breaking news
social responsibilty
-
Gurrala Sarojanammam: సేవా సరోజనం
నేటి సమాజమంతా డబ్బు చుట్టూ తిరుగుతోందనేది జగమెరిగిన సత్యం. ఇందుకు భిన్నంగా తనకున్న ఆస్తులు, కష్టార్జితాన్ని నిరుపేదలు, అనాథల అవసరాలు గుర్తించి వారికి అండగా నిలుస్తోంది నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలు గుర్రాల సరోజనమ్మ. ఎనిమిది పదుల వయసులో ఆమె సామాజిక సేవా దృక్పథం ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తోంది. గుర్రాల సరోజనమ్మ వయసు 84 ఏళ్లు. ప్రభుత్వ స్కూల్ టీచర్‌గా పనిచేసిన ఆమె విశ్రాంత జీవనం గడుపుతోంది. చుట్టుపక్కల అందరితో ఆత్మీయంగా ఉండే సరోజినమ్మ అంటే అందరికీ అభిమానమే. ఆమె ఉద్యోగం చేసి సంపాదించిన ఆస్తులను మానవతా దృక్పథంతో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలకు కేటాయిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ► సొంతిల్లు దానం పట్టణ నడిబొడ్డున గోశాల రోడ్డులో 180 గజాల విస్తీర్ణంలో సుమారు రూ. కోటి విలువ చేసే సొంతిల్లు ఉంది సరోజనమ్మకు. ఆ ఇంటిని తెలంగాణ ఆల్ పెన్షర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ జిల్లా శాఖకు విరాళంగా ఇచ్చేశారామె. ఇప్పుడు ఆ ఇంటిని నిరుద్యోగ యువతీ యువకుల ఉపాధి కోసం వివిధ వృత్తుల్లో శిక్షణ, ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించేందుకు కేంద్రంగా ఉపయోగించుకోనున్నారు. నిజామాబాద్ నగర కేంద్రంలో మల్లు స్వరాజ్యం మెమోరియల్ క్లిని క్కు అనుబంధంగా జనరిక్ హాల్ కోసం రూ. 2 లక్షలు విరాళం అందిస్తూ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం గోదావరి నది ఒడ్డున ఉన్న గోశాలకు రూ. లక్ష విరాళం ఇచ్చారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు రూ. 20 వేల విలువైన పుస్తకాలను స్థానిక గ్రంథాలయానికి అందించారామె. ప్రస్తుతం అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలిగా, డివిజన్‌శాఖ గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు సరోజనమ్మ. ఆమె సేవా కార్యక్రమాలకు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రామ్మోహన్రావు, ఇతర డివిజన్ ప్రతినిధులు తమ సహకారాన్ని అందిస్తున్నారు. ► పెన్షన్ కూడా పేదలకే! బోధన్ పట్టణంలోని రాకాసిపేట్కు చెందిన గుర్రాల సూర్యనారాయణ, వెంకట సుబ్బమ్మ రెండో కూతురు సరోజనమ్మ. వీరిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. సరోజనమ్మ ఉన్నత విద్యనభ్యసించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం సంపాదించింది. ఆమె భర్త వెంకట్రావ్ బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పని చేసేవారు. 1996లో సరోజనమ్మ రిటైర్డ్ అయ్యింది. 2013లో భర్త మరణించారు. వీరికి సంతానం లేదు. నెలవారీగా వచ్చే పెన్షన్‌లో అవసరాలకు కొంత ఉంచుకుని మిగిలిన డబ్బులను పేదల ఆర్థిక అవసరాలకు సహాయం చేస్తూ తన ఉదారతను చాటుకుంటున్నారామె. మరణానంతరం తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించాలని దానపత్రం సమర్పించారు. ► అంతిమ సంస్కారాలకు ధర్మస్థలం పొట్ట కూటి కోసం పల్లె నుంచి పట్నాలకు వచ్చిన నిరుపేదలు అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తుంటారు. కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలు నిర్వహించుకునేందుకు చాలాచోట్ల ఇంటి యజమానులు అనుమతించరు. ఈ విషాదకర పరిస్థితిలో ఆ కుటుంబ సభ్యులు పడే మానసిక క్షోభను ప్రత్యక్షంగా చూసిన సరోజినమ్మ మనసు కలిచివేసింది. ఇందుకు ఏదో పరిష్కార మార్గం చూపాలని సంకల్పించింది. ఇలాంటి నిరుపేదలు తమ కుటుంబ సభ్యుడి అంతిమ సంస్కారాలు కుల, మత. వర్గాలకతీతంగా వారి వారి సంప్రదాయాలకు అనుగుణంగా ఉచితంగా జరుపుకునేందుకు సౌకర్యంగా ఉండేవిధంగా ధర్మస్థలిని ఏర్పాటు చేసింది. బోధన్ పట్టణంలోని చెక్కి చెరువు పరిసరాల్లో ఉన్న శ్మశాన వాటిక ప్రహరీకి ఆనుకుని తన సొంత డబ్బులు రూ. 20 లక్షలు వెచ్చించి ధర్మ స్థలం నిర్మాణం చేపట్టింది. ఈ భవనంలో ఫ్రీజర్, కరెంట్, తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ఈ ధర్మస్థలి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. – గడ్డం గంగులు, సాక్షి, బోధన్ మంచి పనులే తోడు ఎవరికైనా జీవితంలో చేసిన మంచి పనులే కడదాకా తోడుంటాయి. బతికి ఉన్నంత కాలం సాటివారికి నా వంతుగా ఏదైనా సాయం చేయాలనుకున్నాను. అందులో భాగంగానే నా శక్తి కొలదీ సాయం చేస్తూ వచ్చాను. చేసిన మేలు చెప్పుకోకూడదంటారు. నలుగురి మేలు కోసం చేసే ఏ పనైనా అది మనకు మంచే చేస్తుంది. ఈ కార్యక్రమాలకు ఇప్పటి వరకు ఎవరి నుంచి ఆర్థిక సహాయం తీసుకోలేదు. పొదుపు చేసినవి, నెలవారీ పెన్షన్‌గా వచ్చే డబ్బులే ఖర్చు పెడుతున్నాను. సేవ కార్యక్రమాలకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. – గుర్రాల సరోజనమ్మ -
మూసధోరణికి తెర
బెంగళూరు: దేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగాలంటే భౌతిక, సామాజికపరమైన మౌలిక సదుపాయాలను రెండింటినీ బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనిపై తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని తెలిపారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో భారత్ సాధిస్తున్న అద్భుతాలను చూసి ప్రపంచదేశాలు ఆశ్చర్యపోతున్నాయన్నారు. మేడ్ ఇన్ ఇండియా, 5జీ టెక్నాలజీ 2014కు ముందు ఊహకందని విషయాలన్నారు. శుక్రవారం బెంగళూరులో మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రసంగించారు. గత ప్రభుత్వాలు పాత ఆలోచనా ధోరణిని పట్టుకొని వేలాడాయని, దేశ ఆకాంక్షల్లో వేగాన్ని విలాసంగా, గొప్ప స్థాయికి చేరుకోవడాన్ని రిస్క్‌గా భావించాయని విమర్శించారు. ఈ అభిప్రాయాన్ని తమ ప్రభుత్వం మార్చేసిందన్నారు. స్టార్టప్‌ల హబ్‌గా భారత్ పెట్టుబడులకు భారత్ ఒక నమ్మకమైన దేశంగా మారిందని మోదీ ఉద్ఘాటించారు. ‘‘కరోనా ప్రభావం ఉన్నప్పటికీ మూడేళ్లలో కర్ణాటక రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఎఫ్‌డీఐ రాబట్టడంలో గతేడాది తొలి స్థానంలో నిలిచింది. ఐటీ, రక్షణ తయారీ, స్పేస్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగాల్లో దూసుకెళ్తోందని కొనియాడారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వమే కర్ణాటక బలం అని స్టార్టప్ అంటే కేవలం ఒక కంపెనీ కాదని, కొత్తగా ఆలోచించడానికి, సాధించడానికి భావోద్వేగ అంశమని వివరించారు. విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభం బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నగర వ్యవస్థాపకుడు నాదప్రభు కెంపేగౌడ 108 అడుగుల ఎత్తయిన కంచు విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. విగ్రహం బరువు 218 టన్నులు. ప్రఖ్యాత శిల్పి, పద్మభూషణ్ గ్రహీత రామ్వాంజీ సుతార్ ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. విమానాశ్రయంలో .5,000 కోట్ల వ్యయంతో పచ్చదనానికి పెద్దపీట వేస్తూ పర్యావరణ హితంగా నిర్మించిన నూతన టెర్మినల్–2ను మోదీ ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను బెంగళూరులోని క్రాంతివీరా సంగోలీ రైల్వే స్టేషన్లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు మైసూరు నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకి రాకపోకలు సాగిస్తుంది. వందేభారత్ రైలుతో మైసూరు–బెంగళూరు–చెన్నై అనుసంధానం మరింత మెరుగవుతుందని, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయని మోదీ చెప్పారు. ప్రజల జీవనం సులభతరం అవుతుందన్నారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను దర్శించుకొనేవారి కోసం ‘భారత్ గౌరవ్ కాశీ దర్శన్’ రైలును సైతం ప్రధానమంత్రి ప్రారంభించారు. ‘భారత్ గౌరవ్’ పథకంలో భాగంగా రైల్వే శాఖ, కర్ణాటక ప్రభుత్వం సంయుక్తంగా ఈ రైలును నిర్వహిస్తాయి. ‘భారత్ గౌరవ్ కాశీ దర్శన్’ రైలుతో కర్ణాటక, కాశీ సన్నిహితమవుతాయని పేర్కొంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. నేటి సవాళ్లకు గాంధీజీ బోధనలే సమాధానం: మోదీ దిండిగల్: సంఘర్షణల నుంచి వాతావరణ సంక్షోభాల వరకూ.. నేడు మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు జాతిపిత మహాత్మా గాంధీ బోధనలే సమాధానాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా సాగడానికి మహాత్ముడిని స్ఫూర్తిగా తీసుకున్నామన్నారు. శుక్రవారం తమిళనాడులోని గాంధీగ్రామ్ రూరల్ ఇనిస్టిట్యూట్ 36వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. గాంధీగ్రామ్ రూరల్ ఇనిస్టిట్యూట్‌లో పట్టభద్రులైన నలుగురు విద్యార్థులకు ప్రధాని బంగారు పతకాలు అందజేశారు. -
తరగతి గదికి సామాజిక స్పృహ
చుక్కా రామయ్య నేరాలు జరిగే వాతావరణాన్ని మనమే సిద్ధం చేసుకుంటున్నాం. నేరం జరిగాక ఖండిస్తాం. ఉరిశిక్షకు కూడా వెనుకాడం. పరిష్కారం ఇదేనా? నేరంతో నేరాన్ని నిరోధించలేం. పౌరసమాజం, పాలనా యంత్రాంగం దూరదృష్టితో తగు చర్యలు తీసుకుంటేనే నేరాలు తగ్గుతాయి. దీనికి తోడు నేరగ్రస్తతను మొగ్గలోనే తుంచేసే పని ఇంటి నుంచే, బడి నుంచే మొదలు కావాలి. విద్యార్థికి సామాజిక సమస్యలపై అవగాహనను, బాధ్యతను నేర్పాలి. నేరం జరగకుండా నివారించేందుకు వివిధ ప్రభుత్వ యంత్రాంగాలు ఏవిధంగా పనిచేయాలన్నదే నేటి సవాల్. మన విద్యా వ్యవస్థ బాగోగుల పట్ల పట్టింపు ఉన్న నాకు వివిధ దేశాల విద్యావిధానాలను గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువ. ఏ దేశం వెళ్ళినా అక్కడి విద్యావిధానాన్ని పరిశీలించడం కోసం అక్కడి పాఠశాలలను సందర్శించేవాడిని. అలా కొన్ని సార్లు ప్రాథమిక పాఠశాలలకు వెళ్లాను. కొన్ని సార్లు ఉన్నత పాఠశాలలు తిరిగాను. ప్రతిష్టాత్మకమైన కళాశాలలు, సుప్రసిద్ధ విశ్యవిద్యాలయాలు కూడా చూశాను. ఎక్కడికి వెళ్ళినాకానీ, సమాజంలోని వాస్తవ పరిస్థితుల పట్ల, దైనందిన సమస్యల పట్ల విద్యార్థులకు వారి స్థాయికి విధంగా అవగాహనను కల్పించడం అక్కడి విద్యా కార్యక్రమంలో విడదీయ రాని భాగంగా ఉండటం స్పష్టంగా కనిపించింది. మన దేశంలో లాగా విదే శాల్లో బోధనా ప్రణాళిక (కరికులం) స్థిరంగా ఉండదు. మారుతున్న సామా జిక పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంటారు. పాఠాలు చెప్పే పోలీసాఫీసర్లు ప్రాథమిక పాఠశాలలను పరిశీలించేందుకు వెళితే ఒక చోట... ఒక పోలీసు అధికారి వచ్చి తరగతి గదిలో చిన్న పిల్లలకు రోడ్డు ప్రమాదాలను గురించి వివరిస్తుండటం కనిపించింది. ఆయన తనతో పాటు ఒక ప్రొజెక్టర్‌ను కూడా తెచ్చుకున్నాడు. ప్రొజెక్టర్‌పై బొమ్మలు చూపిస్తూ రోడ్డుపైన జరిగే ప్రమాదాల తీవ్రతను, అవి బాధితుల భవిష్యత్తుపై చూపే ప్రభావాన్ని, ప్రమాదాల తదుపరి బాధితుల కుటుంబాల పరిస్థితిని వివరిస్తూ... రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను పిల్లల మనస్సుల్లో ముద్రపడేలా వివరించి చెపుతు న్నాడు. చిన్న పిల్లలు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో వారికి వారి సొంత భాషల్లోనే చెప్పిస్తున్నారు. అది చూస్తుంటే నాకు విజయవాడ రోడ్లపై జరిగే ప్రమాదాలు గుర్తుకొచ్చాయి. రోడ్డు ప్రమాదాలపై అవగాహనను మనం ట్రాఫిక్ పోలీసుల వరకే పరిమితం చేస్తున్నాం. కానీ ఇతర దేశాల్లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా పిల్లలకే అవగాహనా తరగతులు నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు బాధితులకు, వారి కుటుం బాలకే గాక మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థపై సైతం చూపే ప్రభావం ఎలా ఉంటుందో బొమ్మలలో చూపి, వివరించి చెబుతున్న ట్రాఫిక్ పాఠాలను పిల్లలు శ్రద్ధగా వింటున్నారు. పిల్లలను మంచి పౌరులుగా తయారు చేయా లనే తపన, లక్ష్యం అక్కడి విద్యావ్యవస్థలో బలంగా కనబడుతుంది. ఆ బోధన చిన్నప్పటి నుంచే మొదలవుతుంది. ఉన్నత పాఠశాలకు వెళితే ఒక డాక్టర్ వచ్చి మాదక ద్రవ్యాల వాడకం పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై, ఎదుగుదలపై ఎలాంటి దుష్ర్పభావాలను కలిగిస్తుందో, ఆ వ్యసనం ఎలాంటి సామాజిక సమస్యలకు దారితీస్తుందో వివరిస్తున్నాడు. అనర్ధాలకు అడ్డుకట్ట అవగాహనే మరో సందర్భంలో ఒక కళాశాలకు వెళ్ళాను. అక్కడ 14 నుంచి 16, 17 ఏళ్ల లోపు విద్యార్థులున్నారు. ఆ తరగతి గదిలో అంతా మగపిల్లలే ఉండడం గమనించాను. మానవ పునరుత్పత్తి ప్రక్రియను గురించి వారికి వివరిస్తు న్నారు. వయసుతోపాటూ క్రమంగా ఆడ, మగ పిల్లల శరీర భాగాల్లో వచ్చే మార్పులేమిటి? సంపర్కం వలన గర్భం రావడం, గర్భంలో శిశువు ఎదుగు దల ఎలా సాగుతుంది? అనే విషయాలను అక్కడ విడమర్చి చెపుతున్నారు. విచ్చలవిడి సంపర్కం వల్ల ఎటువంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది? వాటి దుష్పరిణామాలేమిటి? వంటి పలు విషయాలపై యుక్త వయస్సులోకి అడుగిడుతున్న పిల్లలకు తరగతి గదుల్లోనే అక్కడ అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ అలాంటి అంశాలను బహిరంగంగా చర్చించడానికే సంకోచిస్తాం. ఆ బోధనాంశం ప్రత్యేకతకు అనుగుణంగానే ఆడ, మగ పిల్లలకు ఇలాంటి తరగతులను వేరువేరుగా నిర్వహిస్తారు. చిన్నతనం నుంచే, తరగతి గది నుంచే మంచి పౌరులను తయారు చేయడంలో తీసుకునే ఈ జాగ్రత్తల వల్లనే ఆయా దేశాల్లో నేరాలు దినదినం తగ్గుతుంటాయి. నేరాలను తగ్గించడంలో పోలీసుల పాత్ర ఎంతుంటుందో, పౌరుల పాత్ర కూడా అంతే ఉంటుందని ఇలాంటి అవగాహనా తరగతుల ద్వారా విద్యార్థులకు బోధిస్తున్నారు. కానీ మన దేశంలో నేరాలు, నేరాల నివారణ వంటి అంశాలపై అవగాహనంతా పోలీసులకే పరిమితం అవు తోంది. కాబట్టే ఈ సమస్య పట్ల మొత్తంగా సమాజానికి ఉన్న బాధ్యతను విస్మరిస్తున్నాం. అందువల్లనే ఒకే విధమైన నేరాలు పదేపదే పునరావృతం అవుతున్నాయి. ‘యాసిడ్ దాడులకు మేమే కారణం!’ వరంగల్‌లో జరిగిన ఒక దుర్ఘటన సందర్భంగా ఒక పోలీస్ ఆఫీసర్ నాతో కొన్ని ముఖ్యమైన, ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించారు. ఆడపిల్లలపై జరిగిన యాసిడ్ దాడుల గురించి మాట్లాడుతూ ఆయన నాతో పంచుకున్న భావాలు పౌర సమాజాన్ని ఆలోచింపజేసేవిగా అనిపించాయి. యాసిడ్ దాడులలాంటి సంఘటనలు జరగడానికి తామే కారణమని ఆ అధికారి అన్నాడు. ఎందుకు? అని అడిగాను. వామపక్ష భావాలు ప్రచారంలో ఉన్న ప్పుడు పిల్లలు సామాజిక సమస్యలను గురించి ఆలోచించేవారు. యువతీ యువకులు జీవితంలో ఎదురయ్యే సమస్యలపై కలసి పనిచేసేవారు. మేం మా పోలీసు బలగాలతో కలసి వామపక్ష విద్యార్థి సంఘాలే లేకుండా చేశాం. వారిని బలవంతంగా అణచివేశాం. సామాజిక సమస్యలపై పోరాడే వారిని నేరస్తులుగా చిత్రీకరించాం. సమాజం బాగు కోసం యోచించే విద్యార్థుల ఆలోచనలను స్వీయ మానసిక సమస్యలపైకి మళ్లించామంటూ ఆ అధికారి బాధతో చెప్పారు. సినిమాలు బోధిస్తున్నదేమిటి? అలా స్వీయగత మనస్కులైన విద్యార్థుల ఆలోచనలు పెడదోవలు పట్టడానికి సినిమాలు తోడయ్యాయంటూ ఆయన ఆ విషయాన్నీ వివరించారు. సినిమాల్లో కుమ్మరిస్తున్న విషభావజాలంతో కుర్రాళ్లలో ఉద్రేకాలు అవధులు దాటి రెచ్చిపోతాయి. వినోదం అర్థం మారుతుంది. ఆ ‘వినోదం’గా చూపే దాన్ని స్వయంగా అనుభవించాలనే కోరిక బలంగా ఏర్పడుతుంది. సంపన్న వర్గాల వారైతే ఎలాగోలా వారి కోర్కెలను తీర్చుకుంటారు. అది సమాజానికి ఆమోదయోగ్యమే. అదే పేద, దిగువ మధ్యతరగతి వారైతే ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల ఆ ‘వినోదాన్ని’ డబ్బుతో కొనుక్కుని అనుభవించ లేరు. కనుక పర్యవసానాల గురించిన ఆలోచనే లేకుండా బలప్రయోగం ద్వారా వాటిని తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. అంటే నేరాలకు పాల్పడతారు. సామాజిక సమస్యలు, ప్రజా జీవితాలను గురించి ఆలోచించాల్సిన వయసు లోని యువత ఆలోచనలను మేమూ, సినిమా వాళ్లు కలసి ధ్వంసం చేశాం. ఆ విధ్వంసం ఫలితాలు నేడు అనేక రూపాలు తీసుకుంటున్నాయి. మరోవంక దేశవ్యాప్తంగానే ఆర్థిక అసమానతలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పేదవాడికీ, ధనికుడికీ మధ్య అగాధం పెరుగుతున్నది. ఒకడు డబ్బుతో అనుభవిస్తున్నాడు. రెండవ వాడు బలంతో తన కోర్కెను తీర్చుకుంటున్నాడు. కాబట్టే నేను బాధపడుతున్నాను అంటూ ఆ పోలీసు అధికారి తన ఆవేదనను నాతో పంచుకున్నారు. ఎవరినని నిందించాలి? కాలేజీల్లో విద్యార్థి సంఘాలు ఉన్నప్పుడు విద్యార్థినీ, విద్యార్థులంతా సామాజిక సమస్యలపై కలసి ఆలోచించేవారు, పనిచేసేవారు. ప్రజాసంఘాల పోరాటాల్లో విద్యార్థులు ముందుండేవారు. ఆ వాతావరణాన్నే సినిమాలు కూడా ప్రతిబింబించేవి. సమాజం ప్రభావం సినిమాలపైన ఉండటం సహ జం. అందుకే అప్పట్లో సామాజిక సమస్యలపై సినిమాలు తీసేవారు. అలాం టి విద్యార్థులను ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, అర్థరహితమైన హింస వంటి పెడదోవల్లోకి నేటి సినిమా ‘వినోదం’ మళ్లించింది. సినిమాల్లోని హీరోల వీరోచిత కృత్యాలు ఎప్పుడూ సుఖాంతమే అవుతాయి. నిజజీవితంలో ఇలాంటి చర్యలన్నీ వికృతమైనవిగానే మిగులుతాయి, వైఫల్యాలనే మిగులు స్తాయి. ప్రతీకార వాంఛను ప్రేరేపించి మానవత్వాన్ని మంటగలిపేసేట్టు చేస్తాయి. ఆడపిల్లలపై యాసిడ్ దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా యంటే దానికి ఎవరు కారణం అంటారు? విద్యార్థులా? సినిమా మార్కెట్టా? లేక పాలనా యంత్రాంగం పట్టింపులేని వైఖరా? మనం ఎవరినని నిందిస్తాం? ఈ విపరిణామాలకు బలైపోతున్నదెవరు? శిక్షలతో నేరాలకు అడ్టుకట్ట వేయగలమా? నేరాలు అన్ని దేశాల్లో జరుగుతాయి. అన్ని దేశాల్లో వచ్చినట్టే కాలాను గుణంగా మన దేశంలోని యువత మానసిక స్థితిలో కూడా మార్పు వచ్చింది. కానీ ఇతర దేశాల్లో ఆ మానసిక స్థితిని సన్మార్గంలోకి మళ్ళించారు. పాలనా యంత్రాంగం, విద్యావ్యవస్థ, పోలీసు యంత్రాంగం, పౌరసమాజం అంతా కలసి యువత ఆలోచన పెడదోవలు పట్టకుండా నిరోధించేందుకు చేస్తున్న కృషి ఫలితం అది. నేరపూరిత ఆలోచనా విధానానికి అక్కడ వారంతా అడ్డుకట్టవేస్తున్నారు. అందుకు భిన్నంగా మన దేశంలో నేరాలు జరగడానికి కావాల్సిన వాతావరణాన్ని మనమే సిద్ధం చేసుకుంటున్నాం. నేరం జరిగాక అందరం కలసి దాన్ని ఖండిస్తాం. జరిగిన నేరాన్ని అత్యంత తీవ్రమైనదిగా పరిగణిస్తాం. అవసరమైతే ఉరిశిక్షకు కూడా వెనకాడం. ఇదేనా సమస్యకు పరిష్కారం? ఉరిశిక్షతో నేరాలు ఆగుతాయా? నేరంతో నేరాన్ని నిరోధిం చలేం. పౌరసమాజం, పాలనా యంత్రాంగం దూరదృష్టితో తగు చర్యలు తీసుకుంటే సమాజంలో నేరాలు క్రమేణా తగ్గుతాయి. నేరగ్రస్తతను మొగ్గ లోనే తుంచేయాలంటే ఆ పని ఇంటి నుంచే, బడి నుంచే మొదలు కావాలని పాలకులు గుర్తించాలి. విద్యార్థికి సామాజిక సమస్యలపై అవగాహన, బాధ్యత నేర్పాలి. అంతేగానీ నేరం జరిగే పరిస్థితులకు అవకాశం కల్పించి, నేరం జరిగే వరకు వేచి ఉండి, జరిగిన నేరాన్ని తీవ్రంగా పరిగణించడం వల్ల ఫలితం శూన్యం. నేరం జరగకుండా నివారించేందుకు వివిధ ప్రభుత్వ యంత్రాంగాలు ఏవిధంగా పనిచేయాలన్నదే నేటి సవాల్. (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ)