చైతన్యపథం
పెద్ద చదువు చదువుకోలేకపోయినా, ఇంటి నాలుగు గోడలకే పరిమితం కానక్కర్లేదు. ఇల్లు దాటి బయటికి వస్తే సమాజం అనే విశ్వ విద్యాలయంలో ఎన్నో చదువుకోవచ్చు...ఈ ఎరుకతో ఇల్లు దాటి బయటికి వచ్చిన సామాన్య గృహిణి, పెద్దగా చదువుకోని చందా బాబర్(మధ్యప్రదేశ్) ఇప్పుడు ఎంతోమంది గ్రామీణ మహిళలకు స్ఫూర్తిని ఇస్తోంది.
మధ్యప్రదేశ్ ఝుబువా జిల్లాలోని గుణవాడ్ గ్రామంలో మధ్యాహ్నం వేళ కొద్దిమంది మహిళలు వేపచెట్టు కింద కూర్చొని తమ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ చర్చల్లో కీలక మహిళ... చందా బాబర్. తమకు ఏ సమస్యలు వచ్చినా గ్రామస్థులు మొదట చెప్పుకునేది ఆమెకే. ‘ప్రజలు ఎలాంటి సమస్యలతో వచ్చినా నేను వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను’ అంటుంది చందా. ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదివిన చందాకు చిన్న వయసులోనే వివాహం జరిగింది. చాలా సంవత్సరాలు ఇల్లే ప్రపంచంగా మారింది. ఇల్లు దాటి ఏదైనా చేయాలనే కోరిక ఆమెలో బలంగా ఉండేది.
ఆ ప్రశ్నతో తొలి అడుగు
ఇప్పుడు చందా బాబర్ ట్రాన్స్‌ఫామ్ రూరల్ ఇండియా (టీఆర్‌ఐ) ద్వారా శిక్షణ పొందిన ‘పంచాయత్ బద్లాన్ దీదీ’గా పిలిచే క్షేత్రస్థాయి గ్రామీణ కార్యకర్త. గ్రామీణ మహిళలు స్థానిక పరిపాలన వ్యవస్థలతో మమేకమవడానికి, వారిలో తగిన అవగాహన, ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి ఉపయోగపడే టీఆర్‌ఐ సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న చందా... ‘ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎందుకు చేరడం లేదు?’ అని ప్రశ్నించింది. ఆమెకు ఏ సమాధానం అందిందో తెలియదుగానీ, సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలనే సంకల్పంతో ఆనాటి నుంచి ఎన్నో వర్క్‌షాపులకు హాజరైంది. ఎన్నో విషయాలపై ఎంతో అవగాహన పెంచుకుంది. ‘పంచాయత్ బద్లావ్ దీదీ’ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం ఆమెను మరో మెట్టు పైకి ఎక్కించింది.
‘పంచాయత్ బద్లావ్ దీదీ’ హోదాలో ఎవరికైనా వైద్య అవసరాలు ఉంటే వారికి అన్ని రకాలుగా సహాయంగా నిలుస్తోంది. ‘ఈ ప్రభుత్వ పథకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. సద్వినియోగం చేసుకోండి’ అని ప్రచారం చేస్తోంది.
‘మా గ్రామంలో చందా మార్పు తీసుకురావాలనుకుంటోంది. మా దగ్గర గతంలో లేనిది మాకు ఇచ్చింది.. అది ప్రశ్నలు అడిగే ధైర్యం’ అని చందాను ప్రశంసిస్తున్నారు గ్రామస్థులు.
ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల వరకు... ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేయడం నుంచి ప్రజాచైతన్యం వరకు ‘పంచాయత్ బద్లావ్ దీదీ’ హోదాలో ఎన్నో మంచి పనులు చేస్తోంది.


