Maharashtra: ఇక నల్లేరుపై బండి నడకే!.. బండి లాగే ఎద్దుల కష్టం తగ్గించే ఆవిష్కరణ

Sagubadi: Maharashtra Students Innovation Cart Reduces Load On Bulls - Sakshi

ఇంజనీరింగ్‌ విద్యార్థుల ఆవిష్కరణతో బండి లాగే ఎద్దులపై తగ్గిన 80% భారం

ఎడ్ల బండి కాడి మధ్యలో పోల్‌కు ప్రత్యేకంగా టైరు చక్రాన్ని అమర్చడంతో.. ఎద్దుల మెడపై బరువు 20%కి తగ్గింది 

అధిక లోడు బండిని లాగే క్రమంలో ఎద్దులకు కలిగే ప్రమాదాల నుంచి కూడా రక్షణ

చక్కని ఆవిష్కరణతో జనం మెప్పు పొందిన మహారాష్ట్ర ఇంజనీరింగ్‌ విద్యార్థులు.. పేటెంట్‌కు దరఖాస్తు.. 

బండి లాగే ఎద్దుల కష్టం తగ్గించడంతో పాటు రైతుల దైనందిన జీవనాన్ని సులభతరం చేసేందుకు దోహదపడే చక్కని ఆవిష్కరణను అందించి ప్రజలందరితోనూ శభాష్‌ అనిపించుకుంటున్నారు మహారాష్ట్ర ఇంజనీరింగ్‌ విద్యార్థులు.

సంగ్లికి సమీపంలోని రాజారాంబాపు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఆర్‌.ఐ.టి.)కి చెందిన ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు మూగ జీవాల భుజాలపై బరువును తగ్గించే గొప్ప ఆవిష్కరణను అందించారు.  బండిలో సరుకు బరువంతా దానికి ఉన్న రెండు చక్రాల మీద ఉంటుంది. అంతిమంగా ఆ బరువు బండిని లాగడానికి కట్టిన జత ఎద్దుల మెడలపై పడుతుంది.

బండిపై చెరకు గడల్లాంటి భారీ లోడు వేసుకొని రోడ్డుపై లాక్కెళ్తున్న క్రమంలో స్పీడ్‌ బ్రేకర్లు వచ్చినప్పుడు, రాళ్లు రప్పలు, గోతులు, ఎత్తు, పల్లాలు వచ్చినప్పుడు జోడెట్లపై తీవ్ర వత్తిడి ఉంటుంది. ఆ వత్తిడిలో ఒక్కోసారి ఎద్దుల కాళ్లు మడతపడి గిట్టలు దెబ్బతినటం, కాళ్లు విరగటం వంటి పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి. అటువంటప్పుడు రైతుకూ చాలా కష్టం కలుగుతుంది. పనులు ఆగిపోవడమే కాకుండా ఆర్థిక నష్టం కూడా జరుగుతుంది. 

మహారాష్ట్రలో 200కు పైగా చక్కెర మిల్లులకు ఎడ్ల బండ్లపైనే చెరకు గడలను రైతులు తోలుకెళ్తూ ఉంటారు. ఒక్కో మిల్లు పరిధిలో 250 వరకు ఎడ్ల బండ్లు ఉంటాయి. ఓవర్‌ లోడింగ్‌ తదితర కారణాల వల్ల తరచూ ప్రమాదాలు జరగడం గమనించిన బీటెక్‌ ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం విద్యార్థులు ఎద్దుల బండ్ల రైతులు, ఎద్దులు ఎదుర్కొంటున్న సమస్యలనే ప్రాజెక్టుకు ఎంపిక చేసుకున్నారు.

‘సారధి’...
ఈ ప్రాజెక్టుకు ‘సారధి’ అని పేరుపెట్టారు. సౌరభ్‌ భోసాలే, ఆకాష్‌ కదమ్, నిఖిల్‌ టిపైలే, ఆకాష్‌ గైక్వాడ్, ఓంకార్‌ మిరాజ్‌కర్‌తో కూడిన విద్యార్థి బృందానికి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.సుప్రియా సావంత్‌ మార్గనిర్దేశం చేశారు. 

ఈ పరిశోధన క్రమంలో రెండు చక్రాల బండిని లాక్కెళ్లే ఎద్దుల మెడపై పడుతున్న బరువును తగ్గించేందుకు విద్యార్థులు మంచి ఆలోచన చేశారు. రెండు చక్రాల బండి ముందు వైపు పోల్‌కు, రెండు ఎద్దుల మధ్యలో, ఒక చిన్న టైరుతో కూడిన చక్రాన్ని బిగించారు. దీన్ని అమర్చటం వల్ల ఎద్దుల మెడపై పడే బరువులో 80% తగ్గిపోయిందని డా.సుప్రియా సావంత్‌ తెలిపారు. మిగతా 20% బరువును ఎద్దులు సునాయాసంగా భరించగలుగుతాయి. ఎక్కువ సేపు, ఎక్కువ దూరం అలసిపోకుండా బండిని లాక్కెళ్ల గలుగుతాయి. 

‘థర్డ్‌ రోలింగ్‌ సపోర్ట్‌’
ఈ టైరును ‘థర్డ్‌ రోలింగ్‌ సపోర్ట్‌’ అని పిలుస్తున్నారు. ఎద్దుల ఎత్తును బట్టి దీని ఎత్తును సరిచేసుకోవటానికి అవకాశం కల్పించటంతో ఈ ఆవిష్కరణ విజయవంతమైంది. 
పొలంలో చెరకు గడలను కూలీలు బండికి లోడ్‌ చేస్తున్న సమయంలో కూడా టైరుతో కూడిన చక్రం సపోర్టుగా నిలుస్తోంది. ఓవర్‌ లోడ్‌ చేయడం వల్ల రోడ్డుపై వెళ్లున్నప్పుడు స్పీడ్‌ బ్రేకర్లపై ఎద్దుల కాళ్లు జారిపోవడం, కాళ్లు మెలికలు తిరగడం వంటి అనేక ఇబ్బందులు కూడా ఈ ఆవిష్కరణతో తగ్గుతాయి.

మేధోహక్కుల కోసం పేటెంట్‌ కార్యాలయంలో దరఖాస్తు దాఖలు చేశారు. అద్భుతమైన ఈ ఆవిష్కరణ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. రైతులు, కార్మికులు, కూలీలతో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రాజెక్టు పరిశోధన కాలంలో అండగా నిలిచి తోడ్పాటునందించిన ప్రొఫెసర్లు డాక్టర్‌ ఎస్‌.ఆర్‌. కుంభార్, ప్రొఫెసర్‌ పి.ఎస్‌. ఘటగే, ఆర్‌.ఐ.టి. డైరెక్టర్‌ డాక్టర్‌ సుష్మా కులకర్ణిలకు రుణపడి ఉంటామని సౌరభ్‌ ఆవిష్కర్తలు కృతజ్ఞతలు తెలిపారు.

రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో వచ్చే చెరకు క్రషింగ్‌ సీజన్‌లో ఈ ఆవిష్కరణను రైతులకు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నామని ఆవిష్కర్తల్లో ఒకరైన సౌరభ్‌ భోసాలే ‘సాక్షి’కి తెలిపారు.

చదవండి: Terrace Garden: చక్కనింట.. మిద్దె పంట .. ఆదాయం.. ఆరోగ్యం

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top