‘హి’..స్టోరీకెవిన్ కుంటా
హీరో రామ్‌చరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘మీరు అతన్ని బాగా ఫేమస్ చేసేశారు, నేనిక అతన్ని బయటకు వెళ్లనివ్వబోవడం లేదు’ అంటూ జోక్ చేశారంటే... అది ఎవరి గురించి అయి ఉంటుంది?
బహుశా రామ్ చరణ్ బాడీ గార్డ్ కెవిన్ కుంటా గురించే అయి ఉండొచ్చు.. అవును మరి... ఆయన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. ఈ బాడీగార్డ్ తమ కుటుంబంతో కలిసి దాదాపు నాలుగేళ్లుగా ప్రయాణిస్తున్నాడని, తమ వ్యక్తిగత దినచర్యల గురించి అతనికి బాగా అవగాహన ఉందని, పిల్లలతో కలిసి బయటకు వెళ్ళినప్పుడు తమతోపాటే ఉంటాడని రామ్ చరణ్ ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
వీడియోతో వైరల్...
నాలుగేళ్లుగా ఉన్నప్పటికీ...‘పెద్ది’ సినిమా దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాల సమయంలో మాత్రం రామ్‌చరణ్ పక్కనే నిలబడి నిలువెత్తు స్టైలిష్ లుక్‌లో కనిపించిన కెవిన్ అందరి దృష్టినీ ఆకర్షించాడు. మరీ ముఖ్యంగా.. ఒక అభిమాని జాన్వి, చెర్రీల దగ్గరకు అకస్మికంగా దూసుకురాగా రెప్పపాటులో అడ్డుకున్న కెవిన్ అతడిని అమాంతం రెండు చేతుల్తో ఎత్తేసి అవలీలగా మోసుకుంటూ తీసుకెళ్లిన వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా అతను సెలబ్రిటీ బాడీగార్డ్స్‌లో సెలబ్రిటీగా మారిపోయాడు. మన దేశంలో తనకు లభిస్తున్న అనుకోని ఆదరణకు ఉబ్బితబ్బిబ్బయిన 28 ఏళ్ల కెవిన్ సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు, సినీ అభిమానులకు తనపట్ల వారు చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేశాడు.
నేపథ్యం ఇదే...
ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ ప్రకారం, కెవిన్ తాను గాంబియాలో జన్మించి ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్లో నివసిస్తున్న వ్యక్తిగా, అంతర్జాతీయ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఎ)ఫైటర్‌గా పరిచయం చేసుకున్నాడు. ఆన్ లైన్లో 81,900 మంది ఫాలోయర్లతో చెప్పుకోదగ్గ అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. అతని పోరాట రికార్డులు టాపోలజీ వంటి ఆన్‌లైన్ ΄్లాట్‌ఫార్మ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో అతను అబ్డో కాదిర్ర్ సోవె అనే అసలు పేరుతో నమోదవడం విశేషం.
గాంబియా రెజ్లింగ్ అసోసియేషన్ గుర్తింపు ΄÷ందిన బిరుదు ల్యామిన్ ఆఫ్ బర్రాగా కూడా కెవిన్ రెజ్లింగ్ సర్కిల్‌లో సుపరిచితుడు. అతను గత నవంబరులో మిడిల్ వెయిట్ కేటగిరీలో ఎంఎంఎ ఫైట్‌లో పాల్గొన్నాడని కూడా సమాచారం. తన సేవలకు గానూ రోజువారీగా ఫీజు వసూలు చేసే కెవిన్... ప్రస్తుత సేవల ఖరీదు రోజుకు రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకూ ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనా... ఒక ఇండియన్ సెలబ్రిటీ బాడీగార్డ్ ఇంత ఫాలోయింగ్ అందుకోవడం విశేషం. ఈ ఫాలోయింగ్ కెవిన్‌ను తెరకెక్కించే ఛాన్స్ కూడా లేకపోలేదు... చూద్దాం మరి!
– ఎస్. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్


