Priyaswara Bharti: ప్రేరణనిచ్చే ప్రియస్వరం | Sakshi
Sakshi News home page

Priyaswara Bharti: ప్రేరణనిచ్చే ప్రియస్వరం

Published Sun, Oct 2 2022 12:47 AM

Priyaswara Bharti: She is Ashoka Young Change-maker 2021 - Sakshi

పట్టుమని పదేళ్లు కూడా నిండకముందే తండ్రి మరణం, దీనికితోడు ఆర్థిక పరిస్థితులు దిగజారి భవిష్యత్‌ శూన్యంగా కనిపించింది. విధి వంచించిందని సర్దిచెప్పుకుని ముందుకు సాగుతోన్న తరుణంలో ఎంతో ఇష్టమైన చెల్లి, తల్లి అకాల మరణాలు అమాంతం పాతాళంలోకి లాగినట్టు అనిపించాయి. అయినా ఏమాత్రం భయపడకుండా ఎదురవుతోన్న ఆటుపోట్లను బలంగా మార్చుకుని సామాజిక వేత్తగా, డైరెక్టర్‌గా రాణిస్తోంది ప్రియస్వర భారతి. 21 ఏళ్లకే జీవితానికి సరిపడినన్ని కష్టాలను అనుభవించిన ప్రియస్వర నేడు అవార్డు విన్నింగ్‌ డాక్యుమెంటరీలు తీస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది.

బీహార్‌లోని గోపాల్‌గంజ్‌ జిల్లాలో చిన్న గ్రామానికి చెందిన  ప్రియ స్వరభారతి. నలుగురు సంతానంలో ఒకరు. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రైవేటు స్కూలు టీచర్స్‌.  భారతికి తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు అనుకోకుండా తండ్రికి యాక్సిడెంట్‌ అయ్యింది. మెరుగైన చికిత్సనందించేందుకు పాట్నాకు తీసుకెళ్లారు.  ప్రారంభంలో ఆరునెలలు అనుకున్న చికిత్స మూడేళ్లపాటు కొనసాగింది. దీంతో కుటుంబం మొత్తం అక్కడే ఉండాల్సి వచ్చింది. ఉన్నదంతా ఖర్చుపెట్టి చికిత్స చేయించినప్పటికీ ఫలితం దక్కకపోగా, తండ్రిని కోల్పోయారు. మరోపక్క ఆర్థిక ఆధారం లేక నలుగురూ మూడేళ్లు స్కూలుకు వెళ్లలేదు.

ట్యూషన్లు చెబుతూ...
తండ్రి చనిపోయాక భారతి తల్లి ఉద్యోగం చేసినప్పటికీ కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. దీంతో తల్లికి సాయపడేందుకు హోమ్‌ ట్యూషన్స్‌ చెప్పేది భారతి. ఇదే సమయంలో స్కూలుకు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో ఎక్స్‌ట్రాకరిక్యులర్‌ యాక్టివిటీస్‌ను నేర్పించే కిల్కారి సంస్థలో చేరింది. అక్కడ సైన్స్‌ ప్రాజెక్టుపై మక్కువ ఏర్పడడంతో ఎంతో ఆసక్తిగా నేర్చుకునేది. దీంతో 2013లో కిల్కారి నుంచి యూనిసెఫ్‌కు ఎంపికైన 20 మందిలో భారతి ఒకరు. కిల్కారి, యూనిసెఫ్‌ ద్వారా పిల్లల హక్కుల గురించి వివరంగా తెలుసుకుని తన తోటి వలంటీర్లతో కలిసి ‘బీహార్‌ యూత్‌ ఫర్‌ చైల్డ్‌ రైట్స్‌’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా పిల్లలకు విద్య, బాలల హక్కులపై అవగాహన కల్పించడం, బాల్యవివాహాలు, మహిళలు, ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యంపై అవగాహన కల్పించేది. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ వివిధ వర్క్‌షాపులు, వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది.

చెల్లితో కలిసి డైరెక్టర్‌గా...
ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ అసోసియేషన్, కిల్కారి సంస్థలు రెండు కలిసి పదిరోజుల పాటు డైరెక్షన్ లో ఉచితంగా వర్క్‌షాపు నిర్వహించాయి. అప్పుడు యూనిసెఫ్‌ అడ్వైజరీ బోర్డు యువ యంగ్‌ పీపుల్‌ యాక్షన్‌ టీమ్‌లో సభ్యురాలిగా కొనసాగుతోన్న భారతి సినిమాటోగ్రఫీపై ఆసక్తితో పదిరోజులపాటు వర్క్‌షాపుకు హాజరైంది. తరువాత తన చెల్లి ప్రియాంతరాతో కలిసి ‘గెలటాలజీ’ డాక్యుమెంటరీ తీసింది. తొమ్మిదో జాతీయ సైన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ డాక్యుమెంటరీకి స్పెషల్‌ జ్యూరీ అవార్డు వచ్చింది. తరువాత 2019లో పట్నాను ముంచెత్తిన వరద బీభత్సాన్ని కళ్లకు కట్టేలా ‘ద అన్‌నోన్‌ సిటీ, మై ఓన్‌ సిటీ ఫ్లడెడ్‌’ పేరుతో మరో డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ డాక్యుమెంటరీకి కూడా ఆర్ట్స్‌ అండ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో స్పెషల్‌ జ్యూరీ అవార్డు వరించింది. 2018 నుంచి డాక్యుమెంటరీలు తీస్తూ జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌కు పంపిస్తూ అనేక అవార్డులను అందుకుంది. ప్రస్తుతం పట్నా యూనివర్సిటీలో మాస్‌ కమ్యూనికేషన్‌ చదువుతున్న భారతి కొన్ని పెద్ద ప్రాజెక్టులకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తోంది.
 
అవకాశాలు సృష్టించుకోవాలి
అవకాశాలు వాటంతట అవే మన దగ్గరికి రావు. మనమే  సొంతంగా సృష్టించుకుని ముందుకు సాగాలి. అప్పుడే జీవితంలో ఎదగగలుగుతాము. అదే నా విజయ రహస్యం.
– ప్రియస్వర భారతి
 

Advertisement
 
Advertisement
 
Advertisement