడానికి భర్తకు విడాకులు ఇచ్చింది. దిలీప్‌ కూడా సైరా నుంచి దాచి పెట్టి ఆమెను వివాహం చేసుకున్నాడు. 1981 లో జరిగిన ఈ వివాహం 1983లో ముగిసింది. సైరా దిలీప్‌ను క్షమించింది. ముంబై నుంచి తిరిగి వచ్చిన అస్మా తిరిగి  మునుపటి భర్తను వివాహం చేసుకుని బెంగళూరులో స్థిరపడిందని కథనం.  

ఆస్మా రహమాన్‌తో...

నీ కంటే పెద్దవాడు ఉంటాడు
దిలీప్‌ కుమార్‌ తన ఆత్మకథలో ఇలా రాశాడు. ‘ఒకసారి విమానంలో ప్రయాణిస్తున్నాను. సాధారణంగా నా పక్క సీటు వాళ్లు నన్ను గుర్తుపట్టి కొంత హంగామా సృష్టిస్తుంటారు. నా పక్కన కూచున్న పెద్ద మనిషి అలా ఏమీ చేయలేదు. కిటికీలో నుంచి చూస్తూ కూచున్నాడు. నేనే ఆయనతో మాట కలిపాను. ఇద్దరం టీ తాగాం. ఆయన ఇంకా నన్ను గుర్తించడం లేదేమిటా అనుకున్నాను. ‘సినిమాలు చూస్తారా?’ అని అడిగాను. ఎప్పుడైనా ఒకసారి అన్నాడాయన. ‘నేను సినిమాల్లో పని చేస్తాను’ అని చెప్పాను. ‘ఓ అలాగా. ఏం చేస్తారు’ అని ఆయన అడిగాడు. ‘నటుణ్ణి’ అని చెప్పాను. ఆయన అంతకుమించి ఏమీ అడగలేదు. విమానం ల్యాండ్‌ అయ్యాక ఇక తట్టుకోలేక నా పేరు చెప్పాను – ‘నేను దిలీప్‌ కుమార్‌ని’ అని. ‘నేను జె.ఆర్‌.డి టాటాని’ అన్నాడాయన. అప్పుడు అర్థం అయ్యింది నాకు... నువ్వు ఎంతైనా ఎదుగు నీ కంటే పెద్దవాడు ఉంటాడు అని. విర్రవీగడం సరి కాదని. ఈ ఘటన నన్ను ఇంకా వినమ్రుడిని చేసింది... అని రాసుకున్నాడాయన.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top