Gurrala Sarojanammam: సేవా సరోజనం

Retired Teacher Gurrala Sarojanammam donate own house - Sakshi

నేటి సమాజమంతా డబ్బు చుట్టూ తిరుగుతోందనేది జగమెరిగిన సత్యం. ఇందుకు భిన్నంగా తనకున్న ఆస్తులు, కష్టార్జితాన్ని నిరుపేదలు, అనాథల అవసరాలు గుర్తించి వారికి అండగా నిలుస్తోంది నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలు గుర్రాల సరోజనమ్మ. ఎనిమిది పదుల వయసులో ఆమె సామాజిక సేవా దృక్పథం ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తోంది.

గుర్రాల సరోజనమ్మ వయసు 84 ఏళ్లు. ప్రభుత్వ స్కూల్‌ టీచర్‌గా పనిచేసిన ఆమె విశ్రాంత జీవనం గడుపుతోంది. చుట్టుపక్కల అందరితో ఆత్మీయంగా ఉండే సరోజినమ్మ అంటే అందరికీ అభిమానమే. ఆమె ఉద్యోగం చేసి సంపాదించిన ఆస్తులను మానవతా దృక్పథంతో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలకు కేటాయిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

► సొంతిల్లు దానం
పట్టణ నడిబొడ్డున గోశాల రోడ్డులో 180 గజాల విస్తీర్ణంలో సుమారు రూ. కోటి విలువ చేసే సొంతిల్లు ఉంది సరోజనమ్మకు. ఆ ఇంటిని తెలంగాణ ఆల్‌ పెన్షర్స్‌ అండ్‌ రిటైర్డు పర్సన్స్‌ అసోసియేషన్‌ జిల్లా శాఖకు విరాళంగా ఇచ్చేశారామె. ఇప్పుడు ఆ ఇంటిని నిరుద్యోగ యువతీ యువకుల ఉపాధి కోసం వివిధ వృత్తుల్లో  శిక్షణ, ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించేందుకు కేంద్రంగా ఉపయోగించుకోనున్నారు. నిజామాబాద్‌ నగర కేంద్రంలో మల్లు స్వరాజ్యం మెమోరియల్‌ క్లిని క్‌కు అనుబంధంగా జనరిక్‌ హాల్‌ కోసం రూ. 2 లక్షలు విరాళం అందిస్తూ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు.

రెంజల్‌ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం గోదావరి నది ఒడ్డున ఉన్న గోశాలకు రూ. లక్ష విరాళం ఇచ్చారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు రూ. 20 వేల విలువైన పుస్తకాలను స్థానిక గ్రంథాలయానికి అందించారామె. ప్రస్తుతం అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షురాలిగా, డివిజన్‌శాఖ గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు సరోజనమ్మ. ఆమె సేవా కార్యక్రమాలకు అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రామ్మోహన్‌రావు, ఇతర డివిజన్‌ ప్రతినిధులు తమ సహకారాన్ని అందిస్తున్నారు.

► పెన్షన్‌ కూడా పేదలకే!
బోధన్‌ పట్టణంలోని రాకాసిపేట్‌కు చెందిన గుర్రాల సూర్యనారాయణ, వెంకట సుబ్బమ్మ రెండో కూతురు సరోజనమ్మ. వీరిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. సరోజనమ్మ ఉన్నత విద్యనభ్యసించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం సంపాదించింది. ఆమె భర్త వెంకట్రావ్‌ బోధన్‌ నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలో పని చేసేవారు. 1996లో సరోజనమ్మ రిటైర్డ్‌ అయ్యింది. 2013లో భర్త మరణించారు. వీరికి సంతానం లేదు. నెలవారీగా వచ్చే పెన్షన్‌లో అవసరాలకు కొంత ఉంచుకుని మిగిలిన డబ్బులను పేదల ఆర్థిక అవసరాలకు సహాయం చేస్తూ తన ఉదారతను చాటుకుంటున్నారామె. మరణానంతరం తన శరీరాన్ని మెడికల్‌ కాలేజీకి అప్పగించాలని దానపత్రం సమర్పించారు.

► అంతిమ సంస్కారాలకు ధర్మస్థలం
పొట్ట కూటి కోసం పల్లె నుంచి పట్నాలకు వచ్చిన నిరుపేదలు అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తుంటారు. కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలు నిర్వహించుకునేందుకు చాలాచోట్ల  ఇంటి యజమానులు అనుమతించరు. ఈ విషాదకర పరిస్థితిలో ఆ కుటుంబ సభ్యులు పడే మానసిక క్షోభను ప్రత్యక్షంగా చూసిన సరోజినమ్మ మనసు కలిచివేసింది. ఇందుకు ఏదో పరిష్కార మార్గం చూపాలని సంకల్పించింది. ఇలాంటి నిరుపేదలు తమ కుటుంబ సభ్యుడి అంతిమ సంస్కారాలు కుల, మత. వర్గాలకతీతంగా వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా ఉచితంగా  జరుపుకునేందుకు సౌకర్యంగా ఉండేవిధంగా ధర్మస్థలిని ఏర్పాటు చేసింది. బోధన్‌ పట్టణంలోని చెక్కి చెరువు పరిసరాల్లో ఉన్న శ్మశాన వాటిక ప్రహరీకి ఆనుకుని తన సొంత డబ్బులు రూ. 20 లక్షలు వెచ్చించి ధర్మ స్థలం నిర్మాణం చేపట్టింది. ఈ భవనంలో ఫ్రీజర్, కరెంట్, తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ఈ ధర్మస్థలి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.   
– గడ్డం గంగులు, సాక్షి, బోధన్‌

మంచి పనులే తోడు
ఎవరికైనా జీవితంలో చేసిన మంచి పనులే కడదాకా తోడుంటాయి. బతికి ఉన్నంత కాలం సాటివారికి నా వంతుగా ఏదైనా సాయం చేయాలనుకున్నాను. అందులో భాగంగానే నా శక్తి కొలదీ సాయం చేస్తూ వచ్చాను. చేసిన మేలు చెప్పుకోకూడదంటారు. నలుగురి మేలు కోసం చేసే ఏ పనైనా అది మనకు మంచే చేస్తుంది. ఈ కార్యక్రమాలకు ఇప్పటి వరకు ఎవరి నుంచి ఆర్థిక సహాయం తీసుకోలేదు. పొదుపు చేసినవి, నెలవారీ పెన్షన్‌గా వచ్చే డబ్బులే ఖర్చు పెడుతున్నాను. సేవ కార్యక్రమాలకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు.  
– గుర్రాల సరోజనమ్మ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top