Inspirational Story Of Radha: సంకల్పిస్తే... రాదన్నది లేదు

Radha Age 60 Proves No Barrier For Long jump-Triple jump-Hammer Throw - Sakshi

కష్టాలేమీ లేనప్పుడు మనలో బలమెంత ఉందో మనకు కూడా తెలియదు. ఆ కష్టం దాటాక మనలోని బలమెంతో మనతోబాటు పదిమందికీ తెలుస్తుంది. ఈ మాటలకు అర్థం ఆరుపదుల వయసులో ఉన్న రాధతో మాట్లాడితే తెలుస్తుంది. పెద్ద వయసులో ఇంకేం చేస్తారులే అనుకోకుండా క్రీడల్లో తనని తాను నిరూపించుకుంటూ నేటి యువతకూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 

హైదరాబాద్‌ నిజాంపేటలో ఉంటున్న రాధ ఆరు పదుల వయసులో లాంగ్‌ జంప్, ట్రిపుల్‌ జంప్, హ్యామర్‌ త్రో వంటివి చేస్తూ క్రీడలకు వయసు అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు. ఈ వయసులో మెడల్స్‌ సాధిస్తూ అథ్లెట్‌గా రాణిస్తున్నారు. క్రీడలంటే ఉన్న ఆసక్తి గురించి మాట్లాడినప్పుడు రాధ తన జీవిత విశేషాలను ఎంతో ఆనందంగా ఇలా పంచుకున్నారు. అవన్నీ నేటి మహిళలకు స్ఫూర్తినిచ్చే వాక్కులు. 

జీరో నుంచి మొదలు
‘ముప్పై ఐదేళ్లుగా టీచర్‌గా చేస్తున్నాను. పాతికేళ్లుగా స్కూల్స్‌ నడుపుతున్నాను. నిజానికి నేను సెవంత్‌ క్లాస్‌ డ్రాపౌట్‌ స్టూడెంట్‌ని. పెళ్లి చెయ్యాలి అనుకోగానే ఇంట్లో చదువు మానిపించారు. మెట్రిక్యులేషన్‌కు ఇంటి నుంచే ఫీజు కట్టించారు. ఆ తర్వాత పెళ్లి అయింది. మా వారిది బిజినెస్‌. ఇద్దరు పిల్లలకు ఐదేళ్లు వచ్చేసరికి బిజినెస్‌లో పూర్తి లాస్‌. జీవితం జీరో అయిపోయింది. అప్పుడు ఎలా ఈ జీవితాన్ని కొనసాగించాలో అర్థం కాలేదు. పిల్లలు చిన్నవాళ్లు. ఎటూ దిక్కుతోచని పరిస్థితి. ఈ లైఫ్‌ ఎందుకు అనే డిప్రెషన్‌ వచ్చేసింది. దాని నుంచి ఎలాగో బయటపడి పెళ్లి తర్వాత చదువును కొనసాగించా. కష్టపడి బీఈడీ చేయడంతో టీచర్‌గా మళ్లీ నా లైఫ్‌ని కొనసాగించాను. డబ్బులు సరిపోవని సాయంత్రాలు ట్యూషన్లు చెప్పడంతో నా పిల్లలకు చదువులు చెప్పించగలిగాను. పిల్లలు పెద్దవడంతో వాళ్లూ నాకు సాయంగా ఉండటం మొదలుపెట్టారు. పదిహేనేళ్లు ఉద్యోగం చేశాక బొల్లారంలో గీతాంజలి స్కూల్‌ ప్రారంభించాను. ఆ తర్వాత మరో ఐదేళ్లలో నిజాంపేటలో మరో బ్రాంచ్‌ ఏర్పాటు చేశాను. 

డిజైనర్‌ డ్రెస్సులతో విదేశాలకు..
నాకు డ్రెస్‌ డిజైన్స్‌ అంటే కూడా చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని ఎందుకు వదులుకోవడం అని స్కూల్‌ నడుపుతూనే బొటిక్‌ కూడా స్టార్ట్‌ చేశా. అది కూడా చాలా సక్సెస్‌ అయ్యింది. వీటిని తర్వాత్తర్వాత విదేశాలకు ఆర్డర్లమీద పంపించేదాన్ని. అమెరికాలో జరిగిన ఈవెంట్స్‌లో కూడా నా బొటిక్‌ డిజైన్స్‌ డిస్‌ప్లే చేసి, సేల్‌ చేసేదాన్ని. 

మెడల్స్‌ను తీసుకొచ్చిన ఇష్టం
బిహెచ్‌ఇఎల్‌ లో ఉన్నప్పుడు అక్కడి స్టేడియమ్‌ పిల్లలను స్కేటింగ్‌కి తీసుకెళ్లేదాన్ని. వారిని స్కేటింగ్‌లో వదిలేసి, నేనూ స్పోర్ట్స్‌లో పాల్గొనేదాన్ని. హ్యామర్‌ త్రోలో పాల్గొన్నప్పుడు సెకండ్‌ మెడల్‌ వచ్చింది. దాంతో మరింత పట్టుదల పెరిగింది. స్పోర్ట్స్‌ మీట్‌ ఉన్నప్పుడు వారం మొత్తం ప్రాక్టీస్‌ తప్పనిసరి. హ్యామర్‌ త్రో కి చాలా ఫిట్‌నెస్‌ అవసరం. మహిళల విభాగంలో నాలుగు కేజీల బరువైన ఐరన్‌ బాల్‌ని విసరాలి. సాధారణంగా నలభైఐదు దాటాక ఆక్సిజన్‌ లెవల్స్, శారీరక ఫిట్‌నెస్‌ తగ్గుతుంటాయి దీనిని పెంచుకోవాలంటే రోజూ వాకింగ్, వ్యాయామం తప్పనిసరి. దీనివల్ల మానసిక ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అలా, 35 ఏళ్లుగా నేషనల్, ఇంటర్నేషనల్‌ గేమ్స్‌లో పాల్గొంటూ వచ్చాను.

దీంతో ఇటీవల బెంగళూరులో జరిగిన టోర్నమెంట్‌లో నాలుగు మెడల్స్, హన్మకొండలో జరిగిన స్పోర్ట్స్‌ మీట్‌లో 3 మెడల్స్‌ వచ్చాయి. ప్రతి ఏడాది జరిగే స్పోర్ట్స్‌ మీట్‌లో తప్పనిసరిగా పాల్గొంటాను. ఫిట్‌నెస్‌ లేకుండా డైరెక్ట్‌గా లాంగ్‌ జంప్‌ లేదా ట్రిపుల్‌ జంప్‌ చేసినా, రన్నింగ్‌ చేసినా సమస్యలు వస్తాయి. అందుకే రోజూ ఒక గంటైనా ప్రాక్టీస్‌ చేస్తుంటాను. ఎవరైనా అడిగితే ఉచితంగా కోచింగ్‌ ఇస్తుంటాను. ఏ జిల్లాలోనైనా పది మంది మహిళలు ‘జట్టుగా ఉన్నాం, మాకు గ్రౌండ్‌ ఉంది, టోర్నమెంట్‌లో పాల్గొంటాం’ అని మాకు తెలియజేసినా... అలాంటి వారికి ఉచితంగా కోచ్‌ని ఏర్పాటు చేస్తాం.  

ఏమీ చేయలేని పరిస్థితులు వచ్చాయి కదా! అనుకున్నప్పుడు మళ్లీ స్టాండ్‌ అవ్వాలని బలంగా అనుకున్నాను. అలాగే జరిగింది. ఆ రోజుల్లో నేనేమీ చేయలేను అనుకుంటే నా పిల్లల భవిష్యత్తు ఏమయ్యేదో. ఎవరికైనా ఇష్టాయిష్టాలు ఉంటాయి. కానీ, కుటుంబం నిలబడాలంటే త్యాగాలు తప్పవు. కష్టం వస్తేనే సాధించాలనే పట్టుదల పెరుగుతుంది. కుటుంబం నిలబడాలంటే మనం బలంగా ఉండాలి. అందుకు మనలో ఏ శక్తి ఉందో తెలుసుకొని, ఆచరణలో పెట్టాలి. అప్పుడు తప్పక విజయం సొంతం అవుతుంది’’ అంటూ తన జీవితాన్ని నేటి మహిళలకు ఓ ఉదాహరణగా వివరించారు రాధ.
– నిర్మలారెడ్డి   

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top