
ఒకడు కోటీశ్వరుల ఇంట్లో జన్మిస్తాడు. వానిని చూసి పేదవాడంటాడు – దేవునికి పక్షపాతముందని! లేకపోతే తనను పేదవానిగా, అతనిని ధనికునిగా ఎందుకు పుట్టిస్తాడని ప్రశ్నిస్తాడు. ఒకసారి పరమహంస యోగానంద ఒక కథ చెబుతారు.
ఒక రాజుండేవాడు. ఆయన తన ప్రధానమంత్రి పట్ల చాలా ప్రేమను, గౌరవాన్ని కనబరచే వాడు. మిగిలిన వారికి అసూయ కలిగి, రాజు గారికి పక్షపాతముందని గుసగుసలాడేవారు. రాజు గారి చెవిన ఆ విషయం పడింది. మరుసటి రోజు అందరూ సమావేశమై ఉండగా దూరంలో సంగీతం వినబడింది. అక్కడ ఏమి జరుగుతున్నదో కనుక్కొని రమ్మని ఒకనిని పంపాడు రాజు. అతడు వెళ్ళి వచ్చి అక్కడొక వివాహం జరుగుతున్నదని చెప్పాడు ఆ వ్యక్తి. ఎవరు పెళ్ళి చేసుకొంటున్నారని రాజు ప్రశ్నించాడు. ఆ వ్యక్తి ‘తెలీదు’ అన్నాడు. కనుక్కొని రమ్మని మరొకనిని పంపించాడు రాజు. ఆ వ్యక్తి తిరిగి వచ్చి ఫలానా వారిదని చెప్పాడు. రాజు మరొక్క ప్రశ్న వేశాడు. ఆ వ్యక్తి జవాబు చెప్పలేక ఊరికే నిల్చున్నాడు. కనుక్కొని రమ్మని మరొక్క వ్యక్తిని రాజుగారు పంపారు. అతడు వచ్చిన తర్వాత ఇంకొక ప్రశ్న వేస్తే జవాబు లేదు. చివరకు రాజు గారు తన ప్రధానమంత్రిని పంపారు. ఆయన వెళ్ళి వచ్చాడు. రాజు గారు అడిగిన ప్రతి ప్రశ్నకూ వివరంగా జవాబులు చెప్పాడు.
చదవండి: ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..!
అప్పుడు రాజు ‘ఇప్పుడు మీకు అర్థమైందా నేను ఆయన పట్ల ఎందుకు గౌరవాన్ని చూపుతానో?’ అని అందర్నీ చూస్తూ అడిగాడు. అందరూ తలలు దించుకున్నారు. (పుట 292: మానవుడి నిత్యాన్వేషణ–పరమహంస యోగానంద). ఒక సాధారణ రాజుగారి చర్యకే ఇంతటి బలమైన కారణముంటే సర్వజ్ఞుడైన భగవంతుడు నిష్కారణంగా ఎవరికైనా ఇస్తాడా, చేస్తాడా?
– రాచమడుగు శ్రీనివాసులు