సంగీతానికి సరిహద్దులు లేవని, ఏ భాష పాటకైనా మన మట్టి వాసనను అద్ది కొత్తగా మార్చవచ్చని రాజస్థానీ జానపద కళాకారులు నిరూపించారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పాటకి మన స్థానిక సంస్కృతిని జోడించి.. అందరిచే వహ్ వా అనిపించుకుంటున్న వారి సృజనాత్మకతకు నెటిజనులు ఫిదా అయ్యారు.
ఆఫ్రికన్ రిథమ్స్‌తో సాగే షకీరా పాడిన వాకా వాకా అనే ఆ పాటకు మన మూలాలను జోడించడం అద్భుతం. ఇండియాస్ గాట్ టాలెంట్‌లో మూడుసార్లు పాల్గొన్న ఈ కళాకారుల బృందం, తమదైన శైలిలో రాజస్థానీ సాంప్రదాయ సంగీతంలోకి వాకా వాకా పాటను రీమిక్స్ చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు.
సారంగి, ఖర్తాల్, డోలక్ వంటి వాద్యాలతో ఈ గ్లోబల్ పాటకు దేశీ టచ్ ఇచ్చారు. ఈ పాట చివరలో వచ్చే దిస్ టైమ్స్ ఆఫ్ ఆఫ్రికా అనే ప్రసిద్ధ పంక్తిని వారు వెల్కమ్ టు రాజస్థాన్ (Welcome to Rajasthan) అని మార్చడం ఇందులోని ప్రత్యేక ఆకర్షణ. రంగురంగుల తలపాగాలు, ఎంబ్రాయిడరీ జాకెట్లు, అద్దాలతో అలంకరించిన డ్రస్సులతో పక్కా రాజస్థానీ వాతావరణాన్ని కళ్లముందు ఉంచారు ఆ కళాకారులు.
రాజస్థానీ జానపద కళాకారుల బృందం ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో వైరలయ్యింది. బస్సు ప్రయాణంలో కూడా తమ కళను ప్రదర్శిస్తూ వారు పంచుతున్న ఆనందం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
చదవండి: కొత్త పెళ్లికూతురి స్టన్నింగ్ క్యాచ్..!


