శతక నీతి – సుమతిమీ కింకరులం ..

Respect and obedience to teachers - Sakshi

‘‘ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ...’’ అంటూ బద్దెనగారు ఇంకా ... ‘‘పాఱకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!... అని కూడా అంటున్నారు. పాఱకుమీ రణమందున అంటే... యుద్ధరంగంలోకి దిగినవాడు యుద్ధం చేసితీరవలసిందే... శరీరత్యాగానికి సిద్ధపడే పోతాడు. అసలు నిజానికి ఆ ఆలోచన కూడా రాదు వీరుడికి...విజయ సాధనే ఏకైక లక్ష్యం.. దాన్ని సాధించాలన్న ఆలోచన తప్ప మరొకటి ఉండదు, ఉండకూడదు కూడా. ఒకవేళ సగంలో వెనుదిరిగితే... అది అత్యంత హేయమైన చర్య. వీరుడిగా గౌరవం పొందడు.

కురుక్షేత్ర సంగ్రామ సమయం లో ‘నేను అర్జునుడిని ఓడిస్తా..’ అని కర్ణుడు మాట్లాడినప్పుడల్లా.. భీష్మాచార్యుడు... ‘‘గతంలో ఎన్నిమార్లు నువ్వు అర్జునుడితో తలపడ్డావు.. ద్రౌపదీ స్వయంవరమప్పుడు అర్జునుడి చేతిలో ఓడిపోయావు, ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు బాణప్రయోగం చేస్తే పారిపోయావు, ఘోష యాత్ర జరుగుతున్నప్పుడు చిత్రసేనుడితో పోరాడలేక నువ్వు పారిపోతే అర్జునుడు వచ్చి చిత్రసేనుణ్ణి ఓడించి అందర్నీ కాపాడాడు... ఇన్నిసార్లు ఓడినవాడివి నీవిప్పుడు అర్జునుడిని ఓడిస్తానని ప్రగల్భాలు ఎందుకు పలకడం...’’ అనేవాడు. అయితే ఇప్పుడు యుద్ధాలు లేవు కానీ అంతకంటే క్లిష్టమైన జీవిత సమస్యలున్నాయి...  ఏదయినా పోరాటమే... పోరాటానికి దిగేటప్పుడు దాని అంతు తేలుస్తా... అనే ఉక్కు సంకల్పంతో పోరాడాలి.. ఒకసారి పోరాడడం మొదలయిన తరువాత దాన్ని మధ్యలో వదిలేయకూడదన్నదే బద్దెన సందేశం.

ఆయన ఇంకా ఏమంటున్నారు... ‘మీరకుమీ గురువలాజ్ఞ మేదిని సుమతీ’... పూర్తిగా పక్వానికి రాని పండ్లను తినడం, బంధువులను దూషించడం, ఒక పనిని మొదలుపెట్టి మధ్యలో వదిలేయడం ఎంతగా నిషిద్ధమో... అలాగే గురువుగారు చెప్పిన మాటలను పూర్తి శ్రద్ధతో ఆలకించి, ఆచరించడం కూడా అంతే అవసరం.

ఆత్మబుద్ధి సుఖంచైవ... కొన్ని సంక్లిష్ట సందర్భాల్లో మనం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అప్పుడు మన మనసు కు తట్టిన ఆలోచనలు మంచివే, వాటిని ఆచరించడానికే మనసు మొగ్గు చూపుతుంటుంది కానీ... గురుబుద్ధిర్విశేషతః... అటువంటప్పుడు సందర్భాన్నిబట్టి గురువుగారు గతంలో చెప్పిన విషయాలు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలి.  అవి మన ఆలోచనలకంటే మెరుగ్గా ఉంటాయి కనుక వాటిని కూడా శ్రద్ధగా పరిశీలించాలి. అప్పుడు మంచి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంటుంది. అందువల్ల గురువుగారికి ఆయన మాటలకు ఎప్పుడూ ఆ గౌరవం ఇవ్వాలి.

తాటక సంహారం తరువాత సుబాహుణ్ణి చంపగా, మారీచుణ్ణి దూరంగా తరిమికొట్టాడు రామచంద్రమూర్తి. రుషులందరూ వచ్చి పిల్లవాడివయినా దేవేంద్రుడిలాగా పోరాడావయ్యా... అంటూ బాగా పొగిడారు. సాధారణంగా పిల్లలను అందరిముందు పొగిడితే కించిత్‌ గర్వం వస్తుంది. విశ్వామిత్రుడు వారి గురువు. మరుసటిరోజు ఉదయాన రామలక్ష్మణులు చేతులు కట్టుకుని ఆయన ముందు నిలబడి ‘‘ఇమౌ స్మ ముని శార్దూల కింకరౌ సముపస్థితౌ, ఆజ్ఞాపయ మునిశ్రేష్ఠ శాసనం కరవావ కిం..’’ అన్నారు వినయ విధేయతలతో. అంటే–‘‘హే గురువర్యా! దశరథ మహారాజుగారి కుమారులు, కోసల రాజ్యానికి రాకుమారులు..అనే దృష్టితో మమ్మల్ని చూడకండి. మీ కింకరులం..అంటే మీ సేవకులం.. ఇది చేసి పెట్టు .. అని శాసించండి. అది అలా చెయ్యడం మా జీవితానికి అదృష్టంగా భావిస్తాం.. మీరలా ఆజ్ఞాపిస్తే.. మేము మీ అనుగ్రహానికి పాత్రులయినట్టు లెక్క...’’ అన్నారు. అదీ గురువులపట్ల ఉండాల్సిన గౌరవం, విధేయత...

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top