Ritu Karidhal As The Mission Director Of Chandrayaan 3 - Sakshi
Sakshi News home page

Dr. Ritu Karidhal Srivastav: 'రాకెట్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా'.. ఊపిరి సలపని పనుల్లో మహిళా శాస్త్రవేత్తలు

Published Sat, Jul 15 2023 9:26 AM

Ritu Karidhal As The Mission Director Of Chandrayaan 3 - Sakshi

‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే ఆనంద తరంగాలలో వీరు...’ అన్నది చంద్రయాన్‌–3 ఆ ఆనంద తరంగాలలో తేలియాడిన అసంఖ్యాక భారతీయులలో ‘రాకెట్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరు తెచ్చుకున్న రీతు కరిధాల్‌ ఒకరు. మూడు దశలు పూర్తి చేసుకొని చంద్రయాన్‌–3 విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి వెళ్లింది. దేశాన్ని సంతోషంలో ముంచెత్తింది. ‘చంద్రయాన్‌–3’లో ‘నేను సైతం’ అంట మిషన్‌ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు స్వీకరించింది రీతు కరిధాల్‌. చిన్నప్పటి కలలు కలలుగానే ఉండిపోవు. కష్టపడితే ఆ కలలు నిజమవుతాయి. పదిమంది మన గురించి గర్వంగా చెప్పుకునేలా చేస్తాయి... అని చెప్పడానికి రీతు కరిధాల్‌ నిలువెత్తు నిదర్శనం. ‘ఊపిరి సలపని పనుల్లో మహిళా శాస్త్రవేత్తలకు వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోవడం కుదురుతుందా? ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి?’ అనే ప్రశ్నకు రీతు కరిధాల్‌ మాటల్లో సమాధానం దొరుకుతుంది...

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోకు చెందిన రీతు కరిధాల్‌కు చిన్నప్పడు ఆకాశం వైపు చూడడం అంటే ఇష్టం. రాత్రులలో గంటల తరబడి ఆకాశంకేసి చూసేది. నక్షత్రాల గురిం ఆలోచించేది. ‘చంద్రుడు ఒకసారి పెద్దగా, ఒకసారి చిన్నగా ఎందుకు కనిపిస్తాడు?’... లాంటి సందేహాలెన్నో ఆమెకు వచ్చేవి. అంతరిక్షంపై రీతు ఆసక్తి వయసుతోపాటు పెరుగుతూ పోయింది. హైస్కూల్‌ రోజులకు వచ్చేసరికి అంతరిక్షం, ఇస్రో, నాసాకు సంబంధించి పత్రికలలో వచ్చిన వార్తలు, వ్యాసాలను కట్‌ చేసి ఫైల్‌ చేసుకునేది. ‘యూనివర్శిటీ ఆఫ్‌ లక్నో’లో ఎం.ఎస్‌సీ., బెంగళరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ)లో ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ చేసింది. 1997లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.

‘మిషన్‌ ఎనాలసిస్‌ డివిజన్‌’ లో తొలి ఉద్యోగం. తొలి టాస్క్‌ తన ముందుకు వచ్చినప్పుడు... ‘చాలా కష్టం’ అనుకుంది. ఆ సమయంలో ఆ కష్టాన్ని పక్కకు తోసి టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేయడానికి తాను చదువుకున్న ఫిజిక్స్, మ్యాథమేటిక్స్‌ కంటే తనమీద తనకు ఉన్న ఆత్మవిశ్వాసమే ఎక్కువగా ఉపయోగపడింది. ఆ తరువాత కూడా ప్రాజెక్ట్‌ల రపంలో ఎన్నో సవాళ్లను విజయవంతంగా అధిగమించింది. ‘టైమ్‌ అండ్‌ ది టార్గెట్‌’ను దృష్టిలో పెట్టుకొని కాలంతో పరుగు తీసింది. ‘అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు. పేయింగ్‌ గెస్ట్‌గా ఉన్నాను. పొద్దుటి నుంచి రాత్రి వరకు పనిచేయాల్సి వచ్చేది. అయితే అదేమీ నాకు భారంగా, కష్టంగా అనిపించేది కాదు. చేస్తున్న పని ఇష్టమైనది కావడమే దీనికి కారణం.

అప్పట్లో ఎక్కువమంది మహిళలు ఇస్రోలో లేరు. ఒక ల్యాబ్‌ నుంచి మరో ల్యాబ్‌కు, ఒక బిల్డింగ్‌ నుంచి మరో బిల్డింగ్‌కు ఒంటరిగానే వెళ్లేదాన్ని. ఎప్పుడ భయం అనిపించేది కాదు’ అంటుంది రీతు. ఒక్కోమెట్టు ఎక్కుతూ ‘ఇస్రో’ చేపట్టిన ఎన్నో ప్రాజెక్ట్‌లలో కీలక బాధ్యతలు చేపట్టింది. ప్రతిష్ఠాత్మకమైన ‘మంగళాయాన్‌ మిషన్‌’లో డిప్యూటీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌గా, చంద్రయాన్‌–2 మిషన్‌ డైరెక్టర్‌గా పనిచేసింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రీతుకు కోచింగ్‌ సెంటర్‌లకు వెళ్లేంత స్థోమత ఉండేది కాదు. చదువుపై తన ఆసక్తే తన శక్తిగా మారింది. బీఎస్సీ పూర్తికాగానే ‘ఏదో ఒక ఉద్యోగంలో చేరవచ్చు కదా’ అనే మాటలు చుట్టాలు పక్కాల నుంచి వినిపించేవి. ‘ఇస్రోలో పనిచేయాలనేది నా కల’ అని వారికి స్పష్టంగా చెప్పేది రీతు. తన పుస్తకం ‘దోజ్‌ మాగ్నిఫిసెంట్‌ ఉమెన్‌ అండ్‌ దెయిర్‌ ఫ్లైయింగ్‌ మెషిన్స్‌’ కోసం మిన్నీ వేద్‌ రీతు కరిధాల్‌ను ఇంటర్వ్యూ చేసింది.

ఆ ఇంటర్యలో తన అనుభవాలను ఇలా పంచుకుంది రీతు... ‘ఇస్రోలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. లింగవివక్షతకు తావు లేదు. ప్రతిభ మాత్రమే ముఖ్యం అవుతుంది. రిమోట్‌ సెన్సింగ్, కమ్యూనికేషన్‌ శాటిలైట్స్‌ ఫీల్డ్‌లో సీనియర్‌ ఉమెన్‌ సైంటిస్ట్‌లు ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌లు కావడం దీనికి నిదర్శనం. నా తొలి ప్రాజెక్ట్‌ చేయడానికి ఎంతోమంది సీనియర్‌లు ఉన్నప్పటికీ ఆ అవకాశం నన్ను వెదుక్కుంటూ వచ్చింది’ ‘టైమ్‌ మేనేజ్‌మెంట్‌’కు అధిక ప్రా«ధాన్యత ఇచ్చే రీతు వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నించేది. వృత్తిరీత్యా ఎంత బిజీగా ఉన్నా పిల్లల దగ్గర కూర్చొని వారితో హోంవర్క్‌ చేయించడం మరిచేది కాదు. ‘మంగళాయాన్‌ మిషన్‌’లో భాగమైనప్పుడు రీతు కువరుడి వయసు తొమ్మిది, కూతురు వయసు నాలుగు సంవత్సరాలు.

క్షణం తీరిక లేని పనుల్లో కూడా ఏదో రకంగా తీరిక చేసుకొని పిల్లలతో తగిన సమయం గడిపేది. వారు నిద్రపోయిన తరువాత ఆఫీసు పని మొదలుపెట్టేది. అలా పనిచేస్తూ కుర్చీలోనే నిద్రపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి! ‘ఒకసారి మా అమ్మాయికి జ్వరం వచ్చింది. హాస్పిటల్‌కు తీసుకువెళ్లే టైమ్‌ లేకపోవడంతో నా భర్త తీసుకువెళ్లాడు. ఆఫీసులో ఉన్న మాటేగానీ నా మనసంతా పాపపైనే ఉంది. పాపకు ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు అడుగుతుండేదాన్ని. అపరాధ భావనతో బాధ అనిపించేది. కొన్నిసార్లు స్కూల్‌ ఫంక్షన్‌లకు వెళ్లడం కుదిరేది కాదు.

అయితే కుటుంబం నాకు ఎప్పుడ అండగానే నిలబడింది. అదే నా బలం. ఆఫీసు నుంచి ఇంటికి ఆలస్యంగా రావడానికి కొన్ని కుటుంబాల్లో ఒప్పుకోరు. మగవాళ్ల విషయంలో అయితే పట్టింపులు ఉండవు. మంగళాయాన్‌ మిషన్‌ కోసం పనిచేసే రోజుల్లో ఇంటికి ఆలస్యంగా వచ్చేదాన్ని. అయితే నాపై ఉండే పనిఒత్తిడి గురించి తెలిసిన కుటుంబసభ్యులు నన్ను అర్థం చేసుకున్నారు. ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా అది నేను చేసే పనిపై ప్రభావం చపేది. అందుకే ఎలాంటి సమస్యలు రాకుండా, మనసు ప్రశాంతగా ఉండేలా చూసుకునేదాన్ని’ అంటుంది రీతు కరిధాల్‌.

(చదవండి: ఆ కుక్క చనిపోయి వందేళ్లు..కానీ ఇంకా బతికే ఉంది ఎలాగో తెలుసా!)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement